జనరల్ వార్తలు ...

యుద్ధంలోకి దిగారు సరే ..బయటకు వెళ్లే మార్గమేది …

యుద్ధంలోకి దిగారు సరే ..బయటకు వెళ్లే మార్గమేది …
యుద్ధంలో తమదంటే తమదే పై చేయి అంటున్న ఇరు పక్షాలు …
ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. వెలవెలబోతున్న దుబాయ్ మహానగరం!
ఇరాన్ ఆర్థిక గుండెకాయపై అమెరికా పంజా.. ట్రంప్ ‘మెగా’ అటాక్!
రష్యా చమురు కొనమని ఇండియా సహా ప్రపంచాన్ని అడుక్కుంటున్నారు.. ట్రంప్‌ను ఎద్దేవా చేసిన ఇరాన్
పుతిన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ట్రంప్
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌పై అమెరికా గురి.. ఆచూకీ చెబితే రూ.92 కోట్లు
భారత్‌కు ఇరాన్ స్నేహహస్తం.. హర్మూజ్ జలసంధి దాటిన గ్యాస్ ట్యాంకర్
హర్మూజ్ జలసంధిలో టెన్షన్.. క్షిపణుల మధ్య చిక్కుకున్న 34 మంది భారత నావికులు!
బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై మిస్సైల్ దాడి.. ఇరాన్ చమురు నిల్వలపై ట్రంప్ హెచ్చరిక
మోదీపై మరోసారి ప్రేమ కురిపించిన ట్రంప్.. త్వరలో భారత్‌కు వస్తానని సందేశం

ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. వెలవెలబోతున్న దుబాయ్ మహానగరం!

Dubai Deserted Amidst Iran War Fears

పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధం ప్రపంచంలోని సంపన్నుల స్వర్గధామమైన దుబాయ్ నగరాన్ని అతలాకుతలం చేసింది. నిత్యం పర్యాటకులు, పెట్టుబడిదారులతో కళకళలాడే ఈ మహానగరం ఇప్పుడు కళావిహీనంగా మారి, బోసిపోయింది. ఒకప్పుడు పెట్టుబడులకు, విలాసవంతమైన జీవితానికి ప్రతీకగా నిలిచిన దుబాయ్ ఇప్పుడు యుద్ధ భయంతో వణికిపోతోంది.

యుద్ధ వాతావరణం నేపథ్యంలో నగరంలోని ప్రధాన షాపింగ్ మాల్స్, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. రోడ్లపై జనసంచారం పూర్తిగా నిలిచిపోయింది. ఒకప్పుడు సందర్శకులతో కిటకిటలాడిన బీచ్‌లు ఇప్పుడు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. బుర్జ్ అల్ అరబ్ వంటి ప్రఖ్యాత హోటళ్లపై క్షిపణి దాడులు జరిగాయన్న వార్తలతో ప్రజలు భయంతో ఇళ్లకే పరిమితమయ్యారు. చాలామంది నగరాన్ని విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు.

విమాన సర్వీసులు భారీగా రద్దు కావడంతో పర్యాటక రంగం పూర్తిగా కుదేలైంది. సందర్శకులను ఆకర్షించేందుకు హోటళ్లు భారీ డిస్కౌంట్లు ప్రకటించినా స్పందన కరవైంది. సిటీ, స్టాండర్డ్ చార్టెర్డ్ వంటి అంతర్జాతీయ బ్యాంకులు సైతం తమ కార్యాలయాలను మూసివేశాయి. దీంతో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే నగరాల్లో ఒకటైన దుబాయ్, ఇప్పుడు యుద్ధం కారణంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

ఇరాన్ ఆర్థిక గుండెకాయపై అమెరికా పంజా.. ట్రంప్ ‘మెగా’ అటాక్!

Donald Trump Announces US Attack on Irans Kharg Island

ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ప్రాణాధారమైన ‘ఖర్గ్ ఐలాండ్’పై అమెరికా దళాలు చరిత్రలో నిలిచిపోయే స్థాయి బాంబు దాడులు నిర్వహించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ట్రూత్ సోషల్ వేదికగా ఆయన స్పందిస్తూ “నా ఆదేశాల మేరకు సెంట్రల్ కమాండ్ అత్యంత శక్తివంతమైన దాడిని చేపట్టింది. ఇరాన్ మకుటంలో మణి వంటి ఖర్గ్ ఐలాండ్‌లోని ప్రతి సైనిక కేంద్రాన్ని మేము పూర్తిగా తుడిచిపెట్టాం” అని సంచలన ప్రకటన చేశారు.

