- శివరాత్రి పర్వదినాన జనసేనకు శుభారంభం
- పార్టీకి రూ.2 కోట్ల విరాళం ప్రకటించిన పవన్ కల్యాణ్
- పార్టీ కోసం శ్రమించే వారే తమకు ముఖ్యమని ప్రకటన
శివరాత్రి పండుగ రోజు జనసేన పార్టీకి మరో శుభారంభం అయింది. పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ స్వయంగా తొలి సభ్యత్వం తీసుకుని పార్టీకి రూ.2 కోట్ల విరాళం ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకుని, సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసే వారిని “ఉద్యమి”గా గౌరవిస్తామని తెలిపారు.
పార్టీ పోరాటానికి బలం చేకూర్చి, నవతరంలో ప్రేరణ కలిగించే వారిని “సాధక్”గా, పరోక్షంగా సమయం, ఆర్థికం, సాంకేతికం, సేవా, మేధో సహకారాలు అందించే వారిని “ప్రదాత”గా ఇకపై పిలుస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు.
జనసేన పార్టీ ప్రారంభంలో 150 మందితో మొదలైందని, 2021లో మొదటి విడత సభ్యత్వంలో 90 వేలు నమోదు అయ్యాయని పవన్ తెలిపారు. గత ఎన్నికల ముందు ఆ సంఖ్య 6 లక్షలకు చేరిందని… ఎన్నికల తర్వాత 12.98 లక్షల సభ్యత్వాలు సాధించామని ఆయన గుర్తుచేశారు. చిన్న వ్యాపారులు, కూలీలు, చదువుకున్నవారు అందరూ ఈ ప్రక్రియలో భాగస్వాములయ్యారని, పార్టీ ఆశయాలకు అనుగుణంగా నడిచేవారే ముఖ్యమని పవన్ కల్యాణ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ అధ్యక్షుల రాజకీయ కార్యదర్శి పిడుగు హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గత సభ్యత్వ నమోదులో అత్యధిక సభ్యత్వాలు చేసినవారి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
Save or share this story as a newspaper-style Epaper Clip: