కెనడాలో బ్రిటీష్ వ్యతిరేక నినాదాలు.. నేల కూలిన క్వీన్ ఎలిజబెత్ విగ్రహం
-బ్రిటీష్ రాజవంశంపై కెనడాలో నిరసనలు
-స్కూళ్ల ఆవరణల్లో బయటపడ్డ వందల అస్థిపంజరాలు
-క్వీన్ ఎలిజబెత్ రాక్షసి అంటూ కెనెడియన్ల నినాదాలు
కెనడాలో ఇప్పటికీ బ్రిటీష్ రాచరికపు ప్రభావం ఇప్పటికి ఉంది . అక్కడి ప్రభుత్వాలు, ఎందరో ప్రజలు ఈ నాటికీ బ్రిటీష్ పాలకుల రాచరిక వ్యవస్థకు ఎంతో గౌరవం ఇస్తుంటారు. రాజ్యాంగం ప్రకారం బ్రిటిష్ రాణి నే కెనడాకు రాణిగా వ్యవహరిస్తారు. కాకపోతే రాణి రారూపున కెనడాలో రాణి ప్రతినిధి ఉంటారు …
అయితే ఇప్పుడు కెనడాలో పరిస్థితులు మారుతున్నాయి. బ్రిటీష్ రాచరికపు గుర్తులు కెనడాపై తొలగిపోవాలంటూ ఆ దేశంలో నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఈ మధ్య కాలంలో స్కూళ్ల ఆవరణల్లో వందల సంఖ్యలో పిల్లల అస్థిపంజరాలు బయటపడటం కెనడా వాసుల్లో ఆగ్రహాన్ని పెంచింది. ఫస్ట్ నేషన్ అనబడే వారిని కాథలిక్ మతస్తులు బలవంతపు మాట మార్పిడిల పేరుతొ ఆశ్రమ పాఠశాలల్లో చేరిన పిల్లలను నిర్ధాక్షిణ్యంగా చంపి పాఠశాలల వద్దే ఖననం చేసిన సంఘటనలు కుప్పలు తెప్పలుగా బయట పడుతున్నాయి. దీంతో అక్కడ ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. అందుకే కెనడా డే రోజున వారు నిరసన దినాన్ని పాటించారు. బ్రిటీష్ పాలన నాటి మారణహోమాలను గుర్తు చేసుకుంటూ బ్రిటీష్ రాణుల విగ్రహాలను కూల్చి వేశారు.
ఆరంజ్ కలర్ దుస్తుల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టిన నిరసనకారులు… విన్నిపెగ్ లో ఉన్న క్వీన్ విక్టోరియా విగ్రహాన్ని కూడా కూల్చి వేశారు. విగ్రహంపైకి ఎక్కిన బ్రిటీష్ వ్యతిరేక వర్గీయులు అక్కడి శిలాఫలకంపై ఎర్ర చేతి గుర్తులు వేశారు. అనంతరం తాళ్లతో లాగా విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఎలిజబెత్ రాణికాదు… రాక్షసి అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఒట్టావాలో కూడా నిరసన ప్రదర్శనలు జరిగాయి. అయితే ఈ ఘటనలను బ్రిటన్ ప్రభుత్వం ఖండించింది. కెనడాలో జరిగిన విషాదాలకు తాము బాధపడుతున్నామని… ఆ దేశ ప్రభుత్వం చేసే విచారణకు తాము స్పందిస్తామని తెలిపింది. విగ్రహాలను కూల్చివేయడం సరికాదని వ్యాఖ్యానించింది.