- ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి కళ్యాణ్‌కు వెళుతున్న రైల్లో ఘటన
- ఘట్‌కోపర్ స్టేషన్‌లో ట్రైన్ ఆగగానే ఒంటిపై నూలుపోగు లేకుండా రైలెక్కిన వ్యక్తి
- నేరుగా మహిళల కంపార్టుమెంట్‌లోకే ప్రవేశించిన వైనం
- దాంతో కంపార్టుమెంట్‌లోని మహిళలంతా ఒక్కసారిగా కేకలు
ముంబయిలో ఓ లోకల్ రైల్లో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆ రైల్లోని మహిళల కంపార్టుమెంట్‌లోకి ఓ వ్యక్తి పూర్తి నగ్నంగా ప్రవేశించాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి కళ్యాణ్‌కు వెళుతున్న రైలు మంగళవారం సాయంత్రం 4.11 గంటలకు ఘట్‌కోపర్ స్టేషన్‌లో ఆగింది. అలా ట్రైన్ స్టేషన్‌లో ఆగగానే ఓ వ్యక్తి ఒంటిపై నూలుపోగు లేకుండా రైలెక్కాడు. అతడు నేరుగా మహిళల కంపార్టుమెంట్‌లోకే ప్రవేశించాడు. దాంతో ముంబై సెంట్రల్ రైల్వేలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. ఈ ఘటన ప్రయాణికులలో భయాందోళనలకు దారితీసింది.
అతడిని రైల్లోంచి దిగిపోవాలంటూ మహిళలంతా ఒక్కసారిగా కేకలు వేయడం మొదలు పెట్టారు. అయినా అతడు వినిపించుకోలేదు. రైల్లోంచి దిగేందుకు ససేమీరా అన్నాడు. దాంతో రైలు ఆపాలని మహిళలంతా గట్టిగా అరిచారు. మహిళల అరుపులు విని టీసీ వెంటనే అక్కడికి వచ్చాడు. ఆ తర్వాత నగ్నంగా ఉన్న వ్యక్తిని కిందకు దిగమని హెచ్చరించాడు. అయినా అతడు నిరాకరించాడు. దాంతో టీసీ చేసేదేమీలేక అతడిని పక్క స్టేషన్‌లో బలవంతంగా కంపార్ట్‌మెంట్ నుంచి కిందకు దించేశాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఆందోళనకరమైన సంఘటన ముంబయిలోని సబర్బన్ రైల్వే నెట్‌వర్క్‌లో మహిళల భద్రతపై ఆందోళనలను రేకెత్తించింది. మహిళా హక్కుల సంఘాలు రైల్వే అధికారుల భద్రతా లోపాలను విమర్శించాయి. సమగ్ర విచారణకు డిమాండ్ చేశాయి. అయితే, అధికారుల విచారణలో ఆ వ్యక్తి మానసిక స్థితి సరిగా లేదని తేలింది. దాంతో అతడికి దుస్తులు ఇచ్చి బయటికి పంపించినట్లు సమాచారం.