- పైలట్ల కొరతతో తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న ఇండిగో ఎయిర్‌లైన్స్
- నాలుగో రోజూ కొనసాగుతున్న విమానాల రద్దు
- ప్రయాణికులకు తప్పని తిప్పలు
- దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో గందరగోళం
- పరిస్థితిని చక్కదిద్దేందుకు డీజీసీఏ జోక్యం
- 2026 నాటికి సాధారణ స్థితికి వస్తామని ఇండిగో హామీ
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ కార్యకలాపాల నిర్వహణలో సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. వరుసగా నాలుగో రోజు శుక్రవారం కూడా వందల సంఖ్యలో విమానాలను రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో గందరగోళం నెలకొంది. వేలాది మంది ప్రయాణికులు తిండి, నీళ్లు లేకుండా ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది. పైలట్ల కొరత, కొత్త నిబంధనల అమలులో యాజమాన్యం ప్రణాళిక లోపమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
నిన్న ఒక్కరోజే ఇండిగో 550కి పైగా దేశీయ, అంతర్జాతీయ విమానాలను రద్దు చేసింది. సాధారణంగా రోజుకు 170-200 సర్వీసులు రద్దు చేసే ఇండిగో, ఒక్కసారిగా ఈ స్థాయిలో విమానాలను నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముంబైలో 118, బెంగళూరులో 100, హైదరాబాద్‌లో 75, కోల్‌కతాలో 35 విమానాలు రద్దయ్యాయి. దీంతో పుణె, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, గోవా వంటి ప్రధాన నగరాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
విమానాశ్రయాల్లో ఎటుచూసినా ప్రయాణికుల ఆందోళనలే కనిపించాయి. కౌంటర్ల వద్ద సిబ్బంది అందుబాటులో లేకపోవడం, ప్రత్యామ్నాయ విమానాలపై స్పష్టత లేకపోవడంతో గంటల తరబడి పడిగాపులు కాశారు. కొందరు తమ లగేజీపైనే నిద్రిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. “బెంగళూరు వెళ్లే విమాన టికెట్ ధర ఓ టేలర్ స్విఫ్ట్ సంగీత కచేరీ టికెట్ కన్నా ఎక్కువైపోయింది” అని ఓ ప్రయాణికుడు వాపోయాడు. మరోచోట ఇండిగో సిబ్బందిని ప్రశ్నించగా.. “విమానం సిద్ధంగా ఉంది, కానీ నడపడానికి పైలట్ లేడు” అని సమాధానం ఇవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఈ సంక్షోభంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రంగంలోకి దిగింది. ఇండిగో యాజమాన్యంతో అత్యవసర సమావేశాలు నిర్వహించి, కార్యకలాపాలను వెంటనే గాడిలో పెట్టాలని ఆదేశించింది. పైలట్ల పనివేళలు, విశ్రాంతికి సంబంధించిన కొత్త నిబంధనల (FDTL) అమలులో ఎంత మంది సిబ్బంది అవసరమో అంచనా వేయడంలో ఇండిగో విఫలమైందని డీజీసీఏ గుర్తించింది.
కాగా, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఇండిగో క్షమాపణలు చెప్పింది. 2026 ఫిబ్రవరి 10 నాటికి కార్యకలాపాలను పూర్తిగా సాధారణ స్థితికి తీసుకొస్తామని డీజీసీఏకు హామీ ఇచ్చింది. అయితే, రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు రద్దు కావచ్చని, డిసెంబర్ 8 నుంచి సర్వీసులను తగ్గిస్తామని తెలిపింది. ప్రయాణికులు తమ విమాన స్థితిని చూసుకున్నాకే ఎయిర్‌పోర్టుకు రావాలని సూచించింది.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ‘ఇండిగో’ గందరగోళం… ఒక్కరోజే 92 విమానాల రద్దు

- శంషాబాద్ విమానాశ్రయంలో కొనసాగుతున్న ఇండిగో సేవల అంతరాయం
- ఇవాళ ఒక్కరోజే 92 విమాన సర్వీసులను రద్దు చేసిన సంస్థ
- ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో సిబ్బందితో ప్రయాణికుల తీవ్ర వాగ్వాదం
- చిక్కుకుపోయిన అయ్యప్ప భక్తులు… రంగంలోకి దిగిన ఏపీ మంత్రి
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో ఇండిగో ఎయిర్‌లైన్స్ సేవల రద్దుతో నెలకొన్న గందరగోళం కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజైన శుక్రవారం కూడా ఇండిగో ఏకంగా 92 విమానాలను రద్దు చేయడంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ఎయిర్‌పోర్ట్ ప్రతినిధి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈరోజు రద్దు చేసిన విమానాల్లో 43 రాకపోకలు, 49 బయలుదేరే సర్వీసులు ఉన్నాయి. గత నాలుగు రోజుల్లో ఇంత పెద్ద సంఖ్యలో విమానాలు రద్దు కావడం ఇదే తొలిసారి. నిన్న 74 విమానాలను రద్దు చేసిన ఇండిగో, ఈ నెల 2 నుంచి ఇప్పటివరకు మొత్తం 220 సర్వీసులను నిలిపివేసింది.
ఈ వరుస రద్దులతో విసిగిపోయిన ప్రయాణికులు టెర్మినల్ భవనంలో ఆందోళనకు దిగారు. ఇండిగో సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగి, తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. చెక్-ఇన్ ప్రక్రియ పూర్తయ్యాక విమానాలను రద్దు చేస్తున్నారని కొందరు ప్రయాణికులు ఆరోపించారు. సిబ్బంది అందుబాటులో లేనప్పుడు విమానాలను ఎందుకు షెడ్యూల్ చేస్తున్నారని ప్రశ్నిస్తూ, “షేమ్ షేమ్” అంటూ నినాదాలు చేశారు.
ముఖ్యంగా కొచ్చి వెళ్లాల్సిన విమానాలు రద్దు కావడంతో అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకుపోయారు. వారు “స్వామియే శరణం అయ్యప్ప” అంటూ నినాదాలతో తమ నిరసనను వ్యక్తం చేశారు. అదే సమయంలో విజయవాడ వెళ్లేందుకు వచ్చిన ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి, అయ్యప్ప భక్తుల సమస్యపై స్పందించారు. ఆయన వెంటనే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఫోన్‌లో మాట్లాడి, ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలని కోరారు. అయితే, తన విమానాన్ని అందుకోలేకపోయిన మంత్రి పార్థసారథి, చివరకు రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరి వెళ్లారు.
మరోవైపు విశాఖపట్నం విమానాశ్రయంలో కూడా 8 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ వంటి నగరాలకు సర్వీసులు నిలిచిపోవడంతో అక్కడ కూడా ప్రయాణికులు నిరసన తెలిపారు.
ఈ పరిణామాలపై ఇండిగో సంస్థ స్పందిస్తూ.. సాంకేతిక లోపాలు, శీతాకాలం కారణంగా షెడ్యూళ్లలో మార్పులు, వాతావరణ సమస్యలు, విమాన రాకపోకల్లో రద్దీ, సిబ్బంది విమాన డ్యూటీ సమయాలపై కొత్త నిబంధనల అమలు వంటి అనేక కారణాల వల్ల ఈ అంతరాయం ఏర్పడిందని వివరణ ఇచ్చింది. ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరే ముందు తమ విమాన స్థితిని తెలుసుకోవాలని ఆర్‌జీఐఏ అధికారులు సూచించారు.