Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయంప్రమాదాలు ...

నైజీరియాలో పెను విషాదం… పడవ బోల్తా పడి 100 మంది గల్లంతు!

  • నైజర్ నదిలో దుర్ఘటన 
  • కోగి రాష్ట్రం నుంచి పడవ నైజర్‌లోని ఫుడ్ మార్కెట్‌కు వెళ్తుండగా ఘటన
  • ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 200 మంది ప్రయాణికులు 
  • కొనసాగుతున్న సహాయక చర్యలు.. ఏడు మృతదేహాల లభ్యం

పడవ బోల్తా పడి వంద మందికిపైగా గల్లంతైన విషాద ఘటన ఉత్తర నైజీరియాలో శుక్రవారం జరిగింది. నైజర్ నదిలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారిలో మహిళలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. కోగి రాష్ట్రం నుంచి నైజర్ వెళుతున్న సమయంలో పడవ బోల్తా పడిందని చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు పడవలో దాదాపు 200 మంది ఉన్నట్లు నైజర్ అత్యవసర విభాగాధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. 

కోగి రాష్ట్రం నుంచి నైజర్‌లో ఫుడ్ మార్కెట్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, గల్లంతైన వారిలో ఏడు మృతదేహాలు లభ్యమయినట్లు చెప్పారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దించామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. నైజీరియాలో పడవ ప్రమాదాలు సాధారణమే. వంద మందికిపైగా గల్లంతైన ఘటనలు గత ఏడాది ఐదుకుపైగానే జరిగాయి.  

Related posts

చంద్రుడి దక్షిణ ధ్రువం ఎందుకంత స్పెషల్..?

Ram Narayana

ఫ్యామిలీ మెంబర్ స్పాన్సర్ వీసాకు ఆదాయ పరిమితిని 55 శాతం పెంచిన యూకే…

Ram Narayana

హెచ్ 1 బి వీసా రెన్యూవల్ ఇకపై అమెరికాలోనే.. వచ్చే జనవరి నుంచే అమలు

Ram Narayana

Leave a Comment