ఆంధ్రప్రదేశ్

నకిలీ మద్యం కేసులో సంచలనం… జోగి రమేశ్ చెబితేనే చేశానన్న జనార్దన్ రావు..

  • మాజీ మంత్రి జోగి రమేశ్ చెప్పడంతోనే ఈ పని చేశానని వెల్లడి
  • టీడీపీ ప్రభుత్వంపై బురద జల్లేందుకే ఈ కుట్ర పన్నారని ఆరోపణ
  • జోగి రమేశే సొంత మనుషులతో లీక్ చేయించారని వెల్లడి
  • ఇచ్చి సాక్షి మీడియాతో రైడ్ చేయించారని వ్యాఖ్య
  • బెయిల్ ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారని వీడియోలో ఆవేదన

నకిలీ మద్యం తయారీ కేసులో అరెస్టయిన నిందితుడు జనార్దన్ రావు… మాజీ మంత్రి జోగి రమేశ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్నది జోగి రమేశేనని, ఆయన ఆదేశాల మేరకే తాను నకిలీ మద్యం తయారు చేశానని ఒక వీడియో ద్వారా తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వంపై బురద జల్లేందుకే ఈ కుట్ర పన్నారని ఆయన ఆరోపించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.

జనార్దన్ రావు కథనం ప్రకారం, గత ప్రభుత్వ హయాంలోనే తాము నకిలీ మద్యం తయారు చేసినప్పటికీ, ప్రభుత్వం మారడంతో ఆపేశామని తెలిపారు. అయితే, టీడీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు జోగి రమేశ్ తమను మళ్లీ ప్రోత్సహించారని వెల్లడించారు. “ముందుగా ఇబ్రహీంపట్నంలో ప్లాన్ చేశాం. కానీ, చంద్రబాబుపై బురద జల్లాలంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె సరైన ప్రదేశమని జోగి రమేశ్ చెప్పారు. ఆర్థిక సాయం కూడా చేస్తామని హామీ ఇచ్చారు” అని జనార్ధన్ రావు వివరించారు. ఈ పథకంలో భాగంగా తనను ఆఫ్రికాలోని తన మిత్రుడి వద్దకు పంపించారని పేర్కొన్నారు.

అయితే, ఈ వ్యవహారాన్ని బయటపెట్టింది కూడా జోగి రమేశేనని జనార్దన్ రావు ఆరోపించారు. “ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు తన మనుషులతోనే జోగి రమేశ్ లీక్ ఇచ్చారు. రైడ్‌కు ముందురోజు ఇబ్రహీంపట్నంలో సరుకు పెట్టించి, ఆ తర్వాత సాక్షి మీడియాకు సమాచారం ఇచ్చి రైడ్ చేయించారు. అనుకున్నట్లే చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చింది” అని ఆయన అన్నారు.

జోగి రమేశ్ తనను మోసం చేశారని జనార్దన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. “ఆఫ్రికా నుంచి రావొద్దని, బెయిల్ తానే ఇప్పిస్తానని నమ్మబలికారు. కానీ చివరకు హ్యాండ్ ఇచ్చి, ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేని నా సోదరుడిని కూడా ఇరికించారు. చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నప్పటికీ నన్ను మోసం చేయడంతోనే బయటకు వచ్చి నిజాలు చెబుతున్నాను” అని జనార్దన్ రావు వీడియోలో పేర్కొన్నారు. ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. జనార్దన్ రావు వెల్లడించిన వివరాలు ప్రస్తుతం ఏపీలో సంచలనంగా మారాయి. 

నిందితుడు ఆరోపణలపై జోగి రమేశ్ స్పందన…

Jogi Ramesh Responds to Fake Liquor Allegations
  • ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఏ1 నిందితుడి వీడియో కలకలం
  • మాజీ మంత్రి జోగి రమేశ్ డైరెక్షన్‌లోనే అంతా జరిగిందని వెల్లడి
  • ఆరోపణలను ఖండించిన మాజీ మంత్రి జోగి రమేశ్

ములకలచెరువు నకిలీ మద్యం వ్యవహారం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ ఆదేశాల మేరకే తాను నకిలీ మద్యం తయారు చేశానని అతడు ఆ వీడియోలో వాంగ్మూలం ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది.

తాజాగా విడుదల చేసిన వీడియోలో జనార్దన్ రావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంపై బురద జల్లే కుట్రలో భాగంగానే జోగి రమేశ్ తనను ప్రోత్సహించారని ఆరోపించారు. “నకిలీ మద్యం తయారీకి ములకలచెరువు ప్రాంతాన్ని సూచించిందే జోగి రమేశ్. మద్యం తయారు చేయించింది వాళ్లే, ఆ తర్వాత వాళ్లే రైడ్ చేయించి నాటకమాడారు. ఇబ్రహీంపట్నంకు ఒకరోజు ముందే సరుకు, క్యాన్లు తెప్పించారు. జోగి రమేశ్ ఆఫర్ చేసిన 3 కోట్ల రూపాయలకు ఆశపడే నేను ఈ పని చేశాను” అని జనార్దన్ రావు ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.

ఈ ఆరోపణలపై మాజీ మంత్రి జోగి రమేశ్ తీవ్రంగా స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. చంద్రబాబు ప్రభుత్వం తన చేతిలో ఉన్న సిట్‌తో విచారణ జరిపిస్తూ, కావాలనే ఈ కేసులో తనను ఇరికించాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన సవాల్ విసిరారు. ఎవరో ఒకరిని ఇరికించడానికే ఈ కుట్ర జరుగుతోందని, నకిలీ మద్యం తయారీకి ఆంధ్రప్రదేశ్ ఒక కుటీర పరిశ్రమగా మారిపోయిందని ఆయన విమర్శించారు.

చంద్రబాబు తన కుటుంబాన్ని తీసుకుని తిరుమల రావాలని, తాను కూడా వచ్చి ప్రమాణం చేస్తానని అన్నారు. లేకపోతే, విజయవాడ కనకదుర్గ గుడికైనా రావాలని జోగి రమేశ్ పేర్కొన్నారు. తాను, జనార్దనరావు తాత ఒకే వీధిలో ఉంటామని, జనార్దనరావు పిల్లలను బెదిరించి అతడితో తనపై ఆరోపణలు చేయించారని మండిపడ్డారు. 

Related posts

కెనడా స్కూల్‌లో కాల్పులకు పాల్పడింది ఒక ట్రాన్స్‌జెండర్ మహిళ!

Ram Narayana

కోర్టు ఉత్తర్వులను గౌరవించని అధికారులకు జరిమానా కాదు.. జైలు శిక్షే కరెక్ట్: మద్రాస్ హైకోర్టు

Drukpadam

స్త్రీపురుషులు దీర్ఘకాలం కలిసుంటే పెళ్లయినట్టే: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

Drukpadam