ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హనుమంత జ్యోతి దొర (హెచ్.జె. దొర) అంత్యక్రియలు శనివారం హైదరాబాద్‌లో అధికార లాంఛనాలతో ముగిశాయి. ఈ సందర్భంగా తెలంగాణ డీజీపీ బి.శివధర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్, సైబరాబాద్ కమిషనర్ ఎం. రమేశ్ స్వయంగా ఆయన పాడెను మోసి, తమ గురుభక్తిని, గౌరవాన్ని చాటుకున్నారు.
శనివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో పలువురు ప్రస్తుత, మాజీ పోలీస్ అధికారులు, సిబ్బంది, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతిమయాత్ర జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం వరకు సాగింది. అక్కడ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించి దొరకు తుది వీడ్కోలు పలికారు.
అంతకుముందు, దొర భౌతికకాయానికి మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవేందర్ గౌడ్, లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన నివాళులర్పించారు. మాజీ డీజీపీలు జితేందర్, అరవిందరావు, విశ్రాంత ఐపీఎస్ అధికారులు రాజీవ్ త్రివేది, కమలాసన్ రెడ్డి తదితరులు పోలీస్ శాఖకు దొర చేసిన సేవలను స్మరించుకున్నారు.
1965 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన హెచ్.జె. దొర, ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక కాలం డీజీపీగా పనిచేసిన అధికారులలో ఒకరు. నక్సలిజాన్ని కట్టడి చేయడంలో, ఫ్రెండ్లీ పోలీసింగ్ వంటి సంస్కరణలు తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 83 ఏళ్ల దొర, శుక్రవారం ఉదయం నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.