తెలంగాణ రాజకీయ వార్తలు ..

పురపోరు …ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ దే జోరు …

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు… ఎగ్జిట్ పోల్స్ ఇవిగో!

  • తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ విజయం అంచనా
  • దాదాపు 70 నుంచి 85 మున్సిపాలిటీలు గెలుచుకోనున్న అధికార పార్టీ
  • బీఆర్ఎస్, బీజేపీలు చాలా వెనుకబడి ఉన్నాయని తేల్చిన సర్వేలు
  • నిజామాబాద్, కరీంనగర్‌లలో బీజేపీకి, మిగిలిన కార్పొరేషన్లలో కాంగ్రెస్‌కు ఆధిక్యం
  • ఫిబ్రవరి 13న వెలువడనున్న అధికారిక ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ

తెలంగాణలో బుధవారం ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించనుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఈ ఎన్నికల పోలింగ్ అనంతరం విడుదలైన సర్వేలన్నీ కాంగ్రెస్‌కే పట్టం కట్టాయి. ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు ఓటర్లను ఆకట్టుకోవడంలో విఫలమైనట్లు ఈ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.

వివిధ సర్వే సంస్థల అంచనాలను పరిశీలిస్తే, కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ దిశగా పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్ 68 నుంచి 76 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటుందని వెల్లడించగా, బీకాన్ సర్వే ఏకంగా 80-85 పీఠాలు గెలుచుకుంటుందని పేర్కొంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ 8 నుంచి 36 స్థానాలకు, బీజేపీ 3 నుంచి 6 స్థానాలకు పరిమితం కావచ్చని ఈ సర్వేలు అంచనా వేశాయి.

వార్డుల వారీగా చూస్తే, ఆపరేషన్ చాణక్య సర్వే మరింత లోతైన విశ్లేషణ అందించింది. మొత్తం మున్సిపల్ వార్డుల్లో కాంగ్రెస్‌కు 1400-1449 వార్డులు (48% ఓట్లు), బీఆర్ఎస్‌కు 745-793 వార్డులు (26% ఓట్లు), బీజేపీకి 358-399 వార్డులు (13% ఓట్లు) దక్కే అవకాశం ఉందని తెలిపింది. ఆశ్చర్యకరంగా జనసేన పార్టీ 30-35 వార్డులు గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొనడం గమనార్హం.

ఇక 7 మున్సిపల్ కార్పొరేషన్లలోనూ కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో బీజేపీ ఆధిక్యం ప్రదర్శించవచ్చని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. మహబూబ్‌నగర్, మంచిర్యాల, రామగుండం, నల్గొండ కార్పొరేషన్లలో కాంగ్రెస్ ఏకపక్ష విజయం సాధిస్తుందని తెలిపింది. కొత్తగూడెంలో కాంగ్రెస్‌కు, సీపీఐకి మధ్య గట్టిపోటీ ఉండగా, బీఆర్ఎస్ మూడో స్థానానికే పరిమితం కావచ్చని సర్వేలు చెబుతున్నాయి. సామాజిక వర్గాల వారీగా ఎస్సీ, ముస్లిం మైనారిటీ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

మొత్తం మీద, ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే తెలంగాణ పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ తన పట్టును మరింత బలోపేతం చేసుకున్నట్లే. అయితే ఇవి కేవలం అంచనాలు మాత్రమేనని, అసలు ఫలితాలు ఫిబ్రవరి 13న జరిగే ఓట్ల లెక్కింపు తర్వాతే వెల్లడవుతాయి. ఈ ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్… ఎల్లుండి కౌంటింగ్

Telangana Municipal Elections Polling Ends Counting on 13th
  • రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు
  • బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం
  • ఈ నెల 13న ఓట్ల లెక్కింపు

