Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

మళ్ళీ ప్రపంచవ్యాపితంగా కరోనా విజృంభణ …..

మళ్ళీ ప్రపంచవ్యాపితంగా కరోనా విజృంభణ …..
-అమెరికా ,చైనాలలో సైతం పెరుగుతున్న కరోనా కేసులు
-భారత్ కు విమానాలు రద్దు చేసిన ఇతిహాద్ ఎయిర్ లైన్స్
-దేశంలోని పెరుగుతున్న కేసులు
-కేరళలో మరోసారి లాక్ డౌన్

మరోసారి ప్రపంచవ్యాపితంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా , సోషలిస్టు దేశం చైనా , సంపన్నులు ఉండే యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ లలో కేసుల సంఖ్య పెరగటం ఆందోళన కరం .అన్ని రకాల సౌకర్యాలు , వైద్యం అందుబాటులు ఉందని ఇప్పటివరకు చంకలు గుద్దుకున్న దేశాలు సైతం కరోనా తో కకావికలం అవుతున్నాయి. అమెరికాలో మాస్క్ ల నిషేధాన్ని ఎత్తివేయడం ప్రజలకు విచ్చలవిడిగా తిరిగే స్వేచ్ఛనివ్వడంతో కరోనా విజృంభించినట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో తిరిగి మాస్క్ లు పెట్టుకోవాలని ఆదేశాలు జారీచేసింది. నిన్న ఒక్క రోజులోనే 8 లక్షల మందికి అమెరికాలో పరీక్షలు చేయగా , 70 వేలమందికి పైగా కరోనా లక్షణాలు కనిపించాయి. చైనా లోని నాంజింగ్ నగరంలో డెల్టా 200 కేసులు నమోదు కావడంతో అక్కడ ప్రభుత్వం అప్రమత్తమైంది.

అమెరికాలో నిన్న ఒక్క రోజులోనే 70,740 కేసులు

 

అమెరికాలో సగం మందికి ఇప్పటికే వ్యాక్సిన్ వేసేశారు. చాలా మంది రెండు డోసులూ తీసుకున్నారు. మాస్క్ నిబంధనలనూ ఎత్తేశారు. భౌతిక దూరమూ వద్దన్నారు. కానీ, అమెరికాలో ఇప్పుడు కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. రికార్డు స్థాయిలో రోజువారీ కేసులు నమోదవుతున్నాయి.

నిన్న ఒక్కరోజే దేశంలో 8.07 లక్షల టెస్టులు చేస్తే, 70,740 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే కేసులు 5.94% పెరిగాయి. ప్రపంచంలోనే రోజువారీ కేసుల్లో అమెరికా మళ్లీ మొదటి స్థానంలో ఉంది. ఇండోనేసియాలో 45,203, బ్రెజిల్ లో 41,411 కేసులు నమోదైనట్టు అమెరికాలో రోజువారీ కరోనా కేసుల వివరాలను వెల్లడిస్తున్న జాన్స్ హాప్కిన్స్ యూనివర్సటీ పేర్కొంది.

అయితే, వ్యాక్సినేషన్ ఎక్కువగా జరగని ప్రాంతాల్లోనే కేసులు పెరుగుతున్నాయని అక్కడి అధికారులు చెబుతున్నారు. అమెరికాలో ఇప్పటిదాకా 3,54,87,490 మంది కరోనా బారిన పడగా.. 6,28,098 మంది చనిపోయారు. కాగా, నిన్న 3,95,489 వ్యాక్సిన్ డోసులు వేశారు. మొత్తంగా 16.33 కోట్ల మందికి పూర్తిగా టీకాలేశారు.

చైనాలో డెల్టా వేరియంట్ కేసుల కలకలం

 

కరోనా వైరస్ పుట్టినిల్లయిన చైనాలో ఇప్పుడు డెల్టా వేరియంట్ ఉనికి వెల్లడైంది. అనేక నగరాల్లో డెల్టా వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. ఒక్క నాన్ జింగ్ నగరంలోనే 200 వరకు పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కొన్నిరోజుల కిందట నాన్ జింగ్ ఎయిర్ పోర్టులో 9 మంది పారిశుద్ధ్య కార్మికులకు కరోనా సోకింది. దాంతో వారి సంబంధీకులకు, వారు కలిసిన వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో 200 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ కాగా, అవన్నీ డెల్టా వేరియంట్ కేసులేనని అధికారులు వెల్లడించారు. దీంతో కరోనా కట్టడి చర్యలు ముమ్మరం చేశారు.

కరోనా నివారణకు సొంతంగా వ్యాక్సిన్లు అభివృద్ధి చేసిన చైనా, వాటిని ప్రజలకు యుద్ధప్రాతిపదికన అందించింది. అయితే డెల్టా వేరియంట్ కేసులు వెల్లడి అవుతున్న నేపథ్యంలో, ఆ టీకాలు సరైన రక్షణ కనబర్చలేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఇండియా నుంచి ఇతిహాద్ విమానాలు రద్దు

 

ఇండియా నుంచి యూఏఈకి వచ్చే విమాన సర్వీసులను ఆపేస్తున్నట్టు ఎతిహాద్ ఎయిర్ లైన్స్ ప్రకటించింది. కరోనా నేపథ్యంలో భారత్ నుంచి యూఏఈకి విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్టు యూఏఈ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో… ఎతిహాద్ ఎయిర్ లైన్స్ అధికార ప్రతినిధి ఈ ప్రకటన చేశారు.

యూఏఈ ప్రభుత్వ సూచనల మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తాము తదుపరి ప్రకటనను వెలువరించేంత వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని అన్నారు. అయితే యూఏఈ జాతీయులు, రాయబార కార్యాలయ ఉద్యోగులు, గోల్డెన్ రెసిడెంట్ హోల్డర్లకు మాత్రం నిషేధం నుంచి మినహాయింపు ఉంటుందని చెప్పారు.

అయితే యూఏఈ నుంచి ఇండియాకు ప్యాసింజర్ ఫ్లైట్లను తాము నడుపుతామని ఎతిహాద్ ప్రకటించింది. సరకు రవాణా విమానాలు మాత్రం రెండు వైపులా ప్రయాణిస్తాయని చెప్పింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది. ఈ నిషేధం తాత్కాలికమేనని చెప్పింది.

భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి …కేరళలో అధికం

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. ప‌లు రాష్ట్రాల్లో క‌రోనా తీవ్ర‌త అధికంగా ఉంది. కేర‌ళలో ప్ర‌తిరోజు 20 వేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌వుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. దీంతో ఆ రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

జులై 31, ఆగ‌స్టు 1 తేదీల్లో లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు వివ‌రించింది. క‌రోనా కేసుల తీవ్రత దృష్ట్యా లాక్‌డౌన్ పొడిగింపు లేదా పాక్షికంగా ఆంక్ష‌ల విధింపుపై మ‌ళ్లీ నిర్ణ‌యం తీసుకోనున్నారు. గత కొన్ని రోజులుగా కేర‌ళ‌లో ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందకుపైగా మ‌ర‌ణాలు నమోదవుతున్నాయి. మంగళవారం నుంచి 20 వేలకు పైగా కేసులు న‌మోదవుతున్నాయి. దీంతో కేర‌ళ స‌ర్కారు లాక్‌డౌన్ విధించాల‌ని ఈ రోజు నిర్ణ‌యం తీసుకుంది.

మ‌రోవైపు, కేర‌ళ‌లో క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం వైద్య బృందాన్ని పంపాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. జాతీయ అంటు వ్యాధుల నియంత్ర‌ణ సంస్థ డైరెక్ట‌ర్ నేతృత్వంలోని ఆరుగురు స‌భ్యుల వైద్య‌ బృందం ఆ రాష్ట్రానికి త్వ‌ర‌లోనే చేరుకుంటుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. క‌రోనాపై పోరులో కేర‌ళ ప్ర‌భుత్వానికి ఈ బృందం స‌హాయ‌ప‌డ‌నుంది.

Related posts

కొవిడ్ ఒక్కటే కాదు.. ఇతర ఇన్ఫెక్షన్లూ వేధిస్తాయి జాగ్రత్త: డబ్ల్యూహెచ్ఓ…

Drukpadam

ఓమిక్రాన్ కు ఆనందయ్య మందు …?

Drukpadam

కోవిడ్‌పై శ్వేతపత్రం విడుదల చేసిన రాహుల్ గాంధీ!!

Drukpadam

Leave a Comment