- ఉద్యోగం ఆశతో రష్యాకు వెళ్లిన హైదరాబాద్ యువకుడు
- ఉక్రెయిన్‌తో యుద్ధంలోకి బలవంతంగా పంపిన వైనం
- తప్పించుకునే ప్రయత్నంలో విరిగిన కాలు
- తనతో పాటు వచ్చిన 30 మందిలో 17 మంది మృతి చెందారని వెల్లడి
- భర్తను కాపాడాలంటూ కేంద్ర ప్రభుత్వానికి భార్య విజ్ఞప్తి
- యుద్ధం చేయకుంటే చంపేస్తామని రష్యా ఆర్మీ హెచ్చరికలు
మెరుగైన భవిష్యత్తు కోసం రష్యా వెళ్లిన హైదరాబాద్ వాసికి ఊహించని కష్టం ఎదురైంది. ఉద్యోగం పేరుతో వెళ్లిన అతడిని రష్యా సైన్యం బలవంతంగా ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధానికి పంపింది. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన భర్తను రక్షించాలంటూ బాధితుడి భార్య నిన్న కేంద్ర విదేశాంగ శాఖను ఆశ్రయించడంతో ఈ విషయం బయటపడింది.
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌కు చెందిన మహమ్మద్ అహ్మద్ (37) స్థానికంగా బౌన్సర్‌గా పనిచేసేవాడు. మెరుగైన ఉపాధి అవకాశాల కోసం ముంబైకి చెందిన ఓ ఏజెంట్‌ను సంప్రదించాడు. ఆ ఏజెంట్ మాటలు నమ్మి ఈ ఏడాది ఏప్రిల్ 25న రష్యాకు వెళ్లాడు. అయితే, అక్కడికి వెళ్లాక అతడిని మోసం చేసి రష్యా సైన్యానికి అప్పగించారు.
అహ్మద్‌తో పాటు మరో 30 మందికి రష్యా సైన్యం కొన్ని రోజుల పాటు సైనిక శిక్షణ ఇచ్చింది. అనంతరం, ఉక్రెయిన్‌తో యుద్ధం చేయాలంటూ అహ్మద్‌తో పాటు 26 మందిని ఇటీవల సరిహద్దులకు తరలించింది. మార్గమధ్యంలో వారి నుంచి తప్పించుకునేందుకు అహ్మద్ ప్రయత్నించగా, కింద పడటంతో అతని కాలు విరిగింది. ప్రస్తుతం రష్యా ఆర్మీ పర్యవేక్షణలోనే అతడు చికిత్స పొందుతున్నాడు.
ఇటీవల తన భార్య ఫిరదౌస్ బేగంకు ఫోన్ చేసిన అహ్మద్ తన దయనీయ పరిస్థితిని వివరించాడు. తనతో పాటు శిక్షణ తీసుకున్న 30 మందిలో ఇప్పటికే 17 మంది యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశాడు. “యుద్ధంలో పాల్గొనకపోతే ప్రాణాలు తీస్తామని రష్యా సైన్యం హెచ్చరిస్తోంది” అని తన భర్త చెప్పినట్లు ఫిరదౌస్ తెలిపారు. తన భర్తను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
రష్యా సైన్యంలో హైదరాబాద్ వాసి.. విడిపించేందుకు రంగంలోకి దిగిన కేంద్రం

- ఉద్యోగ మోసంతో రష్యా సైన్యంలో చిక్కుకున్న హైదరాబాదీ మహమ్మద్ అహ్మద్
- రష్యా నుంచి వీడియో పంపి తనను కాపాడాలంటూ బాధితుడి వేడుకోలు
- విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
- స్పందించిన భారత రాయబార కార్యాలయం.. రష్యా అధికారులతో సంప్రదింపులు
ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన ఓ హైదరాబాదీ, ఏజెంట్ చేతిలో మోసపోయి ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధరంగంలో చిక్కుకుపోయాడు. తనను ఎలాగైనా కాపాడాలంటూ అతను పంపిన వీడియో సందేశం కలకలం రేపడంతో, భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది. బాధితుడిని సైన్యం నుంచి సురక్షితంగా విడిపించి స్వదేశానికి రప్పించేందుకు మాస్కోలోని భారత రాయబార కార్యాలయం రష్యా అధికారులతో సంప్రదింపులు ప్రారంభించింది.
అసలేం జరిగిందంటే..!
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌కు చెందిన 37 ఏళ్ల మహమ్మద్ అహ్మద్, ముంబైకి చెందిన ఓ ఏజెంట్ మాటలు నమ్మి నిర్మాణ రంగంలో ఉద్యోగం కోసం ఏప్రిల్ 25న రష్యా వెళ్లాడు. అయితే, అక్కడికి వెళ్లాక అతడిని మోసగించి, బలవంతంగా రష్యా సైన్యంలో చేర్చారు. ఆయుధ శిక్షణ ఇచ్చి ఉక్రెయిన్ సరిహద్దుకు పంపించారు. అక్కడ ఎదుర్కొంటున్న నరకయాతనను వివరిస్తూ, తనను కాపాడాలంటూ అహ్మద్ తన కుటుంబానికి ఇటీవల ఒక వీడియో సందేశం పంపాడు.
ఈ విషయం తెలుసుకున్న అహ్మద్ భార్య అఫ్షా బేగం, ఇతర కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని ఆశ్రయించారు. ఒవైసీ ఈ విషయాన్ని విదేశాంగ శాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లడంతో అధికార యంత్రాంగం కదిలింది. మాస్కోలోని భారత రాయబార కార్యాలయం వెంటనే స్పందించి, అహ్మద్ వివరాలను రష్యా అధికారులకు అందజేసింది. అతడిని వెంటనే సైన్యం నుంచి విడుదల చేసి, సురక్షితంగా భారత్‌కు పంపాలని అధికారికంగా అభ్యర్థించింది. ఈ విషయాన్ని మాస్కోలోని భారత రాయబార కార్యాలయ కౌన్సిలర్, ఎంపీ ఒవైసీకి తెలియజేశారు.
కన్నీళ్లు పెట్టిస్తున్న అహ్మద్ ఆవేదన
“నాతో పాటు 25 మందిని ఇక్కడికి తీసుకొచ్చారు. వారిలో 17 మంది ఇప్పటికే చనిపోయారు. వారిలో ఒక భారతీయుడు కూడా ఉన్నాడు. యుద్ధం చేయడానికి నేను, మరో ముగ్గురు భారతీయులం నిరాకరించగా.. తుపాకులతో బెదిరించారు. నా కాలికి గాయం కావడంతో నడవలేని స్థితిలో ఉన్నాను. అయినా రేపు యుద్ధానికి వెళ్లమంటున్నారు” అంటూ అహ్మద్ వీడియోలో కన్నీటిపర్యంతమయ్యాడు. తన ఈ దుస్థితికి కారణమైన ఏజెంట్‌ను కఠినంగా శిక్షించాలని అతను వేడుకున్నాడు.
గతేడాది కూడా ఇలాగే దుబాయ్ ఏజెంట్ చేతిలో మోసపోయి రష్యా సైన్యంలో చేరిన హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ అస్ఫాన్ అనే యువకుడు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అహ్మద్ ఉదంతం వెలుగులోకి రావడంతో ఉద్యోగం పేరుతో అమాయకులను యుద్ధంలోకి పంపుతున్న ఏజెంట్ల మోసాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
వివాదాస్పద వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ వివరణ