ప్రకాశ్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్‌పై వేటుకు అవే కారణాలా?
-రవిశంకర్ ప్రసాద్ కొంపముంచిన ట్విట్టర్ వివాదం
-అంతర్జాతీయంగా తప్పుడు సంకేతాలు
-మహారాష్ట్ర నుంచి ఎక్కువమందికి ప్రాధాన్యం లభించడం వల్ల జవదేకర్‌పై వేటు!
ప్రకాష్ జయదేకర్ , రవిశంకర్ ప్రసాద్ బీజేపీ లో కీలకమైన వ్యక్తులు …. మోడీ కెబినెట్ లో కీలకమైన శాఖలు నిర్వహించారు…. మోడీ, షా లకు అత్యంత సన్నిహితంగా ఉంటారనే పేరుంది …. కానీ ఉద్యాసనకు గురైన 12 మందిలో ఈ ఇద్దరు పేర్లు ఉండటం రాజకీయపరిశీలకులు సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. వీరి తొలగింపుపై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వారికి పార్టీలో కీలక భాద్యతలు అప్పగించే అవకాశం ఉందని మరో ప్రచారం ఉంది. లేదా ఒకరికి గవర్నర్ ఇస్తారని తెలుస్తుంది ….
కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా మొత్తం 12 మంది మంత్రులపై వేటు వేయడం ఎవరినీ పెద్దగా ఆశ్చర్యపర్చలేదు కానీ రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్‌లను తప్పించడంపై మాత్రం సర్వత్ర చర్చ జరుగుతోంది. ఎన్డీయే గత ప్రభుత్వంలోనూ వీరిద్దరూ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం రవిశంకర్ ప్రసాద్ న్యాయ, ఐటీ, కమ్యూనికేషన్ శాఖలు నిర్వహిస్తుండగా; ప్రకాశ్ జవదేకర్ సమాచార, ప్రసార, పర్యావరణ, అటవీ, భారీ పరిశ్రమల శాఖలు నిర్వహిస్తున్నారు.
ట్విట్టర్‌తో వివాదమే రవిశంకర్ ప్రసాద్‌పై వేటుకు కారణమని చెబుతున్నారు. ట్విట్టర్, ఇతర సామాజిక మాధ్యమాల విషయంలో ప్రభుత్వ అసలు ఉద్దేశాన్ని ప్రజలకు వివరించి చెప్పడంలో ఆయన విఫలమయ్యారని అంటున్నారు. ఈ విషయంలో తన తెలివితేటలతో అంతర్జాతీయంగా భారత్‌కు నష్టం కలిగించేలా వ్యవహరించారని ఆయనపై విమర్శలున్నాయి. ట్విట్టర్‌తో జరుగుతున్న పోరు కారణంగా భారత ప్రభుత్వం మీడియాను నియంత్రిస్తోందన్న ప్రచారం అంతర్జాతీయ సమాజానికి వెళ్లిపోయిందని, ఆయనను తప్పించడానికి ఇది ఒక కారణమైతే, వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యవహారాలు చూసే బాధ్యతను అప్పగించేందుకు తప్పించారన్న వాదన కూడా ఉంది.
మహారాష్ట్ర నుంచి ఎక్కువమందికి ప్రాతినిధ్యం లభించడం వల్లే ప్రకాశ్ జవదేకర్‌ను తప్పించడానికి కారణమని తెలుస్తోంది. వయసు 70 ఏళ్లు దాటిపోవడం కూడా మరో కారణంగా చెబుతున్నారు. పార్టీ బాధ్యతలు అప్పగించడమో, లేదంటే ఏదైనా రాష్ట్రానికి గవర్నర్‌గా పంపడమో చేయాలని అధిష్ఠానం ఆలోచనగా చెబుతున్నారు. ప్రస్తుతం పార్టీ అధికార ప్రతినిధులుగా ఉన్నవారు మీడియాపై ఎలాంటి ప్రభావం చూపలేకపోతుండడంతో ఆ బాధ్యతలను సీనియర్లకు అప్పగించాలని అధిష్ఠానం నిర్ణయించింది. అందులో భాగంగానే ప్రకాశ్ జవదేకర్‌ను కేబినెట్ నుంచి తప్పించినట్టు సమాచారం.