కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ స్వల్పఅస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం హిమాచల్ పర్యటనలో ఉన్న ఆమె శనివారం అనారోగ్యానికి గురికావడంతో వెంటనే సోనియాగాంధీని ఆసుపత్రికి తరలించారు. సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లిన సోనియాగాంధీ సిమ్లాలోని ఛరబ్రాలోని గాంధీ ప్రైవేట్ నివాసంలో బస చేస్తున్నారు.
ఈ క్రమంలోనే అలసటకు గురికావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రత్యేక వైద్యుల బృందం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించింది. సోనియా గాంధీని చెకప్ కోసం ఆసుపత్రికి తీసుకువచ్చారని, ఆమెకు పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించామని ఐజీఎంసీ ఆసుపత్రిలోని ఒక సీనియర్ వైద్యుడు వెల్లడించారు. సోనియా గాంధీకి రక్తపోటు కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. సోనియా గాంధీకి చికిత్స అందిస్తోన్న ఆసుపత్రి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. సోనియా గాంధీ అస్వస్థతకు గురైనట్లు తెలియడంతో పర్యటనలో ఉన్న హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు సిమ్లాకు తిరిగి వచ్చారు. సోనియా అస్వస్థతకు గురైనట్లు తెలియడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించడంతో శాంతించారు. సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: