మధిర నియోజకవర్గంలో ప్రతి చెట్టూపుట్ట చెపుతుంది … భట్టి ఏమిచేశాడో అన్న విక్రమార్కుడు
కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఇంకో పార్టీకి భవిష్యత్తు ఉండదు
మధిర అభివృద్ధి చెందితేనే భవిష్యత్ తరాలకు మంచిది
మధిర నగరం క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలి అనుకునే వారినే గెలిపించుకోవాలి
మధిర మున్సిపల్ కీలక నాయకుల ప్రత్యేక సమావేశంలో డిప్యూటీ సీఎం

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గతంలో ఎన్నుడు లేనివిధంగా తనపై బీఆర్ యస్ నేతలు ప్రత్యేకించి ఇటీవల ఖమ్మం పర్యటనకు వచ్చిన కేటీఆర్ , మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావుల చేసిన విమర్శలపై ఫైర్ అయ్యారు ..వారిపై తీవ్రమైన స్వరంతో తాను మధిర నియోజకవర్గంలో చేసిన పనులను గురించి వివరిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు …ఎక్కడ నుంచో వచ్చిన ఒకాయన ,మరో గుత్తేదారు తనపై విమర్శలు చేయడంపై భట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ..నియోజకవర్గంలో తాను చేసిన పనులు ఏ పుట్టనడిగినా ,చెట్టునడిగినా చూపుతాయని తెలియని మూర్ఖులు అది తెలుసుకొని మాట్లాడాలని ధ్వజమెత్తారు … ఈ సందర్భంగా జాలమూడి,కట్టలేరు , పందిళ్లపల్లి ఎత్తి పోతుల పథకాలను అడిగేతే చూపుతాయని , ప్రతి ఊరుకి రోడ్, ప్రతి గ్రామంలో భట్టి విక్రమార్క మార్క్ అభివృద్ధి లేకుండా లేదని గద్గద స్వరంతో అన్నారు ..
కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ఇంకో పార్టీ పుట్టేదే కాదు, మరో పార్టీకి భవిష్యత్తు ఉండేది కాదు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం ఆయన మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి లో కాంగ్రెస్ కీలక నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఇతర పార్టీలు రెండు మూడు దశాబ్దాల క్రితం చేసిన ఐదు లక్షల పనిని మైకు దొరికిన ప్రతిసారి చెప్పుకుంటూ పోతారు, కానీ కాంగ్రెస్ శ్రేణులు ప్రచారంలో వెనుకంజలో ఉండటం మూలంగా ఇబ్బంది ఏర్పడుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. మధిర మున్సిపాలిటీ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మధిర నగరానికి వచ్చిన రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం వంటి పథకాలను ప్రతి నాయకుడు రోజు పదిమందికి వివరిస్తే చాలని సూచించారు.
మధిర పట్టణం అభివృద్ధి చెందాలి క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంటేనే భవిష్యత్తు తరాలు బాగుపడతాయని ఆలోచించే వ్యక్తులను గెలిపించుకోవాలని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. మధిర పట్టణానికి కాంగ్రెస్ చేయని పని అంటూ లేదు అన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్తు, చెరువులను టూరిజం పార్కులుగా తీర్చిదిద్దడం, డిగ్రీ, ఇంటర్, హై స్కూల్ విద్యాసంస్థలకు సొంత భవనాలు, అగ్రికల్చర్ పాలిటెక్నిక్, జనరల్ పాలిటెక్నిక్, ఐటిఐ ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ గా మార్చడం, బస్టాండ్, ట్రెజరీ, బ్యాంకులను తీసుకురావడం వంటి గొప్ప పనులు చేసాం ఇవి మున్సిపాలిటీలోని ఓటర్లకు వివరించాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు.
ఒక మంచి ఇల్లు కట్టాలి అనుకున్నప్పుడు మొదట సిమెంటు, కంకర, ఇటుకలు ఎక్కడపడితే అక్కడ ఉంటాయి చిందరవందరగా కనిపిస్తుంది కానీ ఇల్లు పూర్తయిన తర్వాత అందంగా కనిపిస్తుంది అదే తరహాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి అది పూర్తయితే నగరం సుందరంగా మారుతుందని తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తయిన చోట మట్టిని పూడ్చాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తయిన తర్వాత మధిర నగరం మొత్తంగా కొత్త సిసి రోడ్ల నిర్మాణం జరుగుతుందని వివరించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ద్వారా టాయిలెట్లలోని మురుగునీరు బయటకు వెళ్తుంది, సీనరేజి ట్రీట్మెంట్ ప్లాంట్లలో ఆ మురుగునీటిని శుద్ధి చేసి బయటకు విడుదల చేస్తారు, వర్షం నీటిని ఏట్లోకి మళ్లించేందుకు ప్రత్యేకంగా డ్రైనేజీ వ్యవస్థ ఉంటుందని వివరించారు. మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకొని అభివృద్ధి పనులు చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు అభివృద్ధి పనులు జరిగితేనే మధిర పట్టణం అభివృద్ధి చెందుతుంది తద్వారా భవిష్యత్తు తరాలకు మంచి జరుగుతుందని వివరించారు.