- రెబల్ అభ్యర్థిగా వేసిన నామినేషన్ ఉపసంహరణ
- బుజ్జగించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
- సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలకే ప్రాధాన్యం
- ఊపిరి పీల్చుకున్న కాంగ్రెస్ నేతలు
జనగామ మునిసిపల్ రాజకీయం ఒక్కసారిగా మలుపు తిరిగింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బావమరిది పెద్ది నవీన్ కుమార్ గౌడ్ పోటీ నుంచి తప్పుకున్నారు. 6వ వార్డు నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన రెబల్‌గా నామినేషన్ వేసి కలకలం రేపారు. అయితే, పార్టీ అధిష్ఠానం జోక్యంతో మంగళవారం తన నామినేషన్ ను వెనక్కి తీసుకున్నారు.
నవీన్‌గౌడ్ తిరుగుబాటు అంశం టీపీసీసీ దృష్టికి వెళ్లడంతో ఆయనను బుజ్జగించే బాధ్యతను హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డికి అప్పగించింది. వెంటనే రంగంలోకి దిగిన నాయిని జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి నివాసంలో నవీన్‌గౌడ్‌తో చర్చలు జరిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మామ పెద్ది వెంకటనారాయణగౌడ్‌తో కూడా ఫోన్లో మాట్లాడి పార్టీ ప్రయోజనాల దృష్ట్యా సహకరించాలని కోరారు.
చర్చల అనంతరం నవీన్‌గౌడ్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తండ్రి వెంకటనారాయణగౌడ్ మాట్లాడుతూ.. పార్టీలో తిరుగుబాటు అభ్యర్థులు ఉండకూడదన్న సీఎం రేవంత్ రెడ్డి సూచనను గౌరవించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. మంత్రి బావమరిది పోటీ నుంచి తప్పుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.
ఫిబ్రవరి 11న జరగనున్న మునిసిపల్ ఎన్నికల కోసం నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో, నేడు తుది అభ్యర్థుల జాబితాను అధికారులు విడుదల చేయనున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: