కుటుంబంలో ఆస్తుల పంపిణీ వివాదం మరింత ముదిరి న్యాయస్థానాలకు చేరింది. ఈ వ్యవహారంలో తాను తన కుమార్తె వైఎస్ షర్మిలకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నానంటూ వస్తున్న ఆరోపణలను వైఎస్ విజయమ్మ తీవ్రంగా ఖండించారు. తాను ఎవరికీ బినామీని కాదని, స్వతంత్రంగానే నిర్ణయాలు తీసుకుంటున్నానని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు చెన్నైలోని నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) బెంచ్‌కు ఆమె కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు.
జగన్ మోహన్ రెడ్డి, భారతి రెడ్డి తనకు ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్ డీడ్ వాస్తవమేనని విజయమ్మ తన కౌంటర్‌లో పేర్కొన్నారు. క్లాసిక్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ వాటాలను కూడా తగిన ప్రతిఫలం చెల్లించే కొనుగోలు చేశానని, ఈ ఒప్పంద పత్రాలను ఎవరూ కాదనలేరని తెలిపారు. ఒప్పందం ప్రకారం వాటా సర్టిఫికెట్లు, బదిలీ పత్రాలు తనకు అందజేసినప్పుడే కంపెనీలో వారి పాత్ర ముగిసిపోయిందని ఆమె వాదించారు.
ఈడీ జప్తులో ఉన్న వాటాలను బదిలీ చేయకూడదన్న జగన్ వాదన కేవలం ఓ రాజకీయ ఎత్తుగడ మాత్రమేనని విజయమ్మ కొట్టిపారేశారు. సండూర్ పవర్ వాటాలను తనకు బదిలీ చేశాకే ఈడీ జప్తు చేసిందని, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకని ఆమె ప్రశ్నించారు. వాస్తవానికి 2019 ఒప్పందం ప్రకారం సరస్వతి పవర్ కంపెనీ షర్మిలకే చెందాల్సి ఉందని, తన భర్త వైఎస్సార్ ఆశయాల కోసమే ఆ వాటాలను తన నియంత్రణలో ఉంచుకున్నానని వివరించారు.
మరోవైపు, వైఎస్ షర్మిల సైతం ఈ వివాదంపై ఎన్‌సీఎల్‌ఏటీలో కౌంటర్ దాఖలు చేశారు. రాజకీయ కక్ష సాధింపు కోసమే తన పేరును ఈ వివాదంలోకి లాగుతున్నారని ఆరోపించారు. తన తండ్రి వారసత్వాన్ని గౌరవిస్తూ కుదిరిన కుటుంబ అవగాహనను రాజకీయ వివాదంగా మార్చడం దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న చెన్నై ఎన్‌సీఎల్‌ఏటీ బెంచ్, తదుపరి విచారణను ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా వేసింది.
Save or share this story as a newspaper-style Epaper Clip: