- ఉగ్రవాద మాడ్యూల్‌తో సంబంధాల ఆరోపణలు
- నలుగురు డాక్టర్ల రిజిస్ట్రేషన్ల రద్దు
- వైద్య వృత్తి చేపట్టకుండా శాశ్వతంగా నిషేధం
ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై జాతీయ మెడికల్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. నలుగురు డాక్టర్ల రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ, దేశంలో ఎక్కడా వైద్య వృత్తి చేపట్టకుండా వారిపై నిషేధం విధించింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు కేసుకు సంబంధించి ఉగ్రవాద మాడ్యూల్‌తో వీరికి సంబంధాలున్నట్లు తేలడంతో ఈ కఠిన చర్యలు తీసుకున్నారు. ఎన్‌ఎంసీ ఆదేశాల ప్రకారం డాక్టర్ ముజాఫర్ అహ్మద్, డాక్టర్ అదీల్ అహ్మద్ రాదర్, డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ షాహీన్ సయీద్‌ల పేర్లను ఇండియన్ మెడికల్ రిజిస్ట్రీ, నేషనల్ మెడికల్ రిజిస్ట్రీ నుంచి తొలగించారు.
జమ్మూకశ్మీర్ పోలీసులు అందించిన సమాచారం, ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం కింద నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌ఎంసీ వెల్లడించింది. ఎన్‌ఎంసీ ఆదేశాల మేరకు సంబంధిత రాష్ట్రాల మెడికల్ కౌన్సిళ్లు కూడా ఈ నలుగురు డాక్టర్ల పేర్లను తమ రిజిస్టర్ల నుంచి తొలగించాయి.
ఇదే కేసుకు సంబంధించి, ప్రధాన నిందితుడైన డాక్టర్ ఉమర్-ఉన్-నబీ అలియాస్ ఉమర్ మహ్మద్‌కు చెందిన ఇంటిని భద్రతా బలగాలు ఇటీవల పుల్వామాలో పేల్చివేసిన విషయం తెలిసిందే. తాజా పరిణామం ఈ కేసులో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
ఎంబీబీఎస్ విద్యార్థిని పట్టుకున్న ఎన్ఐఏ

- బెంగాల్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ
- మొబైల్ టవర్ లొకేషన్ ఆధారంగా పట్టుకున్న అధికారులు
- నిందితుడు ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీ విద్యార్థి
- కుటుంబ ఫంక్షన్ కోసం సొంత గ్రామానికి వచ్చిన నిందితుడు
- ఇదే యూనివర్సిటీలో పలువురిపై కొనసాగుతున్న ఎన్ఐఏ విచారణ
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ఈ వారం జరిగిన కారు పేలుడు కేసు దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కీలక పురోగతి సాధించింది. ఈ ఘటనతో సంబంధం ఉందన్న ఆరోపణలపై ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్న నిసార్ ఆలం అనే విద్యార్థిని అరెస్ట్ చేసింది. పశ్చిమ బెంగాల్ పోలీసులతో కలిసి నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో నార్త్ దినాజ్‌పూర్ జిల్లాలోని దల్ఖోలాలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు శనివారం ఉదయం అధికారులు ధ్రువీకరించారు.
నిసార్ ఆలం కుటుంబం పంజాబ్‌లోని లూథియానాలో స్థిరపడింది. అయితే, వారి స్వగ్రామం దల్ఖోలాలోని కోనల్ గ్రామం. ఇటీవల ఓ కుటుంబ ఫంక్షన్ కోసం తల్లి, సోదరితో కలిసి అతడు ఇక్కడికి వచ్చాడు. నిందితుడి మొబైల్ టవర్ లొకేషన్ ఆధారంగా అతడి కదలికలను గుర్తించిన ఎన్ఐఏ బృందం, శుక్రవారం దల్ఖోలా చేరుకుని అతడిని అరెస్ట్ చేసింది. అనంతరం స్థానిక ఇస్లాంపూర్ పోలీస్ స్టేషన్‌కు, ఆ తర్వాత సిలిగురికి తరలించింది. అతడిని ట్రాన్సిట్ రిమాండ్‌పై ఢిల్లీకి తరలించే అవకాశం ఉంది.
ఈ అరెస్ట్‌పై స్థానిక గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిసార్ ఆలం చాలా మంచివాడని, మృదుస్వభావి అని, అతడికి ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉందని తాము ఊహించలేదని మీడియాకు తెలిపారు.
ఇదిలా ఉంటే… ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో 13 మంది మరణించగా, డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో అల్-ఫలాహ్ యూనివర్సిటీపై ఎన్ఐఏ అధికారులు దృష్టి సారించారు. జైష్-ఎ-మొహమ్మద్ టెర్రర్ మాడ్యూల్ నడుపుతున్నారనే అనుమానంతో ఇప్పటికే డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ షహీన్ షాహిద్, డాక్టర్ ఉమర్ మహమ్మద్ అనే ముగ్గురు డాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా యూనివర్సిటీలో దాదాపు 52 మందిని ప్రశ్నించారు.