వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాల కోసం ముగిసిన ఇవాళ్టి అన్వేషణ
-వివేకా హత్య కేసులో సునీల్ అరెస్ట్
-సునీల్ ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు
-ఆయుధాల కోసం వాగులో అన్వేషణ
-దక్కని ఫలితం
-రేపు కూడా అన్వేషణ
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అరెస్ట్ అయిన సునీల్ కుమార్ యాదవ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా సీబీఐ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాల కోసం పులివెందులలోని రోటరీపురం వాగులో నిన్నటి నుంచి అన్వేషిస్తున్నారు. ఇవాళ కూడా ఉదయం నుంచి ఆయుధాల కోసం శోధించిన అధికారులు వాగులో ఎడమవైపు అన్వేషించడం ముగించారు.
వాగులో మురికినీరు ఉండడంతో, 2 ట్యాంకర్లు, 20 మంది మున్సిపల్ సిబ్బంది సాయంతో తొలగించారు. యంత్రాలతో మట్టిని తొలగించి గాలించినా ఆయుధాల జాడ దొరకలేదు. కాగా, మున్సిపల్ సిబ్బంది రోటరీపురం వాగును సర్వే చేస్తున్నారు. సునీల్ చెప్పిన సమాచారంపై అనుమానంతో సర్వే సిబ్బంది రంగంలోకి దిగారు. ఈ క్రమంలో రేపు కూడా వాగులో ఆయుధాల కోసం అన్వేషణ కొనసాగించాలని సీబీఐ అధికారులు నిర్ణయించారు.
సునీల్ నిజమే చెప్తున్నదా లేదా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు . ఈ కేసుకు సంబంధించి వివేకా కూతురు సునీతా, అల్లుడు , రాజశేఖర్ రెడ్డి లను ఈ రోజు కడప జైలు గెస్ట్ హౌస్ కు పిలిపించి మాట్లాడారు. మిగతా వారితో పాటు డ్రైవర్ దస్తగిరి , ఎర్ర గంగిరెడ్డి పై కూడా నిఘా పెంచారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని వారిని చెప్పారు. రోటరీ పురం వాగులో గాలింపు రేపు కూడా కొనసాగుతుందని సిబిఐ అధికారాలు తెలిపారు.
వివేకా హత్య మిస్టరీ ఛేదించాలనే పట్టుదలతో ఉన్న సిబిఐ అధికారులు అనేక కోణాల్లో కేసు స్టడీ చేస్తున్నారు. ఇప్పటివరకు విచారించిన వారిని కాకుండా కొత్తవారిని కూడా విచారించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా వాచ్ మెన్ రంగన్న ఇచ్చిన సమాచారం మేరకు కొంత పురోగతి కనిపించింది. ఆయుధాలు దొరికితే దాదాపు ఈ కేసు మిస్టరీ మొత్తం వీడే అవకాశం ఉంది.