- ఢిల్లీలో జరిగిన కీలక కాంగ్రెస్ సమావేశానికి శశి థరూర్ గైర్హాజరు
- పార్టీలో విభేదాలంటూ వచ్చిన ఊహాగానాలకు తెరదించిన థరూర్
- సమావేశానికి హాజరు కాలేనని అధిష్టానానికి ముందే సమాచారం ఇచ్చానని వెల్లడి
- కోజికోడ్‌లో సాహిత్య ఉత్సవం కారణంగానే రాలేకపోయానని స్పష్టీకరణ
- పార్టీ అంతర్గత విషయాలను బహిరంగంగా చర్చించనని తేల్చిచెప్పిన థరూర్
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఢిల్లీలో నిర్వహించిన కీలక సమావేశానికి తాను గైర్హాజరు కావడంపై వస్తున్న ఊహాగానాలకు సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ తెరదించారు. దీని వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని, సమావేశానికి హాజరు కాలేనని పార్టీ నాయకత్వానికి ముందే సమాచారం ఇచ్చానని ఆయన స్పష్టం చేశారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా శుక్రవారం ఢిల్లీలో కేరళ కాంగ్రెస్ నేతలతో పార్టీ కేంద్ర నాయకత్వం ఒక సమావేశం నిర్వహించింది. ఈ భేటీకి థరూర్ హాజరు కాకపోవడంతో పార్టీలో విభేదాలున్నాయంటూ మరోసారి మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇటీవల కొచ్చిలో రాహుల్ గాంధీ పాల్గొన్న ఒక సమావేశంలో తనకు ఎదురైన అనుభవంతో థరూర్ అసంతృప్తిగా ఉన్నారని, అందుకే ఢిల్లీ సమావేశానికి రాలేదని కథనాలు వెలువడ్డాయి. దానికి తోడు, కేరళలో ప్రధాని మోదీ పర్యటన కూడా ఉండడంతో, కాంగ్రెస్ హై లెవల్ భేటీకి థరూర్ డుమ్మా కొట్టారని వార్తలు వచ్చాయి.
ఈ ప్రచారంపై శనివారం కోజికోడ్‌లో మీడియాతో మాట్లాడుతూ థరూర్ స్పందించారు. “నేను చెప్పాలనుకున్నది పార్టీ నాయకత్వానికి చెప్పాను. పార్టీ అంతర్గత విషయాలను బహిరంగంగా చర్చించడం సరికాదు” అని అన్నారు. మీడియాలో వచ్చే వార్తల్లో కొన్ని నిజాలు, కొన్ని అబద్ధాలు ఉండవచ్చని… దేన్నీ గుడ్డిగా నమ్మవద్దని సూచించారు.
ఢిల్లీ సమావేశానికి రాలేకపోవడానికి గల కారణాన్ని వివరిస్తూ, “కోజికోడ్‌లో నా తాజా పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉంది. ఈ సాహిత్య ఉత్సవానికి హాజరు కావాల్సి ఉన్నందున ఢిల్లీ రాలేనని ముందే హైకమాండ్ కు తెలియజేశాను. గతంలో రాజకీయ కార్యక్రమాల వల్ల జైపూర్ సాహిత్య ఉత్సవాన్ని వదులుకున్నాను. ఈసారి అలా జరగకూడదనే ఇక్కడికి వచ్చాను” అని థరూర్ వివరించారు. ఈ విషయంపై సీడబ్ల్యూసీ సభ్యుడు రమేశ్ చెన్నితాల కూడా స్పందిస్తూ.. థరూర్ కేవలం రాజకీయ నాయకుడే కాదని, గొప్ప సాహిత్యవేత్త అని, ఈ విషయాన్ని ఆ కోణంలోనే చూడాలని అన్నారు.
కాంగ్రెస్ నియమావళిని ఉల్లంఘించలేదు.. ఆ విషయంలోనే పార్టీతో విభేదాలు: శశిథరూర్
తాను ఎన్నడూ కాంగ్రెస్ పార్టీ నియమావళిని ఉల్లంఘించలేదని, ఆపరేషన్ సిందూర్ విషయంలోనే తనకు పార్టీతో విభేదాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ పేర్కొన్నారు. కేరళ సాహిత్య ఉత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, దేశ భద్రత విషయంలో మనకు మన దేశమే ప్రాధాన్యమని స్పష్టం చేశారు. పార్లమెంటులో తాను ఎల్లప్పుడూ పార్టీ నియమావళికి అనుగుణంగానే వ్యవహరించానని ఆయన నొక్కి చెప్పారు.
పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్థాన్‌ను ఎండగట్టేందుకు విదేశాలకు వెళ్లిన దౌత్య బృందాల్లో శశిథరూర్ కూడా ఉన్నారు. ఆ సమయంలో ఆయన వ్యవహారశైలిపై కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల నుంచి విమర్శలు వచ్చాయి. ఆయన తీరు పట్ల పార్టీ అధిష్ఠానం అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ విషయంపై ఆయన తాజాగా స్పందిస్తూ, ఆపరేషన్ సిందూర్ విషయంలో తన వైఖరిని సమర్థించుకున్నారు. ఈ విషయంలో తాను ఎప్పటికీ క్షమాపణ చెప్పేది లేదని ఆయన తేల్చి చెప్పారు.
ఒక రచయితగా పహల్గామ్ గురించి ఒక కథనం రాశానని, ఉగ్రదాడులకు తగినవిధంగా సైనిక ప్రతిస్పందన ఉండాలని తాను అభిప్రాయపడ్డానని అన్నారు. అభివృద్ధిపై దృష్టి సారించిన భారత్… పాకిస్థాన్‌తో దీర్ఘకాల ఘర్షణలకు వెళ్లకుండా ఉగ్రశిబిరాలను లక్ష్యంగా చేసుకోవాలని తాను రాసినట్లు తెలిపారు. ఆ కథనంలో తాను చెప్పినట్లుగానే కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం ఆశ్చర్యం కలిగించిందని ఆయన అన్నారు.