తెలంగాణలో ఉత్కంఠ నడుమ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల పరిధిలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు నిరాటంకంగా కొనసాగింది. పలుచోట్ల ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సమయం ముగిసేసరికి క్యూలైన్లలో ఉన్నవారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. ఎన్నికల ప్రక్రియ చాలావరకు ప్రశాంతంగా ముగిసినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో స్వల్ప ఉద్రిక్తతలు, ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. నగరంలోని 58వ డివిజన్‌లో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడగా, కొందరి చేతులు విరిగినట్లు సమాచారం. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యక్తిగత ఫొటోగ్రాఫర్‌కు కూడా గాయాలయ్యాయి. దొంగ ఓట్లపై ఫిర్యాదు చేస్తే తమపైనే పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తూ బీజేపీ నేతలు జిల్లా పరిషత్ కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.

ఇదే కరీంనగర్‌లోని 34వ డివిజన్, హుస్సేనీపుర ప్రాంతంలో దొంగ ఓట్ల వ్యవహారం కలకలం రేపింది. ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో అక్రమంగా ఓట్లు వేస్తున్న ఇద్దరు యువకులను స్థానికులు పట్టుకున్నారు. వారి వద్ద నకిలీ ఆధార్ కార్డులను గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై ఎంఐఎం అభ్యర్థి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆ బూత్‌లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 2569 మున్సిపల్ వార్డులు, 412 కార్పొరేషన్ వార్డులకు ప్రజలు తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. ఈ నెల 13వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 136 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. అదే రోజు మధ్యాహ్నానికల్లా ఫలితాలపై స్పష్టత రానుంది. అనంతరం, ఈ నెల 16న మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఫలితాల కోసం అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు… పోలింగ్ శాతం ఎంతంటే…!

Telangana Municipal Elections Polling Percentage Details
  • ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్
  • రాష్ట్రవ్యాప్తంగా 73.03 శాతం పోలింగ్ నమోదు
  • అత్యధికంగా చౌటుప్పల్‌లో, అత్యల్పంగా నందికొండలో ఓటింగ్
  • ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు, 14న మేయర్, చైర్‌పర్సన్ల ఎన్నిక

తెలంగాణలో పురపాలక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో బుధవారం జరిగిన ఈ ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 73.03 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

వివరాల్లోకి వెళితే, ఏడు కార్పొరేషన్ల పరిధిలో 66.05 శాతం పోలింగ్ నమోదు కాగా, 116 మున్సిపాలిటీల్లో 75.88 శాతం ఓటింగ్ జరిగింది. అత్యధికంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలో 91.91 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. అదే సమయంలో, అత్యల్పంగా నందికొండ మున్సిపాలిటీలో 59.68 శాతం పోలింగ్ నమోదైంది.

ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. అయితే, క్యూ లైన్లలో నిల్చున్న వారికి రాత్రి 7 గంటల వరకు ఓటు వేసే అవకాశం కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 8,203 పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల స్వల్ప ఘర్షణలు మినహా, పోలింగ్ ప్రక్రియ మొత్తం ప్రశాంత వాతావరణంలో సాగింది. వృద్ధులు, వికలాంగులకు పోలీసులు సహాయం అందించి ఓటు వేయించారు. పోలీసు సిబ్బంది అంకితభావంతో పనిచేశారని డీజీపీ శివధర్ రెడ్డి ప్రశంసించారు.

ఈ ఎన్నికల్లో 52 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 14న మేయర్, చైర్‌పర్సన్ల ఎన్నిక, ఫిబ్రవరి 16న వారి ప్రమాణ స్వీకారం ఉంటాయి.

Related posts

40 మంది జూబ్లీహిల్స్ కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్స్ జాబితా …

Ram Narayana

తెలంగాణ ఎన్నికలు.. కేసీ వేణుగోపాల్ తో సీపీఐ నారాయణ భేటీ

Ram Narayana

రుణమాఫీ నేపథ్యంలో రాజీనామా సవాలుపై హరీశ్ రావు కీలక ప్రకటన

Ram Narayana