అంతర్జాతీయం

అమెరికా ఆలా …భారత్ ఇలా …రష్యా నుంచి చమురు దిగుమతిపై …

India clarifies stance on Russia oil purchases after Trump claim

మా ప్రయోజనాలే ముఖ్యం: రష్యా చమురుపై ట్రంప్ వ్యాఖ్యలకు భారత్ కౌంటర్

  • రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
  • ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ వెల్లడి
  • ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన భారత విదేశాంగ శాఖ
  • దేశీయ వినియోగదారుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టీకరణ
  • ఇంధన భద్రత, ధరల స్థిరత్వమే తమ లక్ష్యమని వెల్లడి

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్పందించింది. దేశ ఇంధన భద్రత, వినియోగదారుల ప్రయోజనాలే తమకు అత్యంత ప్రాధాన్యమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇంధన దిగుమతుల విషయంలో తమ విధానాలు పూర్తిగా దేశీయ అవసరాల మేరకే ఉంటాయని పేర్కొంది.

ఎన్డీటీవీ కథనం ప్రకారం, “రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ ఆపేస్తుందని ప్రధాని మోదీ నాకు హామీ ఇచ్చారు. ఇది వెంటనే జరగకపోయినా, ఆ ప్రక్రియ త్వరలోనే ముగుస్తుంది” అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశం కావడంతో భారత విదేశాంగ శాఖ దీనిపై అధికారికంగా స్పందించింది.

విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, “భారత్ భారీ మొత్తంలో చమురు, గ్యాస్ దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయంగా ఇంధన ధరల్లో ఒడిదొడుకులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటమే మా ప్రథమ ప్రాధాన్యత. మా దిగుమతి విధానాలు పూర్తిగా ఈ లక్ష్యం ఆధారంగానే ఉంటాయి” అని వివరించారు.

“స్థిరమైన ఇంధన ధరలు, సరఫరాల భద్రత అనేవి మా ఇంధన విధానంలోని రెండు ప్రధాన లక్ష్యాలు. దీనికోసం మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఇంధన వనరులను విస్తృతం చేసుకుంటున్నాం” అని ఆయన తెలిపారు. ఇక అమెరికా విషయానికొస్తే, చాలా ఏళ్లుగా ఆ దేశం నుంచి ఇంధన సేకరణను పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని, గత దశాబ్ద కాలంలో ఇది క్రమంగా పెరిగిందని ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుత అమెరికా ప్రభుత్వం కూడా భారత్‌తో ఇంధన సహకారాన్ని పెంపొందించుకోవడంపై ఆసక్తి చూపుతోందని, ఈ విషయంపై చర్చలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు.

రష్యా నుంచి చమురు బంద్ చేస్తామని మోడీ హామీ ఇచ్చారంటున్న ట్రంప్…

  • రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేస్తామన్న ప్రధాని మోదీ
  • ఈ విషయాన్ని వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
  • భారత్ నిర్ణయాన్ని ‘పెద్ద ముందడుగు’గా అభివర్ణించిన ట్రంప్
  • తదుపరి లక్ష్యం చైనాయేనని స్పష్టం చేసిన అమెరికా
  • ట్రంప్ వ్యాఖ్యలపై ఇంకా స్పందించని వాషింగ్టన్‌లోని భారత ఎంబ‌సీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయం మాస్కోను ఆర్థికంగా ఏకాకిని చేసే అంతర్జాతీయ ప్రయత్నాలలో ఒక ‘పెద్ద ముందడుగు’ అని ఆయన అభివర్ణించారు.

బుధవారం వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ ఈ కీలక విషయాన్ని తెలిపారు. “భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై నేను సంతోషంగా లేను. అయితే, ఇకపై కొనబోమని ఈరోజు ఆయన (మోదీ) నాకు హామీ ఇచ్చారు” అని ట్రంప్ పేర్కొన్నారు. దీని తర్వాత చైనాను కూడా ఇదే విధంగా ఒప్పిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రష్యా చమురు ఆదాయానికి గండికొట్టేందుకు వాషింగ్టన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒకవేళ భారత్ ఈ నిర్ణయం తీసుకుంటే, అది ప్రపంచ ఇంధన దౌత్యంలో ఒక కీలక మలుపు అవుతుంది. రష్యాకు అతిపెద్ద ఇంధన వినియోగదారులలో ఒకటైన భారత్ వైఖరి మారితే, ఇతర దేశాలపై కూడా దాని ప్రభావం పడే అవకాశం ఉంది.

అయితే, డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ ప్రకటనపై వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం నుంచి తక్షణమే ఎలాంటి స్పందన రాలేదు. ప్రధాని మోదీ నిజంగానే అలాంటి హామీ ఇచ్చారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా, ఈ ప్రక్రియ ఒకేసారి పూర్తికాదని, దీనికి కొంత సమయం పడుతుందని, అయితే త్వరలోనే ఇది ముగుస్తుందని ట్రంప్ తన వ్యాఖ్యలకు జోడించారు.

Related posts

రష్యా ఖండాంతర క్షిపణి ప్రయోగంతో ఉక్రెయిన్‌ అతలాకుతలం!

Ram Narayana

పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కు అమెరికాలో నిరసన సెగ

Ram Narayana

భారతీయులకు రష్యా బంపరాఫర్.. ఏకంగా 70 వేల మందికి ఉద్యోగాలు…

Ram Narayana