- పనిమనుషులు కాదు పువ్వుల లాంటి వారంటూ వ్యాఖ్యలు
- హిజాబ్ ఆంక్షలపై పోరాడుతున్న మహిళలపై అణచివేత
- ఓవైపు అరెస్టులు, చిత్రహింసలు.. మరోవైపు మద్దతుగా ట్వీట్లు
ఇరాన్ లో హిజాబ్ ఆంక్షలకు వ్యతిరేకంగా మహిళలు ఉద్యమిస్తున్న వేళ ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఓవైపు దేశంలో మహిళలపై అణచివేత కొనసాగుతుండగా మరోవైపు మహిళలు సున్నితమైన పువ్వుల లాంటి వారంటూ ఖమేనీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మహిళలు పనిమనుషులు కాదని, ఇంట్లో వాళ్లను పువ్వుల లాగా సున్నితంగా, జాగ్రత్తగా చూసుకోవాలంటూ హితవు పలికారు. పువ్వులను జాగ్రత్తగా చూసుకున్నపుడే వాటిలోని తాజాదనం, వాటి సువాసనతో పెర్ఫ్యూమ్ తయారు చేయొచ్చని అన్నారు.
కుటుంబంలో మహిళలకు, పురుషులకు వేర్వేరు బాధ్యతలు ఉన్నాయని ఖమేనీ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఇంట్లో పిల్లల పెంపకం బాధ్యతలు మహిళలది, కుటుంబ అవసరాలకు తగ్గట్లుగా సంపాదించాల్సిన బాధ్యత పురుషులది అని చెప్పారు. వీటి ఆధారంగా మహిళలు, పురుషులను అంచనా వేయడం సరికాదని, కుటుంబంలో ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదని ఖమేనీ ట్వీట్ చేశారు.
మహిళలపై ఆంక్షలు, అణచివేతలకు వ్యతిరేకంగా ఇరాన్ లో మహిళలు కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. మోరల్ పోలీసింగ్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ తరచుగా రోడ్డెక్కుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ ధరించలేదనే కారణంతో మోరల్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించడం ఇరాన్ లో సర్వ సాధారణం.. దీనిని నిరసిస్తూ ఆందోళన చేపట్టిన మాషా అమిని అనే యువతిని పోలీసులు అరెస్టు చేసి హింసించగా కస్టడీలోనే మరణించింది. 2022 లో జరిగిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా మహిళలు ఆందోళనలు చేపట్టారు.