హుజూరాబాద్ లో దళితబంధు అమలులకు ఉత్తర్వులు …
-నిధులు విడుదల చేసిన తెలంగాణ సర్కార్
-రూ.500 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు
-లబ్ధిదారులను గుర్తించాల్సిందిగా కలెక్టర్ కు ఆదేశాలు
-కలెక్టర్ ఖాతాకు నగదు బదిలీ!
హుజూరాబాద్ లో దళితబంధు అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నుంచే అమలు చేస్తామని గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.2 వేల కోట్లతో పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయనున్న సంగతి తెలిసిందే.
అయితే, ఇటీవల తన దత్తత గ్రామం యాదాద్రి జిల్లాలోని వాసాలమర్రికి వెళ్లిన సీఎం కేసీఆర్.. అక్కడ్నుంచే దళితబంధును మొదలుపెడుతున్నామని ప్రకటించారు. తెల్లారే 70 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున రూ.7 కోట్లను విడుదల చేశారు. కలెక్టర్ ఖాతాకు బదిలీ చేశారు.
తాజాగా హుజూరాబాద్ కూ దళితబంధు నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అందులో భాగంగా రూ.500 కోట్ల నిధులను విడుదల చేశారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా కరీంనగర్ కలెక్టర్ ను ప్రభుత్వం ఆదేశించింది. ఎస్సీ కార్పొరేషన్ నుంచి కలెక్టర్ కు నిధులను పంపించినట్టు పేర్కొంది.
కాగా, హుజూరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని, దాన్ని నిలిపేయాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఇటీవలే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ రాసింది. ఇటు హైకోర్టులోనూ దానిని నిలిపేయాలంటూ వ్యాజ్యాలు దాఖలయ్యాయి.