- మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయుల తరలింపు
- నేడు 58 ప్రత్యేక విమానాలను నడుపుతున్న ఇండియన్ క్యారియర్లు
- ఇండిగో 30, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 23 ఫ్లైట్స్ ఏర్పాటు
- టికెట్ ధరలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్న పౌర విమానయాన శాఖ
- నిర్ధారణ లేకుండా ఎయిర్‌పోర్టులకు రావొద్దని ప్రయాణికులకు సూచన
మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు భారత విమానయాన సంస్థలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. ఇవాళ ఒక్కరోజే 58 ప్రత్యేక విమానాలను నడుపుతున్నట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఇందులో ఇండిగో 30 విమానాలను, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కలిసి 23 విమానాలను నడపనున్నాయి.
పశ్చిమాసియాలోని చాలా దేశాలు తమ గగనతలాన్ని మూసివేయడం లేదా కఠిన ఆంక్షలు విధించడంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నారు. ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్ వంటి సంస్థలు దుబాయ్, ఫుజైరా వంటి నగరాల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నాయి. ఈ విమానాలు న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, కొచ్చి, అహ్మదాబాద్, తిరువనంతపురం విమానాశ్రయాలకు చేరుకోనున్నాయి.
ప్రస్తుతం దుబాయ్ గగనతలం పాక్షికంగా మాత్రమే తెరిచి ఉంది. పరిమిత సంఖ్యలో విమానాలకు అనుమతినిస్తున్నారు. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థ నుంచి నిర్ధారిత బయలుదేరే సమయం గురించి సమాచారం అందిన తర్వాతే విమానాశ్రయానికి రావాలని అధికారులు ప్రయాణికులకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు. అప్పటివరకు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం లేదా అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లవద్దని కోరారు. మరోవైపు అబుధాబి నుంచి తమ కార్యకలాపాలను గురువారం (మార్చి 5వ తేదీ) మధ్యాహ్నం 2 గంటల వరకు నిలిపివేస్తున్నట్లు ఎతిహాద్ ఎయిర్‌వేస్ ప్రకటించింది.
ప్రయాణికుల భద్రతే తమకు అత్యంత ముఖ్యమని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. రిఫండ్‌లు, రీషెడ్యూలింగ్, ఇతర సహాయక చర్యల విషయంలో ప్రయాణికులతో పారదర్శకంగా వ్యవహరించాలని అన్ని విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్లిష్ట సమయంలో విమాన టికెట్ల ధరలు అదుపు తప్పకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రయాణికులపై అనవసర భారం పడకుండా చూస్తామని మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది.