తెలంగాణ నేతన్నలకు దేశంలోనే ప్రత్యేకమైన గుర్తింపు : మంత్రి కేటీఆర్!
-ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి కొత్త కొత్త డిజైన్లు
-ప్రతిభ కనబరిచిన వారికీ అవార్డులు
-ప్రత్యేక ఎగ్జిబిషన్లు ఏర్పాటు
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి సంవత్సరం జాతీయ చేనేత దినోత్సవాన్ని తెలంగాణలో ఘనంగా జరుపుకుంటున్నాం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ నేతన్నలకు దేశంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉందని స్పష్టం చేశారు.
నగరంలోని పీపుల్స్ ప్లాజాలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరై ప్రసంగించారు. చేనేత కార్మికులకు ఉపాధి, ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నాం అని తెలిపారు. 2018 నుంచి కొండా లక్ష్మణ బాపూజీ పేరుతో అద్భుతమైన చేనేత కళాకారులను సత్కరించి, అవార్డులు అందిస్తున్నామని తెలిపారు. అవార్డుతో పాటు నగదు పురస్కారం రూ. 25 వేలను అందించడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది 31 మంది చేనేత కళాకారులను సత్కరించుకున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్ నిర్వహించి, చేనేత వస్ర్తాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఈ ప్రత్యేకమైన నైపుణ్యాన్ని దేశ ప్రజలకు తెలియజేసేందుకు ఈ -కామర్స్ ద్వారా ఈ -గోల్కొండ పోర్టల్‌ను రూపొందించుకున్నాం. వీటి ద్వారా చేనేత అమ్మకాలను విక్రయిస్తున్నాం. గత నాలుగు సంవత్సరాలుగా మన సంప్రదాయాన్ని, సమకాలీన మార్పులను దృష్టిలో ఉంచుకుని.. కొత్తకొత్త డిజైన్లతో ఈతరం, భవిష్యత్ తరం పిల్లలను ఆకట్టుకునే విధంగా డిజైన్లను రూపొందిస్తున్నాం. అలా చేయడం వల్ల పది కాలాల పాటు మనుగడ ఉంటుందనే ఉద్దేశంతో ఫ్యాషన్ షోలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
డబుల్ ఇక్కత్, ఆర్మూర్ పట్టుచీరలు, జరిచీరలు, సిద్దిపేట గొల్లభామ చీరలు తెలంగాణ సమాజంలో అందరి ముందు కదలాడుతున్నాయి. ఆధునికమైన టెక్నాలజీని జోడించి కొత్త డిజైన్లను రూపొందిస్తున్నామని తెలిపారు. కొత్త కొత్త ఆలోచనలతో వచ్చే నేత కళాకారులను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమ కోసం పెద్ద ఎత్తున బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నాం. నేతన్నకు చేయూత ద్వారా కళాకారులకు భరోసా ఇస్తున్నాం. చేనేత మిత్ర కింద నూలు, రసాయనాలు, రంగులను 50 శాతం సబ్సిడీతో కార్మికులకు అందిస్తున్నామని తెలిపారు. నవతరాన్ని ఆకట్టుకునే విధంగా చేనేతలను తీర్చిదిద్దుతున్నాం అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
చేనేత దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ
జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా చేనేత కళాకారులచే మంత్రి కేటీఆర్ ప్రతిజ్ఞ చేయించారు.
‘భారతీయ చేనేత వస్ర్తాలు.. కళానైపుణ్యానికి సాంస్కృతిక వారసత్వ సంపదకు ప్రతీకలు. మన ఈ వారసత్వ సంపదను ప్రోత్సహిస్తానని, కాపాడుతానని, ఆదరిస్తానని రాష్ర్ట ప్రభుత్వ పిలుపు మేరకు నేను చేనేత వస్త్రాలను ధరిస్తానని, అలానే నా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ధరించేటట్లు కృషి చేస్తానని జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నా కేటీఆర్ ప్రతిజ్ఞ చేయించారు.