- ఓం బిర్లాపై లోక్ సభ సెక్రటరీ జనరల్‌కు నోటీసు
- రాజ్యాంగంలోని ఆర్టికల్ 94-సీ ప్రకారం ఈ నోటీసు ఇచ్చినట్లు వెల్లడి
- ప్రతిపక్ష ఎంపీలను స్పీకర్ పదేపదే అడ్డుకున్నారని ఆరోపణ
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. ఓం బిర్లాను స్పీకర్ పదవి నుంచి తొలగించేలా తీర్మానం ప్రవేశపెట్టేందుకు లోక్ సభ సెక్రటరీ జనరల్‌కు ఈ నోటీసు ఇచ్చింది.
రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మాట్లాడేందుకు విపక్ష నేత రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వకపోవడం, ఎనిమిది మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడం, కాంగ్రెస్ మహిళా ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేసినప్పటికీ బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబేపై చర్యలు చేపట్టకపోవడం వంటి కారణాలతో విపక్షాలు అవిశ్వాస డిమాండ్‌ను తెరపైకి తెచ్చాయి.
అవిశ్వాస తీర్మానం కోసం నోటీసు ఇచ్చిన అనంతరం కాంగ్రెస్ నేత గౌరవ్ గొగొయ్ మాట్లాడుతూ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 94-సీ ప్రకారం ఈ నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. దీనిపై కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీ, డీఎంకేతో సహా పలు పార్టీలకు చెందిన 120 మంది ఎంపీలు సంతకాలు చేశారని అన్నారు. ప్రతిపక్ష ఎంపీలు ప్రజాప్రయోజన అంశాలు లేవనెత్తకుండా స్పీకర్ పదేపదే అడ్డుకోవడం తమను తీవ్రంగా బాధించిందని అన్నారు.
పలు సందర్భాలలో విపక్ష నేతలను మాట్లాడటానికి అనుమతించడం లేదని అన్నారు. అది వారి ప్రాథమిక హక్కు అని గుర్తు చేశారు. ఎనిమిది మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారని ఆరోపించారు. విపక్ష ఎంపీలు రాజ్యాంగపరమైన హక్కులను వినియోగించుకున్నందుకు శిక్షకు గురయ్యారని అన్నారు.
అవిశ్వాసం తేలేదాకా కుర్చీ ఎక్కను.. స్పీకర్ ఓం బిర్లా సంచలన నిర్ణయం!

- ఈ విషయం తేలేదాకా విధులకు దూరంగా ఉంటానన్న ఓం బిర్లా
- ఇది తన నైతిక బాధ్యత అని, చర్చ జరగాల్సిందేనని స్పష్టం చేసిన స్పీకర్
- మార్చి 9న అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే అవకాశం
లోక్‌సభలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తనపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగి, పరిష్కారం లభించేంత వరకు స్పీకర్ స్థానంలో కూర్చోకూడదని ఓం బిర్లా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇది తన నైతిక బాధ్యత అని, స్పీకర్ స్థానంపై సందేహాలు వ్యక్తమైనప్పుడు తక్షణం చర్చ జరగాలనే సందేశం ఇవ్వడానికే ఓం బిర్లా ఈ నిర్ణయం తీసుకున్నట్లు లోక్‌సభ సచివాలయ వర్గాలు వెల్లడించాయి.
మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ సహా ఇతర విపక్షాలు ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చాయి. స్పీకర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, ఇటీవల 8 మంది ఎంపీలను సస్పెండ్ చేశారని ఆరోపిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 94(c) కింద ఈ నోటీసును సమర్పించాయి. దీనిపై సుమారు 120 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేశారు.
ఈ నేపథ్యంలోనే ఓం బిర్లా ఈ నిర్ణయం తీసుకున్నారు. తన అభిప్రాయాన్ని మంగళవారం వివిధ పార్టీల నేతలకు, ప్రతిపక్ష నాయకులకు కూడా తెలియజేశారు. ప్రభుత్వం గానీ, ప్రతిపక్షాలు గానీ కోరినా తాను తన నిర్ణయాన్ని మార్చుకోబోనని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.
ఈ అవిశ్వాస తీర్మానంపై చర్చ బడ్జెట్ సమావేశాల రెండో భాగం తొలి రోజైన మార్చి 9న జరిగే అవకాశం ఉంది. అప్పటివరకు ఓం బిర్లా స్పీకర్ సీటుకు దూరంగా ఉండనున్నారు. పార్లమెంటరీ చరిత్రలో స్పీకర్‌పై పెట్టిన అవిశ్వాసం ఎప్పుడూ నెగ్గనప్పటికీ, తాజా పరిణామంతో బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.