సత్యాగ్రహ దీక్షకు దిగిన కోదండరాం
-పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపునకు నిరసన
-ప్రభుత్వాలు పన్నులు తగ్గిస్తేనే ధరలు తగ్గుతాయని వ్యాఖ్య
-ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం
హైదరాబాద్ లో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా ఆయన ఈ దీక్షకు దిగారు. ధరల పెరుగుదలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గిస్తేనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గుతాయని చెప్పారు.
అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగాయని చెబుతూ, ధరల పెరుగుదల విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వాలు చెబుతున్న అసత్యాలను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించలేకపోతే రాజీనామా చేయాలని ఆయన మంత్రులను డిమాండ్ చేశారు. తాము ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలకు ధరల పెరుగుదలపై వాస్తవాలు వివరిస్తామని చెప్పారు.