తెలంగాణ వార్తలు

సామాజిక కార్యకర్తలను సన్మానించిన సీనియర్ నటుడు అర్జున్…

  • ‘సీతాపయనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముగ్గురు సామాజిక కార్యకర్తలను సన్మానించిన సీనియర్ నటుడు అర్జున్ సర్జా
  • డాక్టర్ ప్రకాశ్ ఆమ్టే, ట్యాంక్‌బండ్ శివ, దుశ్చర్ల సత్యనారాయణలను సత్కరించి, రూ.లక్ష చొప్పున నగదు కానుకగా అందజేత
  •  ‘రియల్ హీరోలు వీరే’ అంటూ కొనియాడిన అర్జున్

ప్రముఖ నటుడు అర్జున్ సర్జా మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘సీతాపయనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముగ్గురు సామాజిక కార్యకర్తలను ప్రత్యేకంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. డాక్టర్ ప్రకాశ్ ఆమ్టే, ట్యాంక్‌బండ్ శివ, దుశ్చర్ల సత్యనారాయణలను శాలువాతో సత్కరించి, ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున నగదు కానుకగా అందించారు. వారి సేవలను ప్రశంసిస్తూ ‘రియల్ హీరోలు వీరే’ అంటూ కొనియాడారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

సత్కారాలు పొందిన సామాజిక సేవా కార్యకర్తల విషయానికి వస్తే .. మహారాష్ట్రకు చెందిన డాక్టర్ ప్రకాశ్ ఆమ్టే తన తండ్రి బాబా ఆమ్టే వారసత్వాన్ని కొనసాగిస్తూ ‘లోక్ బిరాదరి ప్రకల్ప్’ సంస్థకు తన జీవితాన్ని అంకితమిచ్చారు. గిరిజనులకు నిస్వార్థ సేవలందించడంతో పాటు గాయపడిన, నిరాశ్రయమైన వన్యప్రాణుల సంరక్షణ, పునరావాస కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2002లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 

ఇక సూర్యాపేటకు చెందిన దుశ్చర్ల సత్యనారాయణ ప్రకృతి ప్రేమికుడిగా గుర్తింపు పొందారు. మనిషి సంకల్పం ఉంటే అడవినే సృష్టించవచ్చని నిరూపించిన వ్యక్తిగా నిలిచారు. వారసత్వంగా వచ్చిన 70 ఎకరాల భూమిని మహారణ్యంగా మార్చి, దాదాపు 5 కోట్ల మొక్కలు నాటిన ఘనత ఆయనది. 

ట్యాంక్‌బండ్ శివ కూడా అసాధారణ సేవలతో గుర్తింపు తెచ్చుకున్నారు. చిన్న వయసులోనే హుస్సేన్ సాగర్‌లో పడిపోయిన వ్యక్తిని కాపాడిన ఆయన.. ఆ తర్వాత నుంచి వందలాది మందిని ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించారు. అలాగే వేలాది మృతదేహాలను సాహసోపేతంగా బయటకు తీసి కుటుంబాలకు చేరవేశారు. తనకు చేతనైనంత సాయం చేస్తూ మానవత్వానికి ప్రతీకగా నిలుస్తున్నారు.

Related posts

అంబర్ పేట ర్యాలీలో కిందపడిన వీహెచ్..

Ram Narayana

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. కేసీఆర్ కు గవర్నర్, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవులు: రేవంత్ రెడ్డి

Ram Narayana

పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ram Narayana