Ramasahayam Raghuram Reddy
ఖమ్మం వార్తలు

నాకు ఎవరితో విభేదాలు లేవు – ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి

  • మంత్రులు, ఎమ్మేల్యేలు, నాయకులను కలుపుకొని పని చేస్తున్నాను
  • 60 రోజులు పార్లమెంట్ సమావేశాలకు హాజరై 60 ప్రశ్నలు వేశాను
  • డోర్నకల్ మిర్యాలగూడ రైల్యే లైన్ కు ప్రత్యామ్నాయం చూపించాను
  • ఆగి పోయిన కొత్తగూడెం ఎయిర్ పోర్టును సాధించేందుకు కృషి చేస్తున్నాను
  • ఖమ్మంలో కొత్త ప్రభుత్వ ఆసుపత్రి భవనం నిర్మించాల్సిన అవసరం వుంది
  • 200 చదరపు కిలో మీటర్ల అటవీ ప్రాంతాన్ని ప్రొటెక్ట్ చేయాలి

తనకు ఎవరితో విభేదాలు లేవని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పని చేస్తున్నానని చెప్పారు. పార్టీలో పాత కొత్త అనే తారతమ్యం లేకుండా కలుపుకు పోతున్నానని తెలిపారు. ఆదివారం ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని స్థానిక ఎమ్మెల్యేల ఆహ్వానం మేరకు ఆయా నియోజక వర్గాల్లో జరిగే అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని అన్నారు. ఎమ్మెల్యేలకు తెలియకుండా అసెంబ్లీ నియోజక వర్గాల్లో పర్యటించ వద్దని సీఎం రేవంత్ రెడ్డి చేసిన సూచన మేరకు, జిల్లాలో తన పర్యటనలు కొనసాగుతున్నాయన్నారు. ఎప్పటికప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలతో పాటు తన దృష్టికి వచ్చిన రాష్ట్ర సమస్యలను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు. ఇప్పటి వరకు 13 సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తన వంతు ప్రయత్నం చేశానన్నారు. తాను ఎంపీగా ఎన్నికైన తర్వాత, 68 రోజులు పార్లమెంట్ సమావేశాలు జరిగితే, 60 రోజులు హాజరయ్యానని తెలిపారు. తాను హాజరైన రోజుల్లో అనేక సమస్యలపై 60 ప్రశ్నలు సంధించానని చెప్పారు. పలు ప్రధానమైన సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకు పోయి పరిష్కరించానన్నారు. డోర్నకల్- నుండి మిర్యాల గూడ(జాన్ పహాడ్) వరకు నిర్మించనున్న నూతన రైల్వే లైన్ ను పాలేరు నియోజక వర్గం మీదుగా కాకుండా, ప్రత్యామ్నాయంగా వెన్నారం, మన్నెగూడెం, మరిపెడ, మోతే మీదుగా నిర్మిస్తే మొత్తం124 నుంచి 19 కిలో మీటర్లకు దూరం తగ్గుతుందని ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని రైల్వే బోర్డు చైర్మన్, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. దీని వల్ల భూ సేకరణ వ్యయం బాగా తగ్గడమే కాకుండా,  లైన్ నిర్మాణ ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. ఈ లైన్ ను ఇలాగే నిర్మిస్తే, పాలేరు నియోజక వర్గంలోని రైతులు తమ విలువైన వ్యవసాయ భూములను కోల్పోయే ప్రమాదముందన్నారు. ఇప్పటికే, గ్రీన్ ఫీల్డ్, నేషనల్ హై వేల క్రింద రైతులు భూములు కోల్పోయారని పేర్కొన్నారు. ఈ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులకు తెలియాయ కుండా 2022లో ఈ రైల్యే లైన్ కు సంబంధించిన డీపీఆర్ తయారు చేశారని తెలిపారు. ఆ తర్వాత, పీఎం ప్రోగ్రాం క్రింద ఫైనల్ కూడా చేశారన్నారు. ఇది తన దృష్టికి రాగానే, కేంద్ర మంత్రితో 5 సార్లు, రైల్యే బోర్డుతో 3 సార్లు మాట్లాడానని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో అలైన్ మెంట్ మార్చాల్సిందేనని పట్టుబట్టానన్నారు.  