- ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్‌లో 13వ సార్వత్రిక ఎన్నికలు
- ఎంపీల ఎన్నికతో పాటు ‘జూలై చార్టర్’పై రిఫరెండం
- ప్రధాని పదవికి కాలపరిమితి వంటి కీలక సంస్కరణల ప్రతిపాదన
- రిఫరెండంలో నెగ్గితే రాజ్యాంగ సవరణలకు 270 రోజుల గడువు
- గత ఏడాది షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయాక ఈ సంస్కరణల రూపకల్పన
బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఎన్నికలకు రంగం సిద్ధమైంది. దేశ 13వ సార్వత్రిక ఎన్నికలు ఫిబ్రవరి 12న జరగనుండగా, కొత్త ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని ఎన్నుకునేందుకు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఒక ప్రత్యేకత ఉంది. ఓటర్లకు రెండు బ్యాలెట్ పత్రాలు అందజేయనున్నారు. ఒకటి పార్లమెంట్ సభ్యులను ఎన్నుకోవడానికి కాగా, రెండోది “జూలై నేషనల్ చార్టర్ 2025″పై నిర్వహించే రిఫరెండం (ప్రజాభిప్రాయ సేకరణ) కోసం.
2024లో జరిగిన ప్రజా ఉద్యమం ఫలితంగా షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దేశంలో ప్రజాస్వామ్య పాలనను వ్యవస్థీకృతం చేసేందుకు, అధికార కేంద్రీకరణను నివారించేందుకు కొన్ని సంస్కరణలతో కూడిన “జూలై చార్టర్”ను రూపొందించారు. ఢాకా ట్రిబ్యూన్ కథనం ప్రకారం, ఈ చార్టర్ అమలుపై ప్రజలు ‘అవును’ లేదా ‘కాదు’ అని ఓటు వేయాల్సి ఉంటుంది.
ఈ చార్టర్‌లో మొత్తం 84 ప్రతిపాదనలు ఉన్నాయి. వీటిలో ప్రధానమంత్రి పదవికి కాలపరిమితి విధించడం, ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టడం, న్యాయవ్యవస్థకు మరింత స్వాతంత్ర్యం కల్పించడం వంటి కీలక అంశాలున్నాయి. వీటిలో 47 ప్రతిపాదనలకు రాజ్యాంగ సవరణలు అవసరమని, మిగిలిన 37 ప్రతిపాదనలను చట్టాలు లేదా కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా అమలు చేయవచ్చని బంగ్లాదేశ్ బిజినెస్ స్టాండర్డ్ నివేదించింది.
రిఫరెండంలో ప్రజలు ‘అవును’ అని తీర్పు ఇస్తే, కొత్తగా ఏర్పడే పార్లమెంట్ ‘రాజ్యాంగ సంస్కరణల మండలి’గా కూడా పనిచేస్తుంది. 270 రోజుల్లో (9 నెలలు) అవసరమైన రాజ్యాంగ సవరణలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ గడువులోగా మండలి విఫలమైతే, మధ్యంతర ప్రభుత్వం రూపొందించిన సవరణ బిల్లు దానంతట అదే ఆమోదం పొందినట్లు పరిగణిస్తారు. రాజ్యాంగంలో రిఫరెండం గురించి స్పష్టంగా లేనప్పటికీ, నిషేధం కూడా లేదని, ప్రజాభిప్రాయంతో సంస్కరణలకు చట్టబద్ధత కల్పించడం ఉత్తమ మార్గమని ‘ది డైలీ స్టార్’ పత్రిక తన కథనంలో అభిప్రాయపడింది.