ఖమ్మం వార్తలు

మంత్రి పొంగులేటి కోపం వచ్చింది …

మంత్రి పొంగులేటి ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ … “రాజకీయాల ముసుగులో అరాచకాలు చేస్తామన్నా… ఫోన్లలో బెదిరింపులకు దిగినా సహించేది లేదు. 11వ తేదీ ఎన్నికలు ముగియనివ్వండి.. హద్దులు దాటిన ప్రతి ఒక్కరి లెక్క తేలుస్తా. చందాలు, దందాలు చేస్తే కింద పడుద్ది జాగ్రత్త! తింగరి వేషాలు వేస్తే ఊరుకోం.. చట్టప్రకారం మీ అందరినీ బొక్కలో వేయించడం ఖాయం” అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రత్యర్థులను హెచ్చరించారు. ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార ముగింపు సందర్భంగా వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద సోమవారం నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు.

దందాలకు కాలం చెల్లింది..
​ప్రచార పర్వంలో ప్రత్యర్థుల తీరుపై మంత్రి నిప్పులు చెరిగారు. “ఎవరైనా కారుకూతలు కూస్తే చట్టరీత్యా ఉక్కుపాదం మోపుతాం. మీ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడరు. మీ దందాలకు, దౌర్జన్యాలకు ప్రజలు ఈ ఎన్నికలతో ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలి.. అశాంతి సృష్టించాలని చూస్తే ఉక్కుపాదం మోపుతాం” అని స్పష్టం చేశారు.

అధికారం లేని మీరు అభివృద్ధి ఎలా చేస్తారు?
రంగురంగుల కండువాలు వేసుకుని వస్తున్న నాయకులను మంత్రి సూటిగా నిలదీశారు. “అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వ సాయం ఉండాలి. అధికారంలో ఉన్న మేమే పనులు చేయగలం. ఏ అధికారం ఉందని మీరు మేలు చేస్తామంటూ ప్రజల వద్దకు వస్తున్నారు? పదేళ్లు అధికారంలో ఉన్న ఆ ‘దొర’లకు పేదలకు ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం లేదు” అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే కొత్త రేషన్ కార్డులు, హాస్టల్ విద్యార్థులకు డైట్ చార్జీల పెంపు వంటి ఎన్నో సంక్షేమ ఫలాలను అందించామని గుర్తుచేశారు.

సభ అనంతరం వరంగల్ క్రాస్ రోడ్డు నుంచి నాయుడు పేట సర్కిల్ వరకు వేలాది మందితో జరిగిన భారీ ర్యాలీలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

Related posts

మరణంలోనూ వీడని ఏడడుగుల బంధం.. ఖమ్మంలో వృద్ధ దంపతుల మృతి

Ram Narayana

ఈనెల 5 న బుగ్గపాడు కు ఐదుగురు మంత్రులు ..

Ram Narayana

కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు…ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Ram Narayana