తన ప్రయత్నం వల్ల ప్రస్తుతం ఈ రైల్యే లైన్ నిర్మాణం ఆగి పోయిందన్నారు. అలాగే, 15 సంవత్సరాలుగా ఆగి పోయిన కొత్తగూడెం ఎయిర్ పోర్టును కూడా నిర్మించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. ప్రతిపాదిత స్థలం వద్ద గుట్టలు ఉండడం వల్ల పెద్ద విమానాల లాండింగుకు ఇబ్బందిగా వుందని తెలిపారు. అయితే, విమానాల లాండింగ్ దిశ మార్చితే, సమస్య వుండదని, ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకెళ్ళినట్లు చెప్పారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కూడా ఈ విషయంలో కేంద్ర మంత్రితో మాట్లాడారని తెలిపారు.  త్వరలోనే కొత్తగూడెం ఎయిర్ పోర్టు కల సాకారమవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు లేక రొగులు ఇబ్బంది పడుతున్నారని ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి పేర్కొన్నారు. ఆసుపత్రిలో సరైన ఎక్యూప్ మెంట్, మందులు లేవన్నారు. ఇటీవలే తన నిధుల నుండి 8 ప్రీజర్స్ ఏర్పాటు చేశానని చెప్పారు. ప్రస్తుతం వున్న100 పడకల ఆసుపత్రిని మెడికల్ కాలేజ్ కి కేటాయించడం వల్ల, జనరల్ ఆసుపత్రి లేకుండా పోయిందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఇప్పుడు రొగులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఖమ్మంలో కొత్త ఆసుపత్రి భవనాన్ని నిర్మించాల్సిన అవసరం వుందన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే మంత్రి తుమ్మలతో కలిసి రాష్ట్ర మంత్రి దామోదర రాజ నర్శింహ దృష్టికి తీసుకెళ్లానని, త్వరలోనే ఆయన్ను ఖమ్మం తీసుకొచ్చి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఖమ్మం రైల్యే స్టేషన్ వద్ద 3,500, కొత్తగూడెం ( భద్రాచలం రోడ్డు ) రైల్యే స్టేషన్ వద్ద 5,500 చదరపు గజాల స్థలాన్ని పార్కింగుకు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నానన్నారు. దీనికి సంబంధించిన ఫైల్ ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టేబుల్ మీద వుందన్నారు. ధంసలాపురం వద్ద రైల్యే అండర్ పాస్ తో పాటు, ధంసలాపురం గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ప్రక్కన 12 కిలోమీటర్ల సర్వీస్ రొడ్డును కూడా మంజూరు చేయించానని చెప్పారు. సహజంగా గ్రీన్ ఫీల్డ్ ప్రక్కన రెండు సర్వీస్ రోడ్లకు అవకాశం వుండదని, కేంద్ర మంత్రి గడ్కరిని కలిసి తాను చేసిన విజ్ఞప్తి మేరకు ఆయన అంగీకరించాలని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని దాదాపు 200 చదరపు కిలో మీటర్ల అడవిని పరిరక్షించాల్సిన అవసరం వుందన్నారు. ఇక్కడ పెద్ద పులి తప్ప అన్నిరకాల జంతువులు, పక్షులు వున్నాయన్నారు. దీనిపై కూడా ప్రభుత్వంతో మాట్లాడతానన్నారు. అంతే కాకుండా, విద్య, వైద్య, వ్యవసాయ, పిల్లల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి పరిష్కరిస్తున్నానని చెప్పారు.  

Related posts

సిపిఐ జాతీయ మహాసభలకు ఖమ్మం ప్రతినిధులు

Ram Narayana

ఖమ్మం అసెంబ్లీకి పోటీచేస్తా … బీజేపీ నేత పొంగులేటి ….!

Drukpadam

టీయూడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర వేడుకలు…

Ram Narayana