ఖమ్మం వార్తలు

అన్నం శ్రీనివాసరావు సేవలు ఎనలేనివి…

ఎందరో అనాధలు, అభాగ్యులను చేరదీసి వారికి అనేక రకాలుగా సేవలు అందిస్తున్న సామాజిక సేవకుడు, సంఘసంస్కర్త అన్నం ఫౌండేషన్ వ్యవస్థాపకులు అన్నం శ్రీనివాసరావు సేవలు ఎనలేనివి అని టియుడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోల రామనారాయణ పేర్కొన్నారు. శనివారం ఖమ్మంలో జరిగిన యూనియన్ జిల్లా కమిటీ కార్యవర్గ సమావేశంలో అన్నం శ్రీనివాసరావును ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ గజమాలతో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రామనారాయణ మాట్లాడుతూ ఖమ్మంలో అన్నం పౌండేషన్ ద్వారా అనేక సేవలందిస్తున్న అన్నం శ్రీనివాసరావు జిల్లాలో చేస్తున్న సేవలను కొనియాడారు. మనుషులు సైతం సంఘటన స్థలానికి వెళ్లేందుకు వీలుకాని ప్రదేశాలకు వెళుతూ అక్కడ పడి ఉన్న శవాలకు దహన సంస్కారాలు నిర్వహించటం అందరి వల్ల కాదన్నారు. సొంత వారిని సైతం దూరం చేసిన కరోనా మహమ్మారికి బలై ప్రాణాలు వదిలిన ఎందరినో వారి సొంత కుటుంబ సభ్యులు పట్టించుకోకుండా వదిలేసిన అనేక సంఘటనలలో అన్నం శ్రీనివాసరావు దగ్గరుండి దహన సంస్కారాలు నిర్వహించటం ఆయన చేసిన సేవలు విలువ కట్టలేనివని అన్నారు. అన్నం శ్రీనివాసరావు చేసిన సేవలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.
సన్మాన గ్రహీత అన్నం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇప్పటివరకు 30 వేల అనాధ శవాలకు దహన సంస్కారాలు చేసినట్లు వెల్లడించారు. కరోనా సమయంలో దాదాపు 2000 కరోనా బారిన పడి మృతి చెందిన వారికి దగ్గరుండి దహన సంస్కారాలు చేశానని తెలిపారు. వందలాదిమంది మతిస్థిమితం లేని అనాధలు, అభాగ్యులను చేరదీసి వారికి సరైన వైద్యం అందించి కోలు కున్న తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించడం జరుగుతుందన్నారు. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలలో తన అవసరం మేరకు పోలీస్ వ్యవస్థ ఇతర సామాజిక సంఘ సేవకులు అందించిన సమాచారం మేరకు అక్కడ వారికి సేవలందించానని వివరించారు. ఖమ్మంలో తన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నం పౌండేషన్ అనాధ ఆశ్రమంలో దాదాపు 200 మంది గుడ్డి, చెవుడు, మూగ, వయోవృద్ధులు ఉన్నారని కొంతమంది మంచానికే పరిమితమైన వారు సైతం ఉన్నారని వారందరికీ నిత్యం బాగోగులు చూసుకుంటూ వారి అవసరాలు తీరుస్తున్నామని చెప్పారు. దీంతోపాటు గత ఎన్నో ఏళ్లుగా రైలు ప్రమాదంలో చనిపోయి చిద్రమైన భాగాలను సైతం ఒక్కొక్కటిగా చేర్చిన అనేక సంఘటనలను గుర్తు చేశారు. మనుషులకే కాకుండా ప్రాణాలు వదిలిన మూగ జీవులకు సైతం తాను అవసరమైన మేరకు సేవలందిస్తున్నానని తెలిపారు. ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయిన అనేక సంఘటనలో పోలీసు డిపార్టుమెంటు, సామాజిక సేవకులు, అక్కడివారు ముందుగా తనకు సమాచారం ఇస్తారని వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి అవసరమైన సేవలందించటం తనకు అలవాటుగా మారిందన్నారు. తన ప్రాణం ఉన్నంత వరకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏనుగు వెంకటేశ్వరరావు, మైస పాపారావుతో పాటు రాష్ట్ర, జిల్లా, నగర నాయకులు పాల్గొన్నారు.

Related posts

తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంను ఎందుకు అభివృద్ధి చేయలేదు?: పువ్వాడ అజయ్

Ram Narayana

సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకుందాం….జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

Ram Narayana

రామసహాయం రఘురాంరెడ్డి స్థానికుడే …మాగ్రామం వాసే …డాక్టర్ శ్రీదేవి

Ram Narayana