ఇరాన్ కొత్త అధినేత కోమాలో ఉన్నారా?.. ఆరోగ్యంపై తీవ్ర సస్పెన్స్
ఇరాన్ కొత్త అధినేత కోమాలో ఉన్నారా?.. ఆరోగ్యంపై తీవ్ర సస్పెన్స్
ఇరాక్‌లో కూలిన అమెరికా యుద్ధ విమానం.. ఐదుగురు సిబ్బంది ఆచూకీ గల్లంతు
భారత్ తో పాటు ఇతర దేశాలకు కూడా రష్యన్ చమురు కొనుగోలుకు అమెరికా గ్రీన్‌సిగ్నల్
చమురు ధరలపై యూటర్న్.. పెరిగితే లాభమేనంటున్న ట్రంప్
అబ్రహాం లింకన్ యుద్ధనౌకపై దాడి అవాస్తవం.. ఇరాన్ ప్రచారాన్ని ఖండించిన అమెరికా
పేలుళ్లతో దద్దరిల్లిన దుబాయ్.. కొనసాగుతున్న ఉద్రిక్తత
వారిని అంతం చేస్తున్నా: ఇరాన్‌కు మరోసారి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఆయతుల్లా మోజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర సస్పెన్స్ కొనసాగుతోంది. తన తండ్రి అలీ ఖమేనీ మరణానికి కారణమైన అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మోజ్తబా కూడా తీవ్రంగా గాయపడి కోమాలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, “ఆయన బహుశా బతికే ఉండొచ్చు. కానీ ఆయన పరిస్థితి ఏమాత్రం బాగాలేదు” అని వ్యాఖ్యానించారు.
బ్రిటన్‌కు చెందిన ‘ది సన్’ పత్రిక కథనం ప్రకారం 56 ఏళ్ల మోజ్తబా పరిస్థితి విషమంగా ఉంది. దాడుల్లో ఆయన ఒకటి లేదా రెండు కాళ్లు కోల్పోయారని, కాలేయం వంటి అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం టెహ్రాన్‌లోని సినా యూనివర్సిటీ ఆసుపత్రిలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయనకు చికిత్స అందిస్తున్నారని, ఆయన కోమాలో ఉన్నారని సమాచారం.
మోజ్తబా గాయపడిన విషయాన్ని ఇరాన్ వర్గాలు కూడా పరోక్షంగా అంగీకరిస్తున్నాయి. సైప్రస్‌లోని ఇరాన్ రాయబారి అలీరెజా సలారియన్ మాట్లాడుతూ, “ఆయన కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. అందుకే ప్రస్తుతం ప్రజల ముందుకు వచ్చి ప్రసంగించే స్థితిలో లేరు” అని తెలిపారు. సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఒక్కసారి కూడా ప్రజల ముందుకు రాకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
అయితే, ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ మోజ్తబా పేరుతో ఒక హెచ్చరిక ప్రకటనను విడుదల చేసింది. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలను వెంటనే మూసివేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని ఆ ప్రకటనలో హెచ్చరించారు. సాధారణంగా ఇరాన్లో కొత్త సుప్రీం లీడర్ బాధ్యతలు చేపట్టగానే దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కానీ మోజ్తబా అలా చేయకపోవడం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందనడానికి నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇరాక్‌లో కూలిన అమెరికా యుద్ధ విమానం.. ఐదుగురు సిబ్బంది ఆచూకీ గల్లంతు

ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో అపశ్రుతి చోటుచేసుకుంది. యుద్ధ విమానాలకు గాల్లోనే ఇంధనం నింపే కేసీ-135 ట్యాంకర్ విమానం పశ్చిమ ఇరాక్‌లో కుప్పకూలింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు విమానంలో కనీసం ఐదుగురు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) ఒక ప్రకటన విడుదల చేసింది. మిషన్‌లో భాగంగా రెండు ఇంధన విమానాలు వెళ్లగా, వాటిలో ఒకటి సాంకేతిక కారణాలతో కూలిపోయిందని తెలిపింది. రెండో విమానం సురక్షితంగా బేస్‌కు తిరిగి వచ్చిందని పేర్కొంది. ఇది శత్రువుల దాడి కాదని, కేవలం ప్రమాదం మాత్రమేనని అమెరికా అధికారులు స్పష్టం చేశారు.
విమానం కూలిన వెంటనే అమెరికా రక్షణ శాఖ గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. ఇరాక్‌లోని ఎడారి ప్రాంతంలో విమాన శకలాలను గుర్తించేందుకు డ్రోన్లు, హెలికాప్టర్లను మోహరించారు. అయితే, సిబ్బంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు.
ఫిబ్రవరి చివరి నుంచి కొనసాగుతున్న ఈ ఆపరేషన్‌తో మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్‌లోని కీలక స్థావరాలపై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు దాడులు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం గమనార్హం. కాగా, అమెరికా వాయుసేన ఉపయోగిస్తున్న కేసీ-135 విమానాలు సుమారు 60 ఏళ్ల నాటి పాతవి కావడంతో, తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని గతంలోనే నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. తాజా ప్రమాదానికి కూడా ఇదే కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు.
భారత్ తో పాటు ఇతర దేశాలకు కూడా రష్యన్ చమురు కొనుగోలుకు అమెరికా గ్రీన్‌సిగ్నల్

పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య రాజుకున్న యుద్ధం ప్రపంచ ఇంధన మార్కెట్‌ను కుదిపేస్తోంది. చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటిన నేపథ్యంలో, అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అంతరాయాన్ని తగ్గించేందుకు రష్యా ముడిచమురుపై విధించిన ఆంక్షలను తాత్కాలికంగా సడలించింది.
అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ వెసులుబాటు కొన్ని కఠినమైన షరతులతో కూడుకున్నది. మార్చి 12 నాటికి నౌకల్లో లోడ్ చేసి, ప్రస్తుతం సముద్రంలో చిక్కుకుపోయిన రష్యన్ ముడిచమురు, పెట్రోలియం ఉత్పత్తులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఏప్రిల్ 11 అర్ధరాత్రి వరకు ఈ తాత్కాలిక అనుమతి అమల్లో ఉంటుంది. గతంలో భారత్‌కు ఇచ్చిన ప్రత్యేక వెసులుబాటును ఇప్పుడు ఇతర దేశాలకు కూడా విస్తరించడం గమనార్హం.
ఇది కేవలం సరఫరాను గాడిలో పెట్టేందుకు తీసుకున్న స్వల్పకాలిక చర్య మాత్రమేనని, దీనివల్ల రష్యాకు పెద్దగా ఆర్థిక ప్రయోజనం చేకూరదని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ స్పష్టం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా చూసేందుకే ఈ నిర్దిష్టమైన మినహాయింపు ఇచ్చినట్లు ఆయన వివరించారు.
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై దాడులు మొదలైనప్పటి నుంచి చమురు రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధి దాదాపు మూతపడింది. ప్రపంచ చమురు సరఫరాలో 20 నుంచి 25 శాతం ఈ మార్గం గుండానే జరుగుతుంది. నౌకలపై దాడులు, ఇరాన్ హెచ్చరికలతో షిప్పింగ్ కంపెనీలు వెనక్కి తగ్గడంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఇంధన కొరత ఏర్పడింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు అమెరికా తన వ్యూహాత్మక నిల్వల నుంచి 172 మిలియన్ బ్యారెళ్ల చమురును కూడా విడుదల చేస్తోంది. అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) ప్రకారం ఇది చరిత్రలోనే అతిపెద్ద ఇంధన సరఫరా అంతరాయం. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు 32 దేశాలు కలిసి సుమారు 400 మిలియన్ బ్యారెళ్ల చమురును మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నాయి.
చమురు ధరలపై యూటర్న్.. పెరిగితే లాభమేనంటున్న ట్రంప్

పశ్చిమాసియాలో ఇరాన్‌తో యుద్ధం తీవ్రమవుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వ్యూహాన్ని మార్చారు. గతంలో తక్కువ గ్యాస్ ధరలే తన విజయమని చెప్పుకున్న ఆయన, ఇప్పుడు పెరుగుతున్న చమురు ధరలు దేశ ఆర్థిక వ్యవస్థకు లాభదాయకమని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.
పెరుగుతున్న ధరలపై తన సోషల్ మీడియాలో స్పందించిన ట్రంప్ “అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు. కాబట్టి ధరలు పెరిగితే మనకే ఎక్కువ డబ్బు వస్తుంది” అని పేర్కొన్నారు. అయితే, ఒక ‘దుష్ట సామ్రాజ్యం’ అయిన ఇరాన్‌ను అణ్వస్త్ర శక్తిగా మారకుండా నిరోధించడమే అన్నిటికన్నా ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచాన్ని అణు ముప్పు నుంచి కాపాడటమే తన ప్రథమ కర్తవ్యమని ట్రంప్ నొక్కి చెప్పారు.
మరోవైపు, ఫిబ్రవరి 26న జెనీవాలో జరిగిన అణు చర్చలు విఫలం కావడంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. శాంతియుత ప్రయోజనాలకే యురేనియం వినియోగిస్తామని తాము స్పష్టమైన ప్రతిపాదన చేసినా, అమెరికా ప్రతినిధులు సాంకేతిక అంశాలను అర్థం చేసుకోలేకపోయారని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఆరోపించారు.
ప్రస్తుతం హర్మూజ్ జలసంధి మూసివేత, యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటింది. నవంబర్‌లో జరగనున్న మధ్యంతర ఎన్నికల ముందు అమెరికాలో గ్యాస్ ధరలు 50 శాతానికి పైగా పెరగడంతో ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతోంది. ఈ ఒత్తిడిని పక్కనపెట్టి, ఇరాన్‌పై యుద్ధాన్ని నిర్ణయాత్మక దశకు తీసుకెళ్లడమే లక్ష్యమని ట్రంప్ సంకేతాలిస్తున్నారు. గతంలో తక్కువ ధరలను రాజకీయ అస్త్రంగా వాడుకున్న ఆయన, ఇప్పుడు అధిక ధరలను ఆర్థిక అవకాశంగా చూపడం వ్యూహాత్మక మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
అబ్రహాం లింకన్ యుద్ధనౌకపై దాడి అవాస్తవం.. ఇరాన్ ప్రచారాన్ని ఖండించిన అమెరికా

