ఏపీలో పంచాయతీ ఎన్నికల కయ్యం…
నిమ్మగడ్డ…… పాలకవర్గం
బొత్స ,పెద్దిరెడ్డి , సజ్జలపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన నిమ్మగడ్డ
ఆంధ్రప్రదేశ్ లో విచిత్ర రాజకీయాలు నడుస్తున్నాయి. నిమ్మగడ్డ …. పాలకవర్గం ఎవరికీ వారు ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు .నిజంగా ఇక్కడ జరుగుతున్న రాజకీయాలు సస్పెస్ ,థ్రిల్లర్ ను తలపిస్తున్నాయి. ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం అనేదానిపై ఎవరికి తోచిన అర్థాలు వారు చెబుతున్నారు. కోర్ట్ తీర్పులు రాజ్యాంగానికి లోబడి ఉండటంతో ,అందుకనుగుణంగానే ఉంటున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఇరకాటంగా మారుతున్నాయి. ఒక రిటైర్ అయిన ఐఏఎస్ అధికారి ఎన్నికల కమిషనర్ గా ఉండటం, అదికూడా అంతకుముందు అధికారంలో ఉన్న ప్రభుత్వం నియమించటం ఆయన కాలపరిమితి ఉండటం అనేదానిపై చర్చ జరగాల్సివుంది. ఐఏఎస్ లు, జడ్జిలు , ఇతర ఉన్నతాధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తే ప్రజలకు ఇబ్బందులు తప్పవు . రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య నడుస్తున్న యుద్ధం ఎటు దారితీస్తుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి . రమేష్ కుమార్ ను చంద్రబాబునాయిడు ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ గా నియమించింది. అందుకు తగ్గట్లుగానే ఆయన జగన్ ప్రభుత్వాన్ని ఎన్నిరకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్నిరకాలుగా ఇబ్బందులు పెడుతున్నాడనే అభిప్రాయాలే ఉన్నాయి. అందువల్ల ఆయన అంటే ఇష్టం లేని జగన్ సర్కార్ ఆయన మార్చ్ లో రిటైర్ అయినా తరువాత ఎన్నికలు నిర్వహించాలని తీవ్రప్రయత్నం చేసింది . ఆప్రయత్నాలన్నీ నిమ్మగడ్డ రాజ్యాంగం , నిబంధనల ద్వారా తన నియామకాన్ని సవాల్ చేయటానికి వీలులేదని నిరూపించగలిగారు. పైగా ఒక సందర్భంలో ఆయన్ని తొలగించి ,కొత్త ఎన్నికల కమిషనర్ గా మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా రిటైర్ అయిన కానగరాజును రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం నియమించింది . అది రాజ్యాంగ బద్దం కాదని కోర్ట్ స్పష్టం చేస్తూ , తిరిగి నిమ్మగడ్డను ఎన్నికల ప్రధాన అధికారిగా నియమించాలని ఆదేశాలు జారీచేసింది . ఫలితంగా తమకు ఇష్టం లేకపోయినా ఆయన్ను ఎన్నికల అధికారిగా నియమించక తప్పలేదు. ఆయన తిరిగి వచ్చిన దగ్గరనుంచి జగన్ సర్కార్ పై కత్తి కట్టాడు . అంతకుముందు కరోనా ప్రారంభంలో జడ్పీటీసీ ,ఎంపీటీసీ లకు ఎన్నికలకోసం షడ్యూల్ విడుదలచేసి ,నామినేషన్లు స్వీకరించి కొన్ని ఏకగ్రీవాలు అయిన తరువాత కరోనా సాకుతో రాష్ట్ర ప్రభుత్వంతో , సంభందిత అధికారులతో సంప్రదించకుండా ఎన్నికలను వాయిదా వేయటంపై విమర్శలు వెల్లు ఎత్తాయి. దానితో ప్రారంభమైన యుద్ధం కొనసాగుతూనే ఉంది. జగన్ సర్కార్ కూడా అదేస్థాయిలో ఆయన్ను పనిచేయనీయకుండా అడ్డంకులు సృష్టించే చర్యలు చేపట్టింది. ఎన్నికలు ఎలాగైనా ఆపాలని చూసింది. హైకోర్టు, సుప్రీంకోర్టు ల చుట్టూ తిరిగినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తప్పలేదు. నిమ్మగడ్డ ఆధ్వర్యంలోనే ఎన్నికలు నిర్వయించుకోవాల్సి వచ్చింది . ఇద్దరి మధ్య జరుగుతున్నా గొడవలు ఎటు దారి తీస్తాయోననే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇటు పాలకపక్షం ,అటు ఎన్నికల కమిషనర్ మధ్య అధికారులు ఇబ్బంది పడుతున్నారు. నాకు విచక్షణ అధికారాలు ఉన్నాయి. నేను ఏమైనా చేస్తానని ధోరణిలో నిమ్మగడ్డ ఉన్నారు. అందుకే అధికారులకు నోటీసులు ఇస్తున్నారు. ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు. చివరకు మంత్రులు ,బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి లపై సైతం నిమ్మగడ్డ గవర్నర్ కు ఫిర్యాదు చేయటం మరింత ఆజ్యం పోసినట్లు అయింది . ఎన్నికలు సజావుగా జరిగేలా కనిపించటంలేదు. ప్రభుత్వం ఏకగ్రీవాలకు ప్రోత్సవాలు ప్రకటిస్తే ,బలవంతపు ఏకగ్రీవాలు వద్దని నిమ్మగడ్డ అంటున్నారు. జిల్లాల పర్యటనలు చేస్తున్నారు.ఒక నిఘా టీమ్ ఏర్పాటు చేయడం, ప్రత్యేక యాప్ ను తయారీ చేయడం పై వైసిపి మండిపడుతుండగా , తెలుగుదేశం సంబరపడుతుంది. బీజేపీ ,జనసేన , సిపిఐ,సిపిఎం పార్టీలు ఒకపక్క నిమ్మగడ్డను సమర్థిస్తూనే న్యాయ సూత్రాల గురించి మాట్లాడుతున్నారు. రైట్ రాయల్ గా ఉండాల్సిన రాజకీయాలు రాంగ్ ట్రాక్ పడుతున్నాయి. నిమ్మగడ్డగాని ,సర్కారుగాని వాస్తవాలను గ్రహించటంలేదు . అన్ని రాజకీయ పక్షాలు మారాల్సి ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎపి రాజకీయాలు ఎన్నికల సంఘం మధ్య జరుగుతున్నా యుద్ధం దేశానికి ఒక సందేశం మాత్రం ఇచ్చిందనటంలో ఎలాంటి సందేహం లేదు.
previous post