ఆంధ్రప్రదేశ్

వ్యవసాయ యోగ్యమైన ప్రతీ ఎకరాకు రైతు భరోసా…మంత్రి పొంగులేటి

వ్యవసాయ యోగ్యమైన ప్రతీ ఎకరాకు రైతు భరోసా

  • కూసుమంచి మండల పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
  • పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

కూసుమంచి : గత మూడు నాలుగు రోజుల నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అవుతూ వస్తున్నాయని, రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన ప్రతీ ఎకరాకు రైతు భరోసా ఇస్తామని మరో రెండు మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. కూసుమంచి మండల పర్యటనలో భాగంగా నర్సింహుల గూడెం, పూరియా తండా, చింతల తండాలో బీటీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. పోచారంలో అంతర్గత సీసీ రోడ్లకు, కూసుమంచిలో అంతర్గత సీసీ రోడ్లకు, బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా కూసుమంచి మండల కేంద్రంలో మంజూరైన జూనియర్ ప్రభుత్వ కళాశాల స్థలాన్ని పరిశీలించి వీలైనంత త్వరగా భవన నిర్మాణ పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ…. ఇందిరమ్మ రాజ్యంలో గతపాలకుల సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నామని అన్నారు. 200 యూనిట్ల వరకు పేదలకు ఉచిత గృహ విద్యుత్ సరఫరా, రూ. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్య శ్రీ పథకం పరిమితి రూ. 10 లక్షలకు పెంపు, గురుకులాల్లో డైట్ చార్జీలు 40 శాతం, కాస్మోటిక్ చార్జీలు 200 శాతం పెంపు, సన్న వడ్లకు క్వింటాల్ రూ. 500 రూపాయల బోనస్, గడిచిన ఉగాది నుండి రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీ, నూతన రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం రైతులకు పెట్టుబడి క్రింద రూ. 10 వేల రూపాయలు అందిస్తే, ఇందిరమ్మ ప్రభుత్వం రూ. 12 వేల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన భారీ అప్పులను చెల్లిస్తూ పేదల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేస్తున్నామని అన్నారు.  రాబోయే 3 సంవత్సరాలలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని, అర్హులందరికీ దశల వారీగా తప్పనిసరిగా ఇందిరమ్మ ఇల్లు అందుతుందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, జిల్లా, నియోజకవర్గ, మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రతీ ఇంటా ఈ రెండు యాప్‌లు ఉండాలి: సీఎం జగన్‌

Ram Narayana

తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు…

Drukpadam

రాహుల్ గాంధీ కొత్త లుక్.. ఫొటోలు వైరల్…!

Drukpadam