అమెరికాకు చెందిన విమాన వాహక యుద్ధనౌక ‘యూఎస్ఎస్ అబ్రహాం లింకన్’పై దాడి చేశామని ఇరాన్ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తేలిపోయింది. ఇరాన్ వాదనలను అమెరికా సైన్యం తీవ్రంగా ఖండించింది. ఇది కేవలం ఓ ప్రచార యుద్ధంలో భాగమని స్పష్టం చేస్తూ, నౌక సురక్షితంగా ఉన్నట్లు ఆధారాలు విడుదల చేసింది.
ఇటీవల తమ క్షిపణి, డ్రోన్ దాడుల్లో ‘అబ్రహాం లింకన్’ నౌకకు భారీ నష్టం వాటిల్లిందని, అది యుద్ధరంగం నుంచి వెనుదిరిగిందని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రచారం చేసింది. అయితే ఈ ప్రచారాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ పూర్తిగా కొట్టిపారేసింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు కనీసం నౌకకు సమీపంలోకి కూడా రాలేదని స్పష్టం చేసింది. దీనికి రుజువుగా, నౌక సముద్రంలో సాధారణ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫొటోలు, వీడియోలను అమెరికా విడుదల చేసింది.
ఇదిలా ఉండగా, ఇటీవల అబ్రహాం లింకన్ నౌకకు అత్యంత సమీపంగా వచ్చిన ఓ ఇరాన్ నౌకపై అమెరికా దళాలు కాల్పులు జరిపాయి. ప్రమాదకరంగా దగ్గరికి రావడంతో హెచ్చరికగా కాల్పులు జరిపి, హెలికాప్టర్ ద్వారా హెల్ఫైర్ క్షిపణిని ప్రయోగించి ఆ ఇరాన్ బోటును దెబ్బతీశాయి.
పేలుళ్లతో దద్దరిల్లిన దుబాయ్.. కొనసాగుతున్న ఉద్రిక్తత

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ నగరం శుక్రవారం భారీ పేలుళ్ల శబ్దాలతో దద్దరిల్లింది. నగరం మధ్య భాగంలో పెద్ద ఎత్తున పొగ కమ్ముకోవడంతో పాటు పలు భవనాలు కంపించాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో నగరవాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
నగరంలోని దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (DIFC) వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. దాడిని గాల్లోనే విజయవంతంగా అడ్డుకున్నామని, దాని శకలాలు ఒక భవనం వెలుపలి భాగంపై పడటంతో స్వల్ప నష్టం వాటిల్లిందని దుబాయ్ మీడియా కార్యాలయం ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. ఒక భవనంపై శకలాలు పడినట్లు తాము కూడా భావిస్తున్నామని, పెద్ద పేలుడు శబ్దం వినిపించిందని ఏఎఫ్‌పీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఘటన జరిగిన వెంటనే షేక్ జాయెద్ రోడ్డు వైపు నుంచి సైరన్ల మోత వినిపించింది. దుబాయ్ పోలీసులు వెంటనే ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. అధికారులు స్వల్ప నష్టమని చెప్పినప్పటికీ, భవనానికి గణనీయమైన నష్టం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, గురువారం కూడా దుబాయ్‌లోని అల్ బదా ప్రాంతంలో ఒక “చిన్న డ్రోన్ ఘటన” చోటుచేసుకున్నట్లు అధికారులు ధ్రువీకరించారు.
వారిని అంతం చేస్తున్నా: ఇరాన్‌కు మరోసారి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా అధ్యక్షుడిగా వారిని అంతం చేస్తున్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు. మతిచెడిన నేతలకు ఈరోజు ఏం జరుగుతుందో మీరే చూస్తారని అన్నారు. ఇరాన్ నౌకాదళం ఇప్పటికే కనుమరుగయ్యిందని, ఇక వైమానిక దళం కూడా ఉండదని హెచ్చరించారు. క్షిపణులు, డ్రోన్లు పూర్తిగా ధ్వంసం అవుతున్నాయని ఆయన అన్నారు.
ఇప్పటికే వారి నాయకులు తుడిచిపెట్టుకుపోయారని అన్నారు. అక్కడి పాలకులు 47 ఏళ్ళుగా అమాయకులను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. అందుకే అగ్రరాజ్యం అధ్యక్షుడిగా వారి అంతు చూస్తున్నానని ట్రంప్ అన్నారు.
ఇదిలా ఉండగా, అమెరికాకు చెందిన రీఫ్యూయలింగ్ విమానం కేసీ-135 ట్యాంకర్ ఉత్తర ఇరాక్‌లో కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం సమయంలో విమానంలో ఆరుగురు ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఘటనకు దారి తీసిన చర్యలపై దర్యాప్తు చేస్తున్నామని అమెరికా మిలిటరీ సెంట్రల్ కమాండ్ తెలిపింది.