ఖర్గ్ ఐలాండ్ కేవలం ఒక ద్వీపం కాదు, ఇరాన్ మొత్తం చమురు ఎగుమతుల్లో సుమారు 96 శాతం ఇక్కడి నుంచే జరుగుతాయి. ప్రస్తుతానికి కేవలం సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని ‘మానవీయ కోణంలో’ చమురు మౌలిక సదుపాయాలను వదిలేశానని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన ‘హోర్ముజ్ జలసంధి’లో ఇరాన్ గనుక అడ్డంకులు సృష్టిస్తే.. ఒక్క క్షణంలో తన నిర్ణయాన్ని మార్చుకుని చమురు క్షేత్రాలను కూడా ధ్వంసం చేస్తానని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

అమెరికా ఆయుధ సంపద ముందు ఇరాన్ రక్షణ వ్యవస్థలు నిలవలేవని, తమ దాడులను అడ్డుకునే శక్తి ఆ దేశానికి లేదని ట్రంప్ ఎద్దేవా చేశారు. ఇరాన్ సైన్యం ఇకనైనా ఆయుధాలు పారేసి, మిగిలి ఉన్న దేశాన్ని కాపాడుకోవడం తెలివైన పని అని సూచించారు. అలాగే, ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని నిర్మించలేదని, అమెరికాను లేదా ప్రపంచాన్ని బెదిరించే శక్తిని ఆ దేశానికి లేకుండా చేస్తామని స్పష్టం చేశారు.

ఖర్గ్ ఐలాండ్ దాడి కేవలం హెచ్చరిక మాత్రమే కాదు, అది ఇరాన్ ఆర్థిక మూలాలను తన గుప్పిట్లోకి తీసుకోవడమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రాంతంపై పట్టు సాధించడం ద్వారా ఇరాన్ ఆదాయాన్ని పూర్తిగా నిలిపివేసి, చర్చల టేబుల్ వద్దకు తీసుకురావడమే అమెరికా వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతుండటంతో, అమెరికా నౌకాదళం త్వరలోనే వాణిజ్య నౌకలకు రక్షణగా రంగంలోకి దిగుతుందని సమాచారం.

రష్యా చమురు కొనమని ఇండియా సహా ప్రపంచాన్ని అడుక్కుంటున్నారు.. ట్రంప్‌ను ఎద్దేవా చేసిన ఇరాన్

Iran mocks Trump over Russia oil plea to world including India

అంతర్జాతీయ చమురు దౌత్యంలో అమెరికా అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై ఇరాన్ తీవ్రంగా మండిపడింది. ఒకప్పుడు రష్యా నుంచి చమురు కొనవద్దని దేశాలపై ఒత్తిడి చేసిన అగ్రరాజ్యం ఇప్పుడు అదే రష్యా చమురును కొనాలంటూ బతిమాలుతోందని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చీ విమర్శించారు. అమెరికా తీరును సోషల్ మీడియా వేదికగా ఆయన ఎద్దేవా చేశారు.

ఇరాన్‌తో యుద్ధ వాతావరణం నెలకొనడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడి బ్యారెల్ ధర 100 డాలర్లు దాటింది. ఈ నేపథ్యంలో చమురు మార్కెట్‌ను స్థిరీకరించేందుకు అమెరికా ప్రభుత్వం రంగంలోకి దిగింది. సముద్రంలో నిలిచిపోయిన రష్యా చమురు నౌకల కొనుగోలుకు వీలుగా ఆంక్షలపై 30 రోజుల పాటు మినహాయింపు ఇచ్చింది. ఈ మినహాయింపు ఏప్రిల్ 11 వరకు వర్తిస్తుందని అమెరికా ట్రెజరీ విభాగం స్పష్టం చేసింది.

ఈ యుద్ధ వాతావరణంలోనూ భారత్‌తో తమ స్నేహబంధాన్ని ఇరాన్ కొనసాగిస్తోంది. భారత్‌కు వస్తున్న రెండు ఎల్‌పీజీ గ్యాస్ నౌకలు హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటేందుకు అనుమతించింది. “భారత్, ఇరాన్ మంచి మిత్రదేశాలు. మాకు ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయి. భారత నౌకలకు ఎల్లప్పుడూ సురక్షిత మార్గం ఉంటుంది” అని భారత్‌లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ హామీ ఇచ్చారు.

