- ముంబయిలో ఘటన
- ప్రియుడికి, ప్రియురాలికి మధ్య మాంసం తినే విషయంలో ఘర్షణ
- ప్రియుడే చంపేశాడంటున్న అమ్మాయి బంధువులు
మాంసాహారం విషయంలో లవర్స్ మధ్య గొడవ జరగ్గా… ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. సృష్టి తులి ఓ మహిళా పైలెట్. ఆమె ప్రియుడి పేరు ఆదిత్య పండిట్. ఢిల్లీలో కమర్షియల్ పైలెట్ లైసెన్స్ కోసం శిక్షణ పొందుతున్న సమయంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది.
అయితే, ఆదిత్య పండిట్ శాకాహారి కాగా… సృష్టి తులీకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. వీరిద్దరూ ముంబయిలో కలిసి జీవిస్తున్నారు. ఈ ప్రేమికులు ఇద్దరి మధ్య నాన్ వెజ్ కారణంగా తరచుగా ఘర్షణలు జరిగేవి. ప్రియురాలు నాన్ వెజ్ తినడాన్ని ఆదిత్య పండిట్ తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ విషయంలో ఇద్దరూ పలుమార్లు గొడవపడ్డారు.
సోమవారం నాడు కూడా ఇదే అంశం ఇద్దరి మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ గొడవ అనంతరం, అర్ధరాత్రి వేళ ఆదిత్య పండిట్ ఢిల్లీ బయల్దేరాడు. అయితే, సృష్టి తులి ఫోన్ చేసి తాను చనిపోతానని బెదిరించడంతో, అతడు మళ్లీ ఇంటికి వచ్చాడు. తలుపులు వేసి ఉండడంతో, వాచ్ మన్ సాయంతో తలుపులు పగులగొట్టి చూడగా… సృష్టి తులి అచేతనంగా కనిపించింది.
ఆమెను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె మరణించినట్టు డాక్టర్లు తెలిపారు. సృష్టి తులి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు.
అయితే, సృష్టి తులి కుటుంబ సభ్యులు మాత్రం అది హత్యేనని అంటున్నారు. ఆదిత్య పండిట్ చంపేశాడని ఆరోపిస్తున్నారు. సృష్టి ఓసారి ఫంక్షన్ లో నాన్ వెజ్ తిన్నందుకు ఆమెపై దాడి చేశాడని, మరోసారి అతడి సోదరి నిశ్చితార్థానికి వెళ్లనందుకు తీవ్రంగా వేధించాడని ఆ అమ్మాయి మేనమామ వెల్లడించారు.
సృష్టి తులి స్వస్థలం ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్. ఈ ప్రాంతంలో ఆమె మొదటి మహిళా పైలెట్. దాంతో సృష్టి తులిని యూపీ సీఎం అప్పట్లో ఘనంగా సత్కరించారు.