జాతీయ రాజకీయ వార్తలు

ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల్లో బాలీవుడ్ తారల సందడి… మోహన్ భగవత్‌పై ప్రశంసలు

  • ముంబైలో జరిగిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలకు పలువురు బాలీవుడ్ ప్రముఖుల హాజరు
  • మోహన్ భగవత్ ప్రసంగం స్ఫూర్తిదాయకంగా ఉందని కితాబు
  • భగవత్ ఆలోచనలు, నిబద్ధతను మెచ్చుకున్న కరణ్ జొహార్, శిల్పాశెట్టి, విక్కీ కౌశల్
  • ఆర్ఎస్ఎస్‌పై ఉన్న అపోహలను భగవత్ ప్రసంగం తొలగించిందన్న‌ మధుర్ భండార్కర్
  • దేశ నిర్మాణంలో సంస్థ పాత్రను కొనియాడిన సినీ ప్రముఖులు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ముంబైలో నిర్వహించిన కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. సంస్థ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగాన్ని విన్న తర్వాత, ఆయన ఆలోచనలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని, సంస్థ ప్రయాణం ప్రశంసనీయమని వారు కొనియాడారు. ఈ కార్యక్రమం చాలా విషయాలపై తమకు అవగాహన కల్పించిందని అభిప్రాయపడ్డారు.

ఈ వేడుకకు హాజరైన ప్రముఖ ఫిల్మ్ డైరెక్టర్ కరణ్ జొహార్ మాట్లాడుతూ… “ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మోహన్ భగవత్ గారి ఆలోచనలు వినడం ఎంతో స్ఫూర్తినిచ్చింది. బాలీవుడ్ ప్రముఖులకు ఇంత సమయం కేటాయించినందుకు ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయనలో మంచి హాస్య చతురత కూడా ఉంది. మేమంతా ఎంతో సరదాగా గడిపాం” అని అన్నారు.

నటి శిల్పాశెట్టి మాట్లాడుతూ, తాను మోహన్ భగవత్‌కు పెద్ద అభిమానినని చెప్పారు. “దేశం కోసం పనిచేయడంలో ఆయనకున్న పట్టుదల, నిబద్ధతను నేను ఎంతగానో ఆరాధిస్తాను. ఈ రోజు చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన మాటలు నాలో సంకల్పాన్ని మరింత బలపరిచాయి” అని ఆమె పేర్కొన్నారు. 

నటుడు విక్కీ కౌశల్ కూడా తన ఆనందాన్ని పంచుకున్నారు. “ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ముందుగా నా అభినందనలు. ఈ రోజు మోహన్ జీ ప్రసంగాన్ని వినే అవకాశం లభించింది. ఆయన్ను ప్రత్యక్షంగా చూడటం, ఆయన ప్రసంగం వినడం ఇదే మొదటిసారి. ఆయన మాటలు నన్ను చాలా ఆకట్టుకున్నాయి. చాలా ఆచరణాత్మకంగా, అర్థవంతంగా మాట్లాడారు” అని తెలిపారు.

రెండు రోజుల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫిల్మ్‌మేకర్ మధుర్ భండార్కర్ మాట్లాడుతూ, ఆర్ఎస్ఎస్ పాత్రపై ఉన్న అపోహలను భగవత్ ప్రసంగం నివృత్తి చేసిందన్నారు. “మోహన్ భగవత్ ప్రసంగం ఎంతో విజ్ఞానాన్ని అందించింది. దేశంలో ఆర్ఎస్ఎస్‌పై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. వాటన్నింటికీ ఆయన స్పష్టతనిచ్చారు. దేశభక్తి, సంస్కృతి, మన వారసత్వంపై చర్చ జరిగింది. ఇది ఎంతో సమాచారపూర్వకంగా ఉంది” అని వివరించారు.

గాయకుడు, స్వరకర్త ప్రీతమ్ చక్రవర్తి ఈ కార్యక్రమం తమకు ఎన్నో కొత్త విషయాలను నేర్పిందని చెప్పారు. నటుడు రవి దూబే కూడా వందేళ్ల ప్రస్థానంలో దేశ నిర్మాణానికి, భారతదేశాన్ని ప్రపంచ శక్తిగా నిలబెట్టడానికి ఆర్ఎస్ఎస్ చేసిన కృషిని అభినందించారు. దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ తన శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ, తన సిద్ధాంతాలు, సామాజిక కార్యక్రమాలు, దేశ నిర్మాణంలో తన పాత్రను ప్రజలకు వివరిస్తోంది.

Related posts

ఎమ్మెల్యేలకు 2 కోట్లు… మాజీనైన నాకు 20 కోట్లు.. శివసేన నేత సంచలన వ్యాఖ్యలు!

Ram Narayana

డీఎంకే అవినీతి అక్రమాలపై ప్రజలు తిరగబడతారు …డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి

Ram Narayana

తమిళిసై, అన్నామలైతో కలిసి చెన్నైలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్డు షో

Ram Narayana