లూలు కి కేటాయించిన భూములను రద్దు చేయాలి…వి లక్ష్మణ్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా దోచి పెట్టె విధానానికి స్వస్తిపలకాలి ..
గుజరాత్ మాదిరిగా భూములను బహిరంగ వేలం వేయాలి
9 లక్షల లాభాలు గడిస్తున్న గూగుల్ కు 22 వేల కోట్లు రాయితీలు ప్రకటించడం సిగ్గు చేటు ..
మరో పక్క మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో ప్రవేట్ వాళ్లకు కట్టబెట్టడం పై విమర్శలు
మీడియా సమావేశంలో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి
లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఏపీ ప్రభుత్వం అప్పనంగా కేటాయించడాన్ని జనచెతన్య వేదిక తీవ్రంగా తప్పుపట్టింది .ఈ మేరకు వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు .ఇది అభివృద్ధి ,ఉద్యోగ కల్పన పేరుతో ఒక పెద్ద బహుళజాతి సంస్థకు దోచి పెట్టడమేనని విమర్శించారు . విశాఖపట్నంలో బీచ్ రోడ్డు లో హర్బర్ పార్క్ లో కేటాయించిన 13.74 ఎకరాలు, విజయవాడ నడిబొడ్డులో ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన 4.15 ఎకరాల విలువైన భూమిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో జరిగిన మీడియా సమావేశంలో లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ ఇటీవల గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలో సర్దార్ పటేల్ రింగ్ రోడ్ వద్ద ఉన్న 66 వేల 168 చదరపు మీటర్ల స్థలం దాదాపు 16.35 ఎకరాలను లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ ప్రైవేట్ లిమిటెడ్ వేలంలో 519.41 కోట్లకు, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. గుజరాత్ రాష్ట్రంలో లూలు సంస్థ దాదాపు 4 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమౌతుందని గుజరాత్ లో లులు హైపర్ మార్కెట్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, సూరత్ లో ఎగుమతులను ప్రోత్సహించే కార్యక్రమాలకు లులు సంస్థ సంసిద్ధతను వ్యక్తం చేసినా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఒక సెంటు భూమిని కూడా కేటాయించ లేదన్నారు. లులు సంస్థ ఆంధ్రప్రదేశ్ లో 1000 కోట్ల రూపాయలు విశాఖ, విజయవాడలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడితే 1000 కోట్ల రూపాయలకు పైగా విలువ కలిగిన భూములను దారాదత్తం చేస్తుందని వివరించారు. గత 16 నెలలుగా వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను కారు చౌకగా అభివృద్ధి పేరుతో కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని ఇదేనా రాష్ట్రానికి మేలు చేయడమంటే అని ప్రశ్నించారు . సంవత్సరానికి 9 లక్షల కోట్లకు పైగా లాభాలను గడిస్తున్న గూగుల్ సంస్థలకు 22 వేల కోట్ల రూపాయల విలువ గల రాయితీలను ప్రకటించడం ఏ రకంగా సమర్ధనీయమో రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలని అన్నారు . మరోవైపు 5 వేల కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టలేని దీనస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెబుతూ 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ పేరుతో కార్పొరేట్ ఆసుపత్రులకు కట్టపెట్టాలని చూడడాన్ని తప్పు పట్టారు . అతి కొద్ది మందికి మాత్రమే అతి తక్కువ వేతనాలు కలిగిన ఉద్యోగాలను కల్పిస్తున్న లులు సంస్థకు 1000కోట్ల రూపాయల పైగా విలువ గల భూములను 99 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వడం అర్ధరహితమన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గత ఉత్తర్వులను రద్దుచేసి గుజరాత్ మాదిరిగా బహిరంగంగా వేలం వేసి భూములను కేటాయించాలని ప్రజల సంపదను, ప్రజల వనరులను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా బదలాయించే విధానానికి స్వస్తి పలకాలని లక్ష్మణ రెడ్డి పేర్కొన్నారు…