ప్రభుత్వ పథకాల అమల్లో ఉద్యోగులే కీలకం వారే రథసారధులు ..సీఎం రేవంత్ రెడ్డి

ఉద్యోగులే తమ సారథులు, వారధులు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని, గత ప్రభుత్వం వదిలివెళ్లిన అప్పులు తీర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వంలో ఉన్న 200 మంది మాత్రమే రాష్ట్రాన్ని నడపలేరన్న ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని నడిపేది 10.50 లక్షల మంది ఉద్యోగులని, ఉద్యోగులు సరిగా పని చేయడం వల్లే పథకాలు సరిగా అమలు అవుతున్నాయని కితాబిచ్చారు. హైదరాబాద్ లోని సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ 2026 డైరీ అండ్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, గెజిటెడ్ అధికారుల సంఘం నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు రూ.12 వేల కోట్ల మేర పెండింగ్ ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పన్ను వసూళ్లలో అవకతవకలు అరికడితే కావాల్సిన నిధులు అవే వస్తాయన్నారు. పన్నులు పెంచాల్సిన అవసరం లేదని, సరిగా వసూళ్లు చేస్తే చాలన్న సీఎం, చాలా మందిని పన్ను కట్టాలని ఉద్యోగులు అడగట్లేదన్నారు. ఈ క్రమంలోనే ఉద్యోగుల డీఏ దస్త్రాలపై సంతకం చేసి ఈ కార్యక్రమానికి వచ్చినట్లు చెప్పిన రేవంత్ రెడ్డి, ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి రూ.కోటి బీమా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఉద్యోగుల డీఏ దస్త్రాలపై సంతకం చేసి ఈ కార్యక్రమానికి వచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 3.64 శాతం పెంచుతూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. 2024 జులై 1 నుంచి పెరిగిన డీఏ వర్తించనుండగా, జనవరి నెల వేతనంతో పెరిగిన డీఏ ఫిబ్రవరి 1న చెల్లించనున్నారు . 2023 జులై 1 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు డీఏ బకాయిలు జీపీఎఫ్ ఖాతాలో జమ చేశారు.
జిల్లాల పునర్విభజన కోసం కమిటీ
జిల్లాల పునర్విభజన కోసం ప్రత్యేక కమిటీ…* రాష్ట్రంలో త్వరలో జిల్లాల పునర్విభజన ఉంటుందన్న సీఎం, ఇందుకోసం రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ప్రత్యేక కమిటీ వేస్తామని తెలిపారు. ఆ కమిటీ రాష్ట్రమంతా తిరిగి ప్రజల అభిప్రాయాలు స్వీకరిస్తుందన్నారు. గతంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు అడ్డగోలుగా జరిగిందన్న సీఎం, జిల్లాల సరిహద్దులు మార్చాలని విజ్ఞప్తులు వస్తున్నాయని, అందుకు అనుగుణంగా జిల్లాల పునర్విభజన చేయనున్నట్లు వివరించారు. ఈ క్రమంలోనే కొత్త జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. మరోవైపు రాచకొండ కమిషనరేట్ పేరు సహేతుకంగా లేదని, అందుకే మార్చినట్లు సీఎం పేర్కొన్నారు. రాచకొండ పేరు రాచరిక పాలనకు గుర్తుగా ఉందని మార్చామన్నారు. సికింద్రాబాద్ విషయంలో తాను వచ్చాక చేసిందేమీ లేదని, సికింద్రాబాద్ గతంలోనే జీహెచ్‌ఎంసీలో భాగంగా ఉందని స్పష్టం చేశారు.