అధికారులు పల్లెనిద్ర చేయాలి….భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అనుదీప్
గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి
బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు స్థల సేకరణ చేయాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ అనుదీప్
కొత్తగూడెం
గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులు పల్లె నిద్ర కార్యక్రమాలు నిర్వహించి గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ సూచించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణ, ఇంటింటికీ ఆరు మొక్కల పంపిణీ, డంపింగ్ యార్డు, వైకుంఠధామాల్లో బయోఫెన్సింగ్, హరితహారం, బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు తదితర అంశాలపై కలెక్టరేట్ నుంచి పంచాయతీ కార్యదర్శులు, ఏపీవో, ఎంపీవో, ఎంపీడీవో, మండల ప్రత్యేక అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలున్న గ్రామాల్లో అధికారులు పల్లె నిద్ర చేసి ఉదయం ఆరు గంటలకు గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించాలని సూచించారు. సమస్యలు గురించి తక్షణం పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నందున మొక్కలు మంచిగా పెరుగుతాయి కాబట్టి హరితహారాన్ని పూర్తి చేయాలని సూచించారు. అవెన్యూ ప్లాంటేషన్‌లో గ్యాప్ ఉన్న స్థలాల్లో మొక్కలు నాటాలని, 10 రోజుల పాటు నిర్వహించిన పల్లె, పట్టణ ప్రగతిలో బాగా చేశారని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని అన్నారు. విధుల్లో అలసత్వం వహించిన బచ్చువారిగూడెం కార్యదర్శిని తక్షణం బదిలీ చేయాలని డీపీవోను ఆదేశించారు. పల్లెప్రకృతి వనం నిర్వహణలో అలసత్వం వహిస్తున్న గుమ్మడివల్లి కార్యదర్శికి షోకాజ్ నోటీసు, ఎంపీవో, ఏపీఎంకు మెమో జారీ చేయాలన్నారు. అశ్వారావుపేట అభివృద్ధిలో బాగా వెనుకబడిందని, నిధులున్నా అంకితభావం లేకపోవడం వల్ల చేసే వారు లేక అభివృద్ధి కుంటుపడిందని, అభివృద్ధి కనిపించడం లేదని, గతంలో పనిచేసిన ఎంపీడీవో, ఎంపీవో మండలాన్ని నాశనం చేశారని అన్నారు. పనిచేయకుండా ఎందుకు స్టోరీలు చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అశ్వారావుపేట మండలాన్ని అభివృద్ధి చేసేందుకు బాగా ఫోకస్ చేయాలన్నారు. ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు రాకపోతే 9618621336 నంబర్‌కు వాట్సాప్ చేయాలని, గ్రామస్థాయి నుంచి పంపుతున్న నివేదికలను మండల, జిల్లా అధికారులు పరిశీలన చేయాలని అన్నారు. డీఆర్‌వో అశోక్‌చక్రవర్తి, డీఆర్‌డీవో మధుసూదన్‌రాజు, డీపీవో రమాకాంత్ పాల్గొన్నారు…