తెలంగాణకు త్వరలో రాహుల్ గాంధీ: రేవంత్
-ఆగస్టు 9 న లక్షమందితో దళిత గిరిజన దండోరా
-దీనిపై రాహుల్ తో చేర్చించినట్లు వెల్లడి
-సెప్టెంబర్ లో రాష్ట్రానికి రాహుల్ రానున్నారన్న రేవంత్
-పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసిన చర్యలు ఉంటాయని హెచ్చరిక
హుజురాబాద్ అభ్యర్థి ఎంపిక భాద్యత పొన్నం, ప్రభాకర్, దామోదర రాజనరసింహ కు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సెప్టెంబర్ నెలలో తెలంగాణకు వస్తారని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్ ఇందిరాభవన్‌లో హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
సెప్టెంబర్ మొదటి వారంలో రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని రేవంత్ తెలిపారు. తేదీ, ఎక్కడ, ఎప్పుడు అనేది మనమే నిర్ణయించాలని నేతలతో అన్నారు. ఆగస్టు 9న ఇంద్రవెల్లిలో దళిత, గిరిజన దండోరా కార్యక్రమాన్ని తీసుకున్నామని చెప్పారు. దళిత దండోరా కార్యక్రమంపై రాహుల్ గాంధీతో చర్చించామని, ఆయన కూడా పాల్గొంటారని రేవంత్ తెలిపారు.
ఆగస్టు 11 నుంచి 21 వరకు పది రోజులపాటు ఐదు మండలాలు, రెండు మున్సిపాలిటీలు తీసుకుని ప్రతి రోజూ ఒక ప్రాంతంలో రెండు, మూడు వేల మందితో ర్యాలీలు నిర్వహించాలన్నారు. మండలంలో ఉన్న ఓటర్లలో 10 శాతం మంది సమావేశానికి వచ్చేలా ప్రణాళికలు చేయాలని రేవంత్ పార్టీ శ్రేణులకు సూచించారు. హుజూరాబాద్ అభ్యర్థి విషయంలో సామాజిక వర్గం, కార్యకర్తలు, పార్టీ కోసం పనిచేసే వారు కావాలని రేవంత్ చెప్పారు. అభ్యర్థి ఎంపికపై పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ కలిసి సిఫరాసు చేయాలని రేవంత్ సూచించారు. ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలన్నారు. అనుబంధ సంఘాల నాయకులతో క్షేత్రస్థాయిలో పనిచేయించాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ సూచించారు.
పార్టీకి వ్యతిరేకంగా తనతో సహా ఎవరు పనిచేసినా చర్యలుంటాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కోవద్దని హితవు పలికారు. బాధ్యతాయుతంగా పార్టీలో పనిచేస్తేనే గౌరవం పెరుగుతుందని చెప్పారు. ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో నేతలు వర్గాలుగా విడిపోయి ఘర్షణలు పడుతున్న నేపథ్యంలో రేవంత్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు.. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పని చేసినా కచ్చితంగా చర్యలుంటాయని హెచ్చరించారు. అది తానైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.