- 30 ఏళ్ల క్రితం కేవలం 10 పౌండ్లకు కొనుగోలు చేసిన పుస్తకం
- స్టాఫోర్డ్‌షైర్‌లోని లిచ్‌ఫీల్డ్‌లో బుధవారం జరిగిన పుస్తక వేలంలో భారీ ధర పలికిన వైనం
- 1997లో తొలిసారిగా ఈ ఫస్ట్ ఎడిషన్ బుక్ కేవలం 500 కాపీలు మాత్రమే ముద్రణ
స్టాఫోర్డ్‌షైర్‌లోని లిచ్‌ఫీల్డ్‌లో బుధవారం జరిగిన పుస్తక వేలంలో అరుదైన మొదటి ఎడిషన్ హ్యారీ పోటర్ బుక్ భారీ ధర పలికింది. 30 ఏళ్ల క్రితం కేవలం 10 పౌండ్లకు కొనుగోలు చేసిన ఆ పుస్తకం వేలంలో ఏకంగా 36 వేల పౌండ్లకు అమ్ముడుపోయింది. భారత కరెన్సీలో రూ. 38.50 లక్షలు. క్రిస్టీన్ మెక్‌కల్లోచ్ తన కుమారుడు ఆడమ్ కోసం 1997లో స్ట్రాట్‌ఫోర్డ్-అపాన్-అవాన్ పుస్తక దుకాణం నుంచి ఈ అరుదైన మొదటి ఎడిషన్ కాపీని కొనుగోలు చేశారు.
హాన్సన్స్ ఆక్షనీర్స్ ప్రకారం 1997లో తొలిసారిగా బ్రిటిష్ రచయిత జేకే రౌలింగ్ రచించిన ఈ ఫస్ట్ ఎడిషన్ బుక్‌ను కేవలం 500 హార్డ్‌బ్యాక్ కాపీలు మాత్రమే ముద్రించారు. అందులో ఈ పుస్తకం ఒకటి. డెర్బీషైర్‌లోని టాన్స్లీకి చెందిన ఆడమ్ మెక్‌కల్లోచ్… ఈ కాపీని తన కుటుంబం పాత చెస్టర్‌ఫీల్డ్ ఇంటి మెట్ల క్రింద ఉన్న అల్మారాలో భద్రపరిచారు. 2020 లాక్‌డౌన్ సమయంలో ఈ మొదటి ఎడిషన్‌ల విక్రయాల గురించి తెలిసింది. తాజాగా దానిని వేలానికి పెట్టడంతో ఓ బిడ్డర్ 36వేల పౌండ్లు చెల్లించి కొనుగోలు చేసినట్లు బీబీసీ తెలిపింది.