Shinawatra
అంతర్జాతీయం

థాయిలాండ్ ప్రధాని షినవత్రను సస్పెండ్ చేసిన కోర్టు

  • ప్రధాని విధులకు దూరంగా ఉండాలని ఆదేశం
  • తుది తీర్పు వెలువడే వరకు సస్పెన్షన్ అమలు
  • కంబోడియా నేతకు షినవత్ర ఫోన్ కాల్, ఆయనను అంకుల్ అని పిలవడంపై దుమారం

థాయిలాండ్‌ ప్రధాన మంత్రి షినవత్రకు అక్కడి రాజ్యాంగ న్యాయస్థానం షాక్ ఇచ్చింది. షినవత్రను సస్పెండ్ చేస్తూ ఈ రోజు సంచలన ఆదేశాలు జారీ చేసింది. పొరుగు దేశమైన కంబోడియాతో సరిహద్దు వివాదం విషయంలో ఆమె ప్రవర్తనపై దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరిస్తున్నట్టు ప్రకటించింది. వివరాల్లోకి వెళితే.. థాయిలాండ్-కంబోడియాల మధ్య కొంతకాలంగా సరిహద్దు వివాదం నెలకొంది. ఈ విషయంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గత మే నెలలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. కంబోడియా సైనికుడు ఒకరు మరణించాడు. ఈ నేపథ్యంలో, ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రధాని షినవత్ర, కంబోడియా నేత హున్ సేన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సంభాషణకు సంబంధించిన కాల్ రికార్డ్ లీక్ అయింది. అందులో ఆమె హున్ సేన్‌ను ‘అంకుల్’ అని సంబోధించడంతో పాటు, థాయ్ సైనిక ఉన్నతాధికారి ఒకరిని తన ‘ప్రత్యర్థి’ అని పేర్కొనడం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ ఘటనపై కొందరు కన్సర్వేటివ్ సెనేటర్లు రాజ్యాంగ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రధాని షినవత్ర.. కంబోడియాకు తలొగ్గి దేశ సైన్యాన్ని బలహీనపరిచారని, మంత్రిగా ఉండాల్సిన నైతిక ప్రమాణాలను, నిజాయితీని ఉల్లంఘించారని వారు ఆరోపించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, కేసులో తుది తీర్పు వెలువరించే వరకు ప్రధాని విధులకు దూరంగా ఉండాలని 7-2 మెజారిటీతో ఆదేశించింది. “జులై 1 నుంచి తుది తీర్పు ఇచ్చేంతవరకు ప్రతివాదిని (ప్రధాని) విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నాం,” అని కోర్టు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో థాయ్‌లాండ్‌లో రాజకీయ అనిశ్చితి నెలకొంది.

Related posts

ఉద్యోగాల పేరుతో మోసం.. కాంబోడియాలో చిక్కుకున్న విశాఖ వాసులు…

Ram Narayana

ఒకేసారి నాలుగు ఉద్యోగాలు చేస్తున్న భారత టెక్కీ బండారం బట్టబయలు!

Ram Narayana

హెచ్‌1బీ వీసాదారులకు టెక్‌ కంపెనీల వార్నింగ్…

Ram Narayana