- నిజామాబాద్‌లో తప్పుకుంటున్నట్లు ధర్మపురి అరవింద్ చెప్పారన్న మంత్రి
- కరీంనగర్‌లో మెజారిటీ లేకుండా పదవి ఎలా దక్కించుకుంటారని ప్రశ్న
- కార్పొరేషన్‌లలో ప్రజాస్వామ్యబద్ధంగా మేయర్‌ను ఎన్నుకుంటారన్న మంత్రి
కరీంనగర్ మేయర్ పదవిపై తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ కార్పొరేషన్‌ను కాంగ్రెస్ పార్టీయే దక్కించుకుంటుందని వ్యాఖ్యానించారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 30, కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, మజ్లిస్ మూడు, ఇతరులు 10 స్థానాలు దక్కించుకున్నారు. ఇందులో ముగ్గురు ఇప్పటికే బీజేపీలో చేరారు. మేయర్ పదవిని దక్కించుకోవడానికి 34 కౌన్సిలర్ల మద్దతు అవసరం. ఇక్కడ బండి సంజయ్ ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా ఓటు వేయవచ్చు. ఈ క్రమంలో బీజేపీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో మంత్రి మాట్లాడుతూ, నిజామాబాద్‌లో మేయర్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ధర్మపురి అరవింద్ ప్రకటించారని గుర్తు చేశారు. పూర్తి మెజారిటీ రాకపోవడంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు స్వయంగా ఎంపీ తెలిపారని అన్నారు. కరీంనగర్‌లో మెజారిటీ లేకుండానే మేయర్ పదవి దక్కించుకుంటామని బండి సంజయ్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. కార్పొరేషన్‌లలో ప్రజాస్వామ్యబద్ధంగా మేయర్‌ను ఎన్నుకుంటారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున అభివృద్ధికి సహకరిస్తామని, అందరినీ కలుపుకుని మేయర్ పీఠం దక్కించుకోవడానికి ప్రయత్నిస్తామని పొన్నం ప్రభాకర్ అన్నారు. మేయర్ పదవి దక్కించుకోవడానికి బీజేపీ ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో తామూ అదేవిధంగా చేస్తున్నామని అన్నారు. మేయర్, ఛైర్ పర్సన్ పదవుల కోసం క్యాంపు రాజకీయాలు ఉంటాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: