Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

ఏపీ సపోర్ట్ లేకపోతే కేంద్రంలో బీజేపీ ఉండేది కాదు: అఖిలేశ్ యాదవ్..

  • హైదరాబాద్ సదర్ సమ్మేళనంలో పాల్గొన్న అఖిలేశ్ యాదవ్
  • ముఖ్య అతిథిగా హాజరైన ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం
  • వచ్చే ఎన్నికల్లో యూపీలో జెండా పాతేస్తామని ధీమా

సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ మద్దతు లేకపోయి ఉంటే, కేంద్రంలో బీజేపీ కూటమి తిరిగి అధికారంలోకి వచ్చేదే కాదని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జరిగిన సదర్ సమ్మేళనం ఉత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అఖిలేశ్ మాట్లాడుతూ, “మనం వేర్వేరు రాజకీయ పార్టీల్లో ఉండొచ్చు, కానీ మనమంతా ఒక్కటే. ఇవాళ మనం ఇక్కడ రాజకీయాలకు అతీతంగా కలుసుకున్నాం” అని అన్నారు. భవిష్యత్తులో ఈ ఉత్సవాన్ని మరింత గొప్పగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని తాము వెనక్కి నెడుతున్నామని, రాబోయే ఎన్నికల్లో అక్కడ మళ్లీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

నగర పర్యటనకు విచ్చేసిన అఖిలేశ్ యాదశ్, ఈ రాత్రికి తాజ్ కృష్ణా హోటల్‌లో బస చేయనున్నారు. శనివారం ఓ ప్రైవేటు సమావేశంలో పాల్గొని, సాయంత్రం 4 గంటలకు లక్నో తిరుగు ప్రయాణమవుతారు. అఖిలేశ్ పర్యటనకు నగరంలోని యాదవ సంఘాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. 

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్

Akhilesh Yadav Meets Telangana CM Revanth Reddy
  • హైదరాబాద్ నగరానికి వచ్చిన అఖిలేశ్ యాదవ్
  • జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో భేటీ
  • అమలు చేస్తున్న పథకాల గురించి వివరించిన రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్ నగర పర్యటనలో ఉన్న అఖిలేశ్ యాదవ్, జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిరువురు జాతీయ రాజకీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం.

రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి అఖిలేశ్ యాదవ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజం.. ప్రజలు తిరిగి కేసీఆర్‌కు పట్టం కడతారు: కేటీఆర్‌తో భేటీ అనంతరం అఖిలేశ్ యాదవ్

Akhilesh Yadav says KCR will regain power after KTR meeting
  • కేసీఆర్, కేటీఆర్ ఎప్పటికీ తమకు స్నేహితులే అన్న అఖిలేశ్ యాదవ్
  • ప్రజలు ఒకసారి స్వీకరిస్తారు.. మరోసారి పునఃపరిశీలించుకునే అవకాశం ఇస్తారని వ్యాఖ్య
  • యూపీలో ఎస్పీలా మేం బౌన్స్ బ్యాక్ అవుతామన్న కేటీఆర్

రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజమని, పరిస్థితులు మారుతాయని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అన్నారు. ప్రజలు తిరిగి కేసీఆర్‌కు పట్టం కడతారనే నమ్మకం తనకు ఉందని అన్నారు. హైదరాబాద్‌‌లోని నందినగర్‌లోని కేసీఆర్‌ ఇంటికి అఖిలేశ్ యాదవ్ వచ్చారు. కేటీఆర్‌, హరీశ్ రావు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించారు.

అనంతరం అఖిలేశ్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్, కేటీఆర్ ఎప్పటికీ తమకు స్నేహితులేనని, తాము ఎప్పటికీ వారితోనే ఉంటామని అన్నారు. కేటీఆర్ ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా మాట్లాడతారని, సొంత మనిషిలా అనిపిస్తారని అన్నారు. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా తాను కలుస్తున్నానని తెలిపారు. రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటాయని, ప్రజలు ఒక్కోసారి స్వీకరిస్తారని, మరోసారి మన విషయాలను పునఃపరిశీలించుకునే అవకాశం ఇస్తారని ఆయన అన్నారు.

ఒకప్పుడు తాము తక్కువ సీట్లు గెలిచామని కానీ అదే ప్రజలు మళ్లీ తమ వెంట నిలిచారని ఆయన అన్నారు. అక్కడ బీజేపీ రెండో స్థానంలో ఉందని మనం ప్రజల వెంట నిలబడినప్పుడు ఏదో ఒక రోజు ప్రజలే మన పార్టీల వెంట నిలబడతారని, అండగా  ఉంటారని తెలిపారు.

తెలంగాణలోనూ పరిస్థితులు మారతాయని ఆశిస్తున్నామని అన్నారు. దేశం ప్రగతిశీల మార్గంలో వెళ్లే అవసరం ఉందని అన్నారు. దూరదృష్టితో ముందుకు వెళ్లాలని, విభజన రాజకీయాలు అంతం కావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌తోనూ మాట్లాడానని, త్వరలోనే వచ్చి ఆయనను కలుస్తానని అన్నారు.

అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ త్వరలోనే అఖిలేశ్ యాదవ్ కేసీఆర్‌తో సమావేశం అవుతారని అన్నారు. హైదరాబాద్ వచ్చిన అఖిలేశ్ యాదవ్‌కు తాము స్వాగతం పలుకుతామని చెబితే, స్వయంగా వచ్చి కలుస్తానని, చర్చిస్తామని చెప్పారని తెలిపారు. కేసీఆర్ ఇంటికి వచ్చి తమతో సమయం గడిపి ఆతిథ్యం స్వీకరించారన్నారు. గతంలో శాసనసభలో అధికారం కోల్పోయిన తర్వాత పార్లమెంట్‌లో తక్కువ సీట్లు సాధించినా ప్రజల వెంబడి నిలబడినందుకు అఖిలేశ్ యాదవ్ పార్టీ ఇప్పుడు 37 మంది ఎంపీలను గెలిపించుకొని దేశంలోని మూడవ అతిపెద్ద పార్టీగా నిలిచిందన్నారు.

అఖిలేశ్ పార్టీ స్ఫూర్తితో బీఆర్ఎస్ కూడా భవిష్యత్తులో ముందుకు సాగుతుందని కేటీఆర్ అన్నారు. ప్రజల వెంట నిలబడి మరోసారి తప్పకుండా ప్రజల ఆశీర్వాదాలు పొందుతామని ఆయన అన్నారు. బీఆర్ఎస్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతుందని, మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తామన్నారు.

Related posts

ఖమ్మం లోకసభ నుంచే సోనియాగాంధీని పోటీచేయించాలనే ఆలోచనలో టీపీసీసీ ….?

Ram Narayana

నేను మళ్లీ ముఖ్యమంత్రిని అవుతానా?: ప్రజలను అడిగిన మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్

Ram Narayana

రాహుల్ గాంధీ యాత్ర… మణిపూర్‌కు వెళ్లనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana

Leave a Comment