పుతిన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ట్రంప్

Trump Suspects Putin Helping Iran in US Israel Conflict

ఇరాన్ తో అమెరికా, ఇజ్రాయెల్‌ జరుపుతున్న యుద్ధంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరాన్‌కు సహకరిస్తూ ఉండొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు ఫాక్స్ న్యూస్ రేడియో ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. రష్యా నుంచి ఇరాన్‌కు కొంతమేర మద్దతు అందుతోందని అనుమానం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

ట్రంప్ ఏమన్నారంటే.. 
‘‘రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్‌కు మేము సాయం చేస్తున్నామని పుతిన్ భావిస్తున్నారు. దానికి ప్రతిగా ఆయన ఇరాన్‌కు సాయం చేస్తూ ఉండవచ్చు’’ అని అన్నారు. ప్రపంచ శక్తుల మధ్య ఇదొక సాధారణ ధోరణిగా మారిందని, తాము ఒక పక్షానికి సాయం చేస్తే చైనా లేదా రష్యా మరో పక్షానికి మద్దతు ఇస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి కీవ్‌కు తాము అండగా ఉన్న విషయాన్ని ట్రంప్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

వచ్చే వారం ఇరాన్ పై తీవ్ర దాడులు
ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమై 14వ రోజుకు చేరుకున్న తరుణంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇటీవల పుతిన్‌తో మాట్లాడినప్పుడు తాము ఇరాన్‌తో ఎలాంటి నిఘా సమాచారాన్ని పంచుకోవడం లేదని రష్యా అధికారులు స్పష్టం చేసినప్పటికీ ట్రంప్ మాత్రం వారిని పూర్తిగా నమ్మడం లేదు. మరోవైపు, వచ్చే వారం తాము ఇరాన్‌పై మరింత తీవ్రస్థాయిలో దాడులు చేయబోతున్నామని ట్రంప్ హెచ్చరించారు. ఈ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై, హర్మూజ్ జలసంధి ద్వారా జరిగే చమురు రవాణాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌పై అమెరికా గురి.. ఆచూకీ చెబితే రూ.92 కోట్లు

Mojtaba Khamenei America targets Irans new Supreme Leader offers reward

ఇరాన్‌తో యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసిన అమెరికా, ఇప్పుడు ఆ దేశ అగ్ర నాయకత్వాన్ని నేరుగా లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీతో పాటు పలువురు ఉన్నతాధికారుల ఆచూకీ తెలిపిన వారికి 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 92.47 కోట్లు) రివార్డు ఇస్తామని సంచలన ప్రకటన చేసింది.

అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ‘రివార్డ్స్ ఫర్ జస్టిస్’ కార్యక్రమం కింద ఈ ప్రకటనను విడుదల చేసింది. మోజ్తబా ఖమేనీతో పాటు రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన కీలక సైనికాధికారులు అలీ అస్ఘర్ హెజాజీ, సెక్యూరిటీ చీఫ్ అలీ లారీజానీ పేర్లను కూడా ఈ జాబితాలో చేర్చింది. కొందరి ఫోటోలు అందుబాటులో లేకపోవడంతో వారి షాడో చిత్రాలను (Silhouettes) ప్రచురించింది.

ఫిబ్రవరి 28న జరిగిన దాడిలోనే మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించగా, ఆయన కుమారుడు, ప్రస్తుత సుప్రీం లీడర్ మోజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు. ఈ దాడిలో ఆయన ముఖం గుర్తుపట్టలేనంతగా మారి ఉండొచ్చని, అందుకే ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి బహిరంగంగా కనిపించడం లేదని అమెరికా అనుమానిస్తోంది.

గత మూడు వారాలుగా ఇరాన్‌పై దాడులు చేస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇప్పటివరకు 15,000కు పైగా లక్ష్యాలను ధ్వంసం చేశాయి. ఈ దాడుల వల్ల ఇరాన్ క్షిపణి సామర్థ్యం 90 శాతం, డ్రోన్ల శక్తి 95 శాతం క్షీణించినట్లు పెంటగాన్ తెలిపింది. “వచ్చే వారం దాడులు మరింత భీకరంగా ఉంటాయి” అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెచ్చరించారు.

