- ప్రేమ పేరుతో వంచించి, అసభ్య వీడియోలతో డబ్బులు వసూలు
- బాధితురాలికి అబార్షన్ చేయించిన వైనం
- నిందితుడు జువైనల్ హోంకు, సహకరించిన ఇద్దరు డాక్టర్లు, నర్సు అరెస్ట్
- కొల్లాపూర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రి స్కానింగ్ సెంటర్ సీజ్
చదువుకోవాల్సిన వయసులో ఓ ఇంటర్ విద్యార్థి కామాంధుడిగా మారి ముగ్గురు బాలికల జీవితాలను ఛిన్నాభిన్నం చేశాడు. ప్రేమ పేరుతో వారిని లోబర్చుకుని, అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఆ దృశ్యాలను వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేశాడు. నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగుచూసిన ఈ దారుణ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
కొల్లాపూర్ మండలానికి చెందిన ఓ విద్యార్థి నాగర్‌కర్నూల్‌లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. తనతో పాటు చదివే పెద్దకొత్తపల్లి, నాగర్‌కర్నూల్, వనపర్తి ప్రాంతాలకు చెందిన ముగ్గురు బాలికలను ప్రేమ పేరుతో వంచించాడు. వారిపై అత్యాచారానికి పాల్పడి, ఆ దృశ్యాలను తన ఫోన్‌లో చిత్రీకరించాడు. అనంతరం ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని, వారి తల్లిదండ్రులకు పంపిస్తానని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాడు.
నిందితుడి వేధింపులు భరించలేకపోయిన బాధితురాళ్లలో ఒకరు ధైర్యం చేసి విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో వారు సదరు విద్యార్థిని పట్టుకుని దేహశుద్ధి చేసి, అతడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికరమైన నిజాలు బయటపడ్డాయి. బాధితుల్లో ఒక బాలిక గర్భం దాల్చగా, కొల్లాపూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించినట్లు నిందితుడు అంగీకరించాడు.
ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పోలీసులు, నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ చేసినందుకు సదరు ప్రైవేట్ ఆసుపత్రిలోని స్కానింగ్ సెంటర్‌ను బుధవారం సీజ్ చేశారు. గురువారం ఇద్దరు డాక్టర్లు, ఒక నర్సును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రధాన నిందితుడైన విద్యార్థిని జువైనల్ హోంకు తరలించారు.