‘పోలీస్ వారి హెచ్చరిక’ చిత్రంతో సినీ నిర్మాతగా మారిన మాజీ సైనికుడు బెల్లి జనార్ధన్ ఆకస్మికంగా మరణించారు. ఉగాది పండుగ సందర్భంగా అత్తగారి ఊరైన కట్టంగూరుకు వెళ్లిన ఆయన, అక్కడ స్విమ్మింగ్ పూల్‌లో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.
కట్టంగూరులోని స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతుండగా, ప్రమాదవశాత్తు తల బలంగా నీటి అడుగున తగలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన మాజీ సైనికుడు కావడంతో, ఆయన స్వగ్రామమైన నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ ఆకస్మిక ఘటనపై ‘పోలీస్ వారి హెచ్చరిక’ చిత్ర దర్శకుడు బాబ్జి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “సినిమా యూనిట్ తరపున, వ్యక్తిగతంగా నా తరపున నిర్మాత బెల్లి జనార్ధన్ గారి ఆకస్మిక మరణం పట్ల తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తపరుస్తూ వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలుపుకుంటున్నాము,” అని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.