మరోవైపు, కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో అంతర్జాతీయంగా చమురు సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో బ్యారెల్ చమురు ధర 100 డాలర్లు దాటి, ప్రపంచ మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఈ సంక్షోభం నేపథ్యంలో ఇరాన్ ప్రజలే తమ నాయకత్వాన్ని కూలదోస్తారని తాము ఆశిస్తున్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు.

యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ: ఆరుగురు సైనికుల మృతి.. 5 విమానాల ధ్వంసం

US Military Suffers Heavy Losses in War with Iran

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో అమెరికాకు శనివారం భారీ నష్టం వాటిల్లింది. ఇరాక్ సరిహద్దులో జరిగిన విమాన ప్రమాదంలో ఆరుగురు అమెరికా సైనికులు మరణించగా, సౌదీ అరేబియాలోని సైనిక స్థావరంపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల్లో ఐదు కీలక విమానాలు దెబ్బతిన్నాయి. ఈ రెండు ఘటనలతో అమెరికా దళాల్లో ఆందోళన నెలకొంది.

పశ్చిమ ఇరాక్ గగనతలంలో ఇంధనం నింపే రెండు ‘KC-135’ విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒక విమానం కుప్పకూలిపోగా, అందులోని ఆరుగురు సిబ్బంది మరణించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ధ్రువీకరించింది. అయితే ఇది శత్రువుల దాడి కాదని అమెరికా స్పష్టం చేయగా, ఆ విమానాన్ని తామే కూల్చివేశామని ఇరాన్ మద్దతున్న ‘ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్’ అనే గ్రూపు ప్రకటించుకుంది.

మరోవైపు, సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడిలో గాల్లోనే యుద్ధ విమానాలకు ఇంధనం నింపే ఐదు అమెరికా విమానాలు దెబ్బతిన్నాయని ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ తన కథనంలో వెల్లడించింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని, దెబ్బతిన్న విమానాలకు మరమ్మతులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు మొత్తం 13 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఏడుగురు కువైట్, సౌదీ స్థావరాలపై జరిగిన డ్రోన్ దాడుల్లో మరణించగా, తాజాగా మరో ఆరుగురు విమాన ప్రమాదంలో మృతి చెందారు. యుద్ధంలో నష్టాలు సహజమని, ఇరాన్‌పై పోరాటం ఆపబోమని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వ్యాఖ్యానించారు. యుద్ధం తీవ్రరూపం దాల్చితే మరణాల సంఖ్య పెరగొచ్చని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలోనే హెచ్చరించడం గమనార్హం.

భారత్‌కు ఇరాన్ స్నేహహస్తం.. హర్మూజ్ జలసంధి దాటిన గ్యాస్ ట్యాంకర్

Iran Offers Support to India Safe Passage for Gas Tanker

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ భారత్‌కు ఇరాన్ కీలక మద్దతు ప్రకటించింది. ఇంధన సరఫరాలో ఆటంకాలు ఎదురవుతున్న తరుణంలో భారత నౌకలకు సురక్షిత మార్గాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా భారత్‌కు చెందిన ఒక ఎల్‌పీజీ ట్యాంకర్ శనివారం ఎలాంటి అడ్డంకులు లేకుండా హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. మరో ట్యాంకర్ కూడా త్వరలోనే భారత్ బయలుదేరనున్నట్లు సమాచారం.

భారత్‌తో ఉన్న సుదీర్ఘ మైత్రి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ తెలిపారు. “భారత్ మాకు మంచి మిత్రదేశం. భారతీయుల కష్టాన్ని మా కష్టంగా భావిస్తాం. ఇరు దేశాలకు ఉమ్మడి ప్రయోజనాలు, భవిష్యత్తు ఉన్నాయి. అందుకే భారత నౌకలకు రక్షణ కల్పిస్తున్నాం” అని ఆయన స్పష్టం చేశారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన తర్వాత ఈ యుద్ధం ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ఇటీవల ఖతార్‌లోని గ్యాస్ క్షేత్రాలపై ఇరాన్ దాడులు చేయడంతో అక్కడి నుంచి సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు ఆందోళనతో సిలిండర్లను బుక్ చేసుకోవడంతో డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గ్యాస్ పంపిణీకి కొత్త మార్గదర్శకాలు జారీ చేసి, దేశీయంగా ఎల్‌పీజీ ఉత్పత్తిని 28 శాతం పెంచింది. అయితే, భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో 70 శాతానికి పైగా ఇతర మార్గాల ద్వారానే వస్తున్నందున ఇంధన సరఫరాకు ఎలాంటి డోకా లేదని కేంద్రం భరోసా ఇచ్చింది. “ప్రపంచంలోనే భారత్ నాలుగో అతిపెద్ద రిఫైనర్. ఇంధన లభ్యతపై ఆందోళన అవసరం లేదు” అని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు.

