Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

డ్రోన్ గార్డ్ వ్యవస్థను ఓ దేశానికి ఇచ్చామన్న ఇజ్రాయెల్… పేరు చెప్పకున్నా ఇండియాకేనని అంచనా!

డ్రోన్ గార్డ్ వ్యవస్థను ఓ దేశానికి ఇచ్చామన్న ఇజ్రాయెల్… పేరు చెప్పకున్నా ఇండియాకేనని అంచనా!
ఈఎస్ఐ-4030నివిక్రయించాం
కోట్ల డాలర్ల విలువైన డీల్ పూర్తయిందని వార్తలు
ఇటీవల ఎయిర్ బేస్ లపై డ్రోన్ దాడులు
6 కి.మీ రేంజ్ లో పనిచేయనున్న యాంటీ డ్రోన్ వ్యవస్థ

దక్షిణాసియాలోని ఓ దేశానికి తమ వద్ద ఉన్న యాంటీ డ్రోన్ వ్యవస్థ ఈఎస్ఐ-4030ని విక్రయించామని ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (ఐఏఐ) ఓ ప్రకటన చేసింది. ఏ దేశానికి తాము ఈ వ్యవస్థను విక్రయించామన్న విషయాన్ని ఇజ్రాయెల్ వెల్లడించనప్పటికీ, అది ఇండియానేనని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత వారంలో జమ్ము ఎయిర్ పోర్టులోని వాయుసేన స్థావరంపై పాక్ ఉగ్రవాదులకు చెందిన డ్రోన్లు దాడికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే యాంటీ డ్రోన్ వ్యవస్థల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రకటన కూడా విడుదలైంది.

ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. కోట్ల డాలర్ల విలువైన ఈ డీల్ పూర్తయిందని, డ్రోన్ గార్డ్ విక్రయాన్ని ఇజ్రాయెల్ పూర్తి చేసుకుందని డిఫెన్స్ వార్తలను అందించే వార్తాసంస్థ జానెస్ వెల్లడించింది. అయితే, ఈ వ్యవస్థ ఎప్పటికి డెలివరీ అవుతుందన్నది మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. తమవద్ద ఉన్న యాంటీ డ్రోన్ వ్యవస్థపై ఇండియా ఆసక్తిగా ఉందని గత సంవత్సరమే ఇజ్రాయెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతానికైతే ఇండియా వద్ద ఎటువంటి యాంటీ డ్రోన్ వ్యవస్థా లేదు. ఇదే విషయాన్ని గుర్తు చేసిన డిఫెన్స్ ఎక్స్ పర్ట్ అభిజిత్ అయ్యర్, ఉగ్రవాదులు డ్రోన్లను వాడటం ప్రారంభించిన తరువాత, ఇండియాకు నమ్మకమైన డ్రోన్ వ్యవస్థల కొనుగోలు తప్పనిసరైందని, ఎంతోకాలం నుంచి నమ్మకమైన రక్షణ భాగస్వామిగా ఉన్న ఇజ్రాయెల్ నుంచి ఈ వ్యవస్థను కొనుగోలు చేసేందుకు అభ్యంతరాలు కూడా లేవని ఆయన అన్నారు.

కాగా, ఈ వ్యవస్థ దాదాపు 6 కిలోమీటర్ల రేంజ్ వరకూ పనిచేస్తుంది. డ్రోన్ నిరోధక వ్యవస్థ ఏర్పాటు చేసిన ప్రాంతం నుంచి పనిచేసే సెన్సార్లు, 6 కిలోమీటర్ల దూరంలోని డ్రోన్లను గుర్తిస్తాయి. వాటిని గాల్లోనే పేల్చి వేస్తూ, రక్షణ వలయాన్ని కల్పిస్తాయి. ఇప్పటికే పలు దేశాలకు ఈ వ్యవస్థలను ఇజ్రాయెల్ విక్రయించిందని ఐఏఐ అధికారి ఎలీ అల్ ఫాసీ వెల్లడించారు. ఇక పాకిస్థాన్ లోని ఇండియన్ ఎంబసీలో సైతం ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఇండియా భావిస్తోంది.

Related posts

పులివెందులలో తమకు భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీని కోరిన వివేకా కుమార్తె సునీత!

Drukpadam

పరస్పర అంగీకారంతో సహజీవనం.. ప్రాథమిక హక్కుల్లో భాగమే: పంజాబ్, హర్యానా హైకోర్టు!

Drukpadam

ఈడీ అదుపులో అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రి సీఎండీ మణి!

Drukpadam

Leave a Comment