శాంతి చర్చలకు పిలుపునించిన భూపతి ద్రోహి .. మావోయిస్టు కేంద్రకమిటీ
అది పార్టీ విధానం కాదని వెల్లడి
ఆయుధాలు అప్పగించాలి.. భూపతికి మావోయిస్టు కేంద్ర కమిటీ హెచ్చరిక
మావోయిస్టు పార్టీలో అంతర్గత సంక్షోభం బహిర్గతం
సీనియర్ నేత మల్లోజుల వేణుగోపాల్ (భూపతి)పై కేంద్ర కమిటీ చర్యలు
భూపతిని ద్రోహిగా పేర్కొంటూ సంచలన ప్రకటన
వెంటనే ఆయుధాలు అప్పగించాలని తీవ్ర హెచ్చరిక
శాంతి చర్చలపై భూపతి ప్రకటనను ఖండించిన పార్టీ
సమసమాజ నిర్మాణం ఆయుధాల ద్వారానే సాధ్యమని అందుకు గెరిల్లా పోరాటమే మార్గమని నమ్మి అందుకోసం తాము ఎంచుకున్న మార్గంలో ముందుకు పోతున్న మావోయిస్టులకు కేంద్ర ఆపరేషన్ కాగర్ పేరుతో ఏరివేత ఎదురు దెబ్బతగిలింది . అనేకమందికీలకమైన అగ్రనేతలను పోగొట్టుకుంది …ఆపరేషన్ కగారు ఆపాలని మావోయిస్టు లతోపాటు వామపక్ష పార్టీలు ప్రజాసంఘాలు ,అభ్యుదయ వాదులు డిమాండ్ చేశారు .అయినప్పటికీ కేంద్ర తన నిర్ణయాన్ని మార్చుకోలేదు పైగా మావోయిస్టుల ఏరివేతను మరింత పెంచింది . దీంతో పార్టీలో భిన్న వాదనలు బయలుదేరాయి…కొంతమంది ఆయుధాలు వదిలేసి కేంద్రంతో చర్చలు జరపాలని కోరుకుంటున్నారు …ఇటీవల అభయ్ పేరుతో తాము ఆయుధాలు వీడటానికి సిద్ధంగా ఉన్నామని శాంతి చర్చలకు సంసిద్దమని ప్రకటించారు . దీంతో మావోయిస్టులు తమ పంథా మార్చుకున్నారని అభిప్రాయం కల్గింది …కానీ అభయ్ ఎలియాస్ భూపతి చేసిన ప్రకటన తన వ్యక్తిగతమని దానితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆపార్టీ కేంద్ర కమిటీ ప్రకటించింది .పైగా భూపతి పార్టీ ద్రోహిగా మారాడని వెంటనే తనదగ్గర ఉన్న ఆయుధాలను సరెండర్ చేయాలని కోరింది …లేకపోతె అతనిపై చర్యలు తప్పవని హెచ్చరించింది ..
మావోయిస్టు పార్టీలో తీవ్ర అంతర్గత సంక్షోభం బయటపడింది. పార్టీ కేంద్ర కమిటీ తమ సీనియర్ నాయకుడు, అధికార ప్రతినిధి మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతిపై సంచలన చర్యలు తీసుకుంది. ఆయన్ని పార్టీ ద్రోహిగా ప్రకటిస్తూ, వెంటనే తన వద్ద ఉన్న ఆయుధాలను పార్టీకి అప్పగించాలని ఆదేశించింది. ఈ మేరకు మావోయిస్టు కేంద్ర కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఆయుధాలు అప్పగించని పక్షంలో, వాటిని పీపుల్స్ గెరిల్లా ఆర్మీ (పీజీఏ) స్వాధీనం చేసుకుంటుందని కమిటీ తీవ్రంగా హెచ్చరించింది. ఇటీవల భూపతి, తాము ఆయుధాలు వదిలేసి శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి హోదాలో ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ విధానానికి విరుద్ధంగా ఉన్న ఈ ప్రకటనతోనే వివాదం మొదలైంది.
భూపతి ప్రకటనను కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. లొంగిపోయే ఉద్దేశంతోనే ఆయన ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించింది. కాల్పుల విరమణ, శాంతి చర్చల పేరుతో భూపతి పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర కమిటీ తన ప్రకటనలో పేర్కొంది. కాగా, మల్లోజుల వేణుగోపాల్ దివంగత మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీకి స్వయానా తమ్ముడు కావడం గమనార్హం. ఈ పరిణామం మావోయిస్టు పార్టీలోని ఉన్నతస్థాయి నాయకత్వంలో తీవ్ర విభేదాలు ఉన్నాయన్న వాదనలకు బలం చేకూరుస్తోంది.