హర్మూజ్ జలసంధిలో టెన్షన్.. క్షిపణుల మధ్య చిక్కుకున్న 34 మంది భారత నావికులు!

Tension in Hormuz Strait 34 Indian Sailors Stuck Amid Missiles

ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న యుద్ధ మేఘాలు భారత నావికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ముంబైకి చెందిన కెప్టెన్ వీరేంద్ర విశ్వకర్మ, మరో 33 మంది సిబ్బందితో కలిసి మార్చి 2 నుంచి హర్మూజ్ జలసంధి సమీపంలో చిక్కుకుపోయారు. 36 లక్షల గ్యాస్ సిలిండర్లకు సమానమైన భారీ ఎల్‌పీజీ లోడుతో ఉన్న ఈ ట్యాంకర్, ఉద్రిక్తతల కారణంగా ప్రస్తుతం యూఏఈలోని మినా సకర్ పోర్టు వద్ద నిలిచిపోయింది.

అక్కడి భయానక పరిస్థితులను కెప్టెన్ వీరేంద్ర స్వయంగా వివరించారు. “మేము రోజూ ఆకాశంలో క్షిపణులు, డ్రోన్లు ఎగరడం చూస్తున్నాం. నిరంతరం సైరన్ల మోత వినిపిస్తూనే ఉంది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాం” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ వద్ద ప్రస్తుతం 60 రోజులకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని, భారత నౌకాదళం తమకు రక్షణగా వచ్చి సురక్షితంగా స్వదేశానికి తీసుకెళ్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ముంబైలోని కెప్టెన్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనతో గడుపుతున్నారు. “నా భర్త, సిబ్బంది క్షేమంగా తిరిగి రావాలని రోజూ ప్రార్థిస్తున్నాను. ఇంటర్నెట్ సిగ్నల్స్ సరిగ్గా లేక వాట్సాప్ కాల్స్ మధ్యలోనే కట్ అవుతుంటే ప్రాణం పోయినంత పనవుతోంది” అని ఆయన భార్య నిల్పా విశ్వకర్మ కన్నీటిపర్యంతమయ్యారు.

ఇదిలా ఉండగా, భారత్‌తో ఉన్న స్నేహ సంబంధాల దృష్ట్యా ఇరాన్ భారత నౌకలకు ‘గ్రీన్ సిగ్నల్’ ఇస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రెండు భారత ఎల్‌పీజీ ట్యాంకర్లను హర్మూజ్ జలసంధిని దాటేందుకు ఇరాన్ అనుమతించినట్లు తెలుస్తోంది. ఇదే రీతిలో కెప్టెన్ వీరేంద్ర ప్రయాణిస్తున్న నౌకకు కూడా భారత నౌకాదళ రక్షణతో త్వరలోనే సురక్షిత మార్గం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై మిస్సైల్ దాడి.. ఇరాన్ చమురు నిల్వలపై ట్రంప్ హెచ్చరిక

Donald Trump Warns Iran After Missile Attack on Baghdad US Embassy

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకుంటున్నాయి. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ‘గ్రీన్ జోన్’లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై తాజాగా మిస్సైల్ దాడి జరిగింది. ఈ దాడిలో రాయబార కార్యాలయ ఆవరణలోని హెలిప్యాడ్‌ను క్షిపణి నేరుగా తాకడంతో పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. ఇరాన్ అనుకూల మిలీషియా గ్రూపులు ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇరాక్ నుంచి అత్యవసరం కాని సిబ్బందిని వెనక్కి వెళ్లాలని అమెరికా ఆదేశించిన కొన్ని రోజుల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

