అమెరికాతో తాము ఎలాంటి చర్చలు జరపడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో జరుగుతున్న యుద్ధం రెండో నెలలోకి ప్రవేశించిన తరుణంలో, చర్చలు సానుకూలంగా ఉన్నాయంటూ వైట్ హౌస్ చేస్తున్న ప్రకటనలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇరు దేశాల మధ్య ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి సంప్రదింపులు జరగడం లేదని తేల్చిచెప్పింది.
ఈ విషయంపై ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. గత 31 రోజులుగా అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. చర్చల కోసం పాకిస్థాన్ వంటి మధ్యవర్తుల ద్వారా అమెరికా కేవలం కొన్ని ప్రతిపాదనలు పంపిందే తప్ప, అసలు చర్చలే మొదలుకాలేదని వివరించారు. గతంలోని దౌత్యపరమైన చేదు అనుభవాలను, ద్రోహాలను తాము మర్చిపోలేదని, ప్రస్తుతం తమ దృష్టి అంతా దేశ రక్షణపైనే ఉందని ఆయన పేర్కొన్నారు.
అయితే, ఇరాన్ వాదనకు పూర్తి విరుద్ధంగా అమెరికా ప్రకటనలు చేస్తోంది. ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని, అవి చాలా సానుకూల దిశలో ఉన్నాయని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు. త్వరలోనే ఓ ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం పలుమార్లు పునరుద్ఘాటించారు.
వివాదాన్ని ముగించేందుకు ట్రంప్ ప్రతిపాదించిన 15 అంశాల శాంతి ప్రణాళికను ఇరాన్ తిరస్కరించింది. దానికి బదులుగా యుద్ధ నష్టపరిహారం, ఆంక్షల ఎత్తివేత వంటి ఐదు షరతులను విధించింది. ఇరు దేశాల నుంచి వస్తున్న ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలతో యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదనే సంకేతాలు వెలువడుతున్నాయి.
Save or share this story as a newspaper-style Epaper Clip: