అంతర్జాతీయం

షేక్ హసీనా అప్పగింతకు భారత్ విముఖత… బంగ్లాదేశ్ కీలక నిర్ణయం

  • షేక్ హసీనాకు మరణశిక్ష విధించిన ట్రైబ్యునల్
  • రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేలా సన్నాహాలు చేపట్టిన బంగ్లాదేశ్
  • బంగ్లాదేశ్ మీడియాలో వార్తలు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించాలని భావిస్తోంది. మానవత్వం మరిచి తీవ్ర నేరాలకు పాల్పడ్డారన్న కేసులో షేక్ హసీనాకు బంగ్లాదేశ్ అంతర్జాతీయ క్రైమ్ ట్రైబ్యునల్ మరణశిక్ష విధించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆమెను తమకు అప్పగించాలని యూనస్ ప్రభుత్వం కోరుతున్నప్పటికీ భారత్ విముఖత చూపిస్తోంది. ఈ మేరకు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

గత సంవత్సరం దేశం విడిచిన షేక్ హసీనా, మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్‌లపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాల్సిందిగా ఇంటర్‌పోల్‌ను అభ్యర్థించడానికి బంగ్లాదేశ్ ప్రాసిక్యూటర్ గాజీ తమీమ్ సన్నాహాలు చేస్తున్నారని బంగ్లాదేశ్ దినపత్రిక ‘ది ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్’ నివేదించింది.

పరారీలో ఉన్న ఇద్దరు నిందితులపై రెడ్ నోటీసులు జారీ చేయాలని కోరుతూ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఇదివరకే ఇంటర్‌పోల్‌కు అరెస్టు వారెంటుతో పాటు దరఖాస్తు సమర్పించినట్లు బంగ్లాదేశ్ మీడియాలో వార్తలు వచ్చాయి. గత సంవత్సరం జరిగిన రిజర్వేషన్ల ఆందోళనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఢిల్లీలో గుర్తు తెలియని ప్రాంతంలో ఉంటున్నట్లు తెలుస్తోంది.

మా అమ్మను అప్పగిస్తే చంపేస్తారు: షేక్ హసీనా కుమారుడు

Sajeeb Wazed Joy Handing Over My Mother Means Death
  • హసీనాను అప్పగించాలని భారత్‌ను కోరిన బంగ్లాదేశ్
  • షేక్ హసీనా అప్పగింతపై కుమారుడి ఆందోళన
  • లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు బంగ్లాలో ఉన్నాయని వెల్లడి

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజీబ్ వాజెద్ జోయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తల్లిని బంగ్లాదేశ్‌కు అప్పగిస్తే అక్కడి మిలిటెంట్లు ఆమెను చంపేస్తారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న తన తల్లికి భద్రత కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సరిహద్దుల్లో ఉగ్రవాదం పెరిగిపోతోందని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని భారత్‌ను హెచ్చరించారు.

ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాజీబ్ మాట్లాడుతూ.. తన తల్లిని అప్పగించాలన్న బంగ్లాదేశ్ ప్రభుత్వ అభ్యర్థనను తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రస్తుత బంగ్లా ప్రభుత్వం న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తోందని ఆరోపించారు. తన తల్లిపై తప్పుడు కేసులు బనాయించారని, 17 మంది న్యాయమూర్తులను తొలగించి, పార్లమెంట్ ఆమోదం లేకుండానే చట్టాలను సవరించి విచారణ జరుపుతున్నారని విమర్శించారు. కనీసం డిఫెన్స్ లాయర్లను కూడా కోర్టులోకి అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

“భారత్ మా అమ్మ ప్రాణాలను కాపాడింది. ఆమె బంగ్లాదేశ్ విడిచిపెట్టకపోయి ఉంటే, మిలిటెంట్లు ఆమెను చంపేసేవారు” అని సాజీబ్ అన్నారు. ప్రస్తుత యూనుస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, హసీనా హయాంలో అరెస్టయిన వేలాది మంది ఉగ్రవాదులను విడుదల చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు బంగ్లాదేశ్‌లో స్వేచ్ఛగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని తెలిపారు. బంగ్లా ఉగ్రవాదంపై ప్రధాని మోదీ కూడా తీవ్ర ఆందోళనతో ఉన్నారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. తన తల్లిని అప్పగించాలని బంగ్లా ప్రభుత్వం చేసిన అభ్యర్థనను భారత్ తిరస్కరిస్తుందన్న నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు.

Related posts

మిస్‌ వరల్డ్‌ 2025 కిరీటం థాయ్‌లాండ్‌ సుందరి సొంతం.. ఓపల్ భావోద్వేగం…

Ram Narayana

చైనీయులతో ప్రేమ‌, పెళ్లి, శారీరక సంబంధాలు వద్దు: అమెరికా

Ram Narayana

నేపాల్ లో లోయలో పడ్డ బస్సు.. ఆరుగురు భారతీయులు సహా ఏడుగురి మృతి

Ram Narayana