మరోవైపు, ఇరాన్‌పై అమెరికా తన దాడులను తీవ్రతరం చేసింది. ఇరాన్ చమురు ఎగుమతులకు గుండెకాయ వంటి ‘ఖర్గ్ ఐలాండ్’ పై అమెరికా సెంట్రల్ కమాండ్ భారీ బాంబు దాడి జరిపినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఖర్గ్ ఐలాండ్‌లోని అన్ని సైనిక స్థావరాలను అమెరికా దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయని ఆయన వెల్లడించారు. ‘‘ప్రస్తుతానికి మానవతా దృక్పథంతో చమురు మౌలిక సదుపాయాలను తాకలేదు, కానీ హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు ఇరాన్ ఆటంకం కలిగిస్తే మాత్రం ఆ చమురు క్షేత్రాలను కూడా బూడిద చేయడానికి వెనుకాడను’’ అని ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

అమెరికా హెచ్చరికలపై ఇరాన్ కూడా అంతే దీటుగా స్పందించింది. ఒకవేళ తమ దేశ చమురు మౌలిక సదుపాయాలపై అమెరికా దాడి చేస్తే.. పశ్చిమాసియా ప్రాంతంలోని అమెరికా వాటాలు ఉన్న అన్ని చమురు కంపెనీలను, ఎనర్జీ ప్లాంట్లను ధ్వంసం చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ప్రాంతీయంగా ఉన్న ప్రతి చమురు క్షేత్రాన్ని లక్ష్యంగా చేసుకుని బూడిద కుప్పగా మారుస్తామని ఇరాన్ మిలిటరీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ ఉద్రిక్తతలు ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధానికి దారితీస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.

 మోదీపై మరోసారి ప్రేమ కురిపించిన ట్రంప్.. త్వరలో భారత్‌కు వస్తానని సందేశం

I love India I love Modi Trumps message signals possible India visit

భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు. భారత్, భారత ప్రజల పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ, త్వరలోనే దేశంలో పర్యటించే అవకాశం ఉందని సూచనప్రాయంగా తెలిపారు. ఇవాళ జరిగిన ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2026 సదస్సులో ట్రంప్ పంపిన ఈ సందేశాన్ని అమెరికాకు చెందిన మితవాద కార్యకర్త, ట్రంప్ విధేయురాలు లారా లూమర్ చదివి వినిపించారు.

ఈ సదస్సులో పాల్గొన్న లారా లూమర్, తాను వేదికపైకి రావడానికి సుమారు గంట ముందు అధ్యక్షుడు ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడానని సభికులకు తెలిపారు. ఈ సందర్భంగా ట్రంప్ చెప్పిన మాటలను ఆమె యథాతథంగా వివరించారు. “నాకు ఇండియా అంటే చాలా ఇష్టం. నేను మోదీని ఎంతగానో ఇష్టపడతానని దయచేసి వారికి తెలియజేయండి. ప్రధాని మోదీ ఒక అద్భుతమైన నాయకుడు, నా మంచి స్నేహితుడు. త్వరలోనే మరో పర్యటన కోసం నేను కచ్చితంగా భారత్‌కు వస్తానని భారత ప్రజలకు చెప్పండి” అని ట్రంప్ తనతో అన్నట్లు లూమర్ పేర్కొన్నారు.

అంతర్జాతీయ సంబంధాలు, ప్రపంచ రాజకీయాలపై చర్చ జరుగుతున్న ఈ సదస్సులో లూమర్ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ట్రంప్, మోదీ మధ్య ఉన్న బలమైన స్నేహబంధాన్ని ఈ సందేశం మరోసారి స్పష్టం చేసింది.

గతంలో అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ మధ్య ఉన్న స్నేహం ప్రపంచవ్యాప్తంగా పలుమార్లు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా 2020లో ట్రంప్ భారత పర్యటన సందర్భంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో లక్షలాది మంది ప్రజల మధ్య నిర్వహించిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం వారిద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత బంధానికి నిదర్శనంగా నిలిచింది. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యం వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకుంటూ ఇరువురు నేతలు పలు సందర్భాల్లో ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు.

Related posts

SAS seasonal summer 2018 routes – 5 new destination & 27 new non-stop routes

Ram Narayana

Travel News – How this family of 3 can afford to travel the world year-round

Ram Narayana

My Favorite Fashion Items